భారత గగనతలంలో Su-57: రష్యాతో డీల్.. చైనా, పాక్‌లకు ఇక వణుకే!

భారత వైమానిక దళం తన శక్తిని అమాంతం పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్-57 (Su-57)ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది.

New Update
india

భారత వైమానిక దళం తన శక్తిని అమాంతం పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్-57 (Su-57)ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచినప్పటికీ, రక్షణ రంగ వర్గాల సమాచారం ప్రకారం.. అల్జీరియా, ఇరాన్‌లతో పాటు భారత్ కూడా ఈ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చేసింది.

మన దేశీయంగా తయారవుతున్న అమ్కా(AMCA) ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 2040 వరకు సమయం పట్టేలా ఉంది. కానీ, మన పొరుగున ఉన్న చైనా తన జె-20 (J-20) యుద్ధ విమానాలతో దూసుకుపోతోంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి భారత్ ముందుగా సిద్ధంగా ఉన్న 40 సుఖోయ్-57 విమానాలను నేరుగా రష్యా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాతే వీటిని భారత్‌లో తయారు చేసే ఒప్పందం కుదుర్చుకోనుంది.

ప్రత్యేకతలు ఇవే! 

ఈ విమానం శత్రువుల రాడార్లకు అస్సలు చిక్కదు. అంటే ఇది ఒక స్టెల్త్ ఫైటర్. ఇందులో వాడే AL-51F-1 ఇంజిన్ చాలా శక్తివంతమైనది. అమెరికాకు చెందిన ఎఫ్-22 కంటే ఇది వేగంగా ప్రయాణించగలదని సమాచారం. దీనివల్ల శత్రు దేశాల భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులు చేయడం చాలా సులభం అవుతుంది. సాధారణ యుద్ధ విమానాలు రాడార్లకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ సుఖోయ్-57ను ప్రత్యేకమైన మెటీరియల్స్,  డిజైన్‌తో తయారు చేశారు. దీనివల్ల శత్రువుల రాడార్ సిగ్నల్స్ దీనికి తగిలి వెనక్కి వెళ్లకుండా పక్కకు దారి మళ్లుతాయి. అంటే శత్రువులకు ఇది గాలిలో ఉన్నా రాడార్ స్క్రీన్‌పై కనిపించదు. అందుకే దీన్ని స్టెల్త్ ఫైటర్ అంటారు.

సుఖోయ్-57 లో ఉన్న థ్రస్ట్ వెక్టరింగ్ అనే టెక్నాలజీ వల్ల ఇది గాలిలో అతి తక్కువ స్థలంలోనే 360 డిగ్రీలు తిరగగలదు. యుద్ధ సమయంలో శత్రు విమానం వెంటాడుతున్నప్పుడు, ఒక్క క్షణంలో దాని వెనక్కి వెళ్లి దాడి చేసే సత్తా దీనికి ఉంది. దీనికి ఆరు వైపులా రాడార్లు ఉంటాయి. అంటే విమానం చుట్టూ 360 డిగ్రీల పరిధిలో ఏం జరుగుతుందో పైలట్ చూడగలడు. దీనివల్ల శత్రువు ఎటు నుంచి వచ్చినా ముందే తెలిసిపోతుంది. అంతేకాదు, ఇందులో వాడే AI పైలట్‌కు యుద్ధ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో సలహాలు ఇస్తుంది.

సాధారణంగా ఏ దేశమూ తన యుద్ధ విమానాలకు సంబంధించిన రహస్యాలను వేరే దేశానికి ఇవ్వదు. కానీ రష్యా మాత్రం ఈ విమానం పూర్తి సాఫ్ట్‌వేర్ రహస్యాలను భారత్‌కు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీనివల్ల ఈ విమానాలకు మన దేశీయ క్షిపణులను, రాడార్లను మనమే అమర్చుకోవచ్చు. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి పెద్ద బూస్ట్‌ అని చెప్పాలి. ఒకవేళ సుఖోయ్-57 భారత్ చేతికి వస్తే, దక్షిణాసియాలో మనదే పైచేయి అవుతుంది. 

భారత్‌కు ఇది ఎందుకు అవసరం?

చైనా దగ్గర ఇప్పటికే J-20 అనే ఐదో తరం యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా అలాంటి టెక్నాలజీ ఉండాలి. మన సొంత అమ్కా రావడానికి సమయం పడుతుంది కాబట్టి, రష్యాతో ఈ డీల్ మనకు కీలకం.  సుఖోయ్-57 లోని ఒక వెర్షన్‌లో వెనక సీట్లో ఉండే ఆఫీసర్.. యుద్ధ విమానంతో పాటు 4 నుంచి 8 భారీ స్టీల్త్ డ్రోన్లను తన కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. అంటే ఒకేసారి ఒక చిన్న సైన్యంలా గాలిలో దాడి చేయొచ్చు. అమెరికాకు చెందిన F-22 Raptor లాంటి విమానాలతో పోలిస్తే, సుఖోయ్-57 తయారీ,  మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ.

Advertisment
తాజా కథనాలు