Agni-5 Missile Test : భారత్ రహస్య ఆపరేషన్... చైనా, పాక్‌లకు నిద్రలేకుండా చేసిన సరికొత్త అస్త్రం!

మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత్.. ఒడిశా నుంచి MIRV సాంకేతికతతో కూడిన అధునాతన అగ్నిక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో MIRV సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా ఇప్పుడు  భారత్ నిలిచింది.

New Update
agni 6

మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత్.. ఒడిశా నుంచి MIRV సాంకేతికతతో కూడిన అధునాతన అగ్నిక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో MIRV సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా ఇప్పుడు  భారత్ నిలిచింది. అయితే ఈ పరీక్షకు సంబంధించి భారత్ ఎలాంటి అదనపు సమాచారాన్ని వెల్లడించలేదు.

మే 8వ తేదీ సాయంత్రం వేళ, అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఆకాశంలోకి ఈ భారీ క్షిపణి దూసుకెళ్లింది. ఆ వెలుగు ఎంత తీవ్రంగా ఉందంటే ఒడిశా, పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా ఆకాశంలో వింతైన కాంతి చారలు కనిపించాయి. కొంతమంది తమ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

సాధారణంగా ఏదైనా క్షిపణిని పరీక్షించే ముందు విమానాలకు, నౌకలకు హెచ్చరికగా నోటామ్ జారీ చేస్తారు. గతంలో భారత్ క్షిపణి పరీక్షలు చేసినప్పుడు 1500 నుండి 2000 కిలోమీటర్ల మేర నోటామ్ ఇచ్చేది. కానీ ఈసారి ఏకంగా 3500 కిలోమీటర్ల పొడవైన ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించింది. బెంగాల్ నుండి హిందూ మహాసముద్రం లోతు వరకు ఈ పరిధి ఉంది. ఇంత పెద్ద ప్రాంతాన్ని బ్లాక్ చేయడంతో భారత్ భారీ ఖండాంతర క్షిపణిని లేదా 10 వేల  కిలోమీటర్ల రేంజ్ ఉండే అగ్ని-6ను సిద్ధం చేసిందని నిపుణులు భావించారు.

ఒక్క క్షిపణిలోనే అనేక బాంబులు

సాధారణంగా ఒక క్షిపణి ఒక్క బాంబును మాత్రమే తీసుకెళ్తుంది. కానీ ఈ MIRV టెక్నాలజీతో ఒక్క క్షిపణిలోనే అనేక బాంబులు ఉంటాయి. ఇది ఆకాశంలోకి వెళ్లిన తర్వాత ఒక్కో బాంబు ఒక్కో దిశలో వెళ్లి వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేస్తుంది. శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పుదోవ పట్టించడానికి ఇది నకిలీ బాంబులను కూడా వదులుతుంది. దీంతో శత్రు దేశం ఏది అసలైన బాంబు అని తెలుసుకునేలోపే విధ్వంసం జరిగిపోతుంది.

ఈ ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ ఆరవ దేశంగా నిలిచింది. 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల ఈ అగ్ని క్షిపణి ఇప్పుడు చైనా, పాకిస్తాన్‌లోని ఏ మూలనైనా తాకగలదు. అయితే, దీని వేగం ఎంత? ఎన్ని బాంబులను మోసుకెళ్లగలదు? వంటి వివరాలను భారత్ ఇప్పటికీ రహస్యంగానే ఉంచింది. లక్ష్యాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని మాత్రమే ప్రకటించింది. ఇది మన బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, శత్రువుల్లో ఒకరకమైన భయాన్ని నింపే వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ క్షిపణి గాలిలో వదిలిన పొగ చారలు వంకరగా, జిగ్-జగ్ ఆకారంలో కనిపించాయి. సాధారణంగా క్షిపణులు నేరుగా వెళ్తాయి, కానీ ఇవి గాలిలో దిశ మార్చుకుంటూ వెళ్లినట్లు కనిపించాయి. ఇది అగ్ని-6లో భాగంగా ఉండే శత్రువును బురిడీ కొట్టించే టెక్నాలజీ అని కొందరు, లేదా ఒకే క్షిపణి నుండి అనేక బాంబులు విడిపోయి వేర్వేరు దారుల్లో వెళ్లడం వల్ల అలా జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు