Europe : యూరప్‌లో చమురు సంక్షోభం.. ఇలా అయితే విమానాలు రద్దే!

ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సంక్షోభం ముదురుతోంది. యూరప్ దేశాల్లో విమాన ఇంధనం నిల్వలు నిండుకుంటున్నాయని, మరో 6 వారాలకు మించి ఇంధనం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది.

New Update
europe

ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సంక్షోభం ముదురుతోంది. యూరప్ దేశాల్లో విమాన ఇంధనం నిల్వలు నిండుకుంటున్నాయని, మరో 6 వారాలకు మించి ఇంధనం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది. ఒకవేళ చమురు సరఫరా పునరుద్ధరించబడకపోతే, త్వరలోనే విమాన సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 

అతిపెద్ద ఇంధన సంక్షోభం

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడమే దీనికి ప్రధాన కారణం. మనం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని బిరోల్ పేర్కొన్నారు. ఈ ప్రభావం వల్ల పెట్రోల్, గ్యాస్, విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, ద్రవ్యోల్బణం మరింత పెరిగేలా చేస్తుందని ఆయన హెచ్చరించారు.

ఈ ఇంధన సంక్షోభం వల్ల కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతాయని, ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, కొరియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ సంక్షోభంలో ముందు వరుసలో ఉన్నాయని బిరోల్ వెల్లడించారు. ధనిక దేశాల కంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పేద దేశాలు దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ ఫీజు వసూలు చేయడాన్ని బిరోల్ తప్పుబట్టారు. ఇలాంటి టోల్ పద్ధతిని అనుమతిస్తే, భవిష్యత్తులో ఆసియాలోని మలక్కా జలసంధి వంటి ఇతర కీలక మార్గాల్లో కూడా ఇలాంటి నిబంధనలే వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. చమురు రవాణా అనేది ఎలాంటి షరతులు లేకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సాగాలని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, యూరప్‌లోని ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లే విమానాలు ఇంధనం లేక రద్దు కానున్నాయనే వార్తలు త్వరలోనే వింటామని ఆయన ముగించారు.

Advertisment
తాజా కథనాలు