JD Vance : ట్రంప్ ను ఎర్రిపప్ప చేస్తున్నారా?: జేడీ వాన్స్ షాకింగ్ కామెంట్స్!

ట్రంప్‌కు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుండి వాస్తవ సమాచారం అందడం లేదని, యుద్ధం గురించి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెంటగాన్ నివేదికలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
FotoJet - 2026-04-29T125458.883

JD Vance's shocking comments

JD Vance : ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తరుణంలో ఆ దేశ సుప్రీం లీడర్ మరణించడంతో, అక్కడి పాలనా యంత్రాంగం కుప్పకూలి అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని వాషింగ్టన్ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. అమెరికా సైనిక శక్తి ముందు ఇరాన్ నిలబడలేదని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో యుద్ధం ముగింపు కోసం అగ్రరాజ్యం ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుండి వాస్తవ సమాచారం అందడం లేదని, యుద్ధ గమనం గురించి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ,జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డ్యాన్ కేన్ ఇస్తున్న నివేదికలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రమైన అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత ఎనిమిది వారాలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ వాయుసేన, నౌకాదళం, రక్షణ వ్యవస్థలను నామరూపాలు లేకుండా చేశామని, అమెరికా ఆయుధ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని హెగ్‌సెత్ బృందం ట్రంప్‌కు నివేదిస్తోంది. అయితే, ఈ "అతిశయోక్తి" నివేదికల వెనుక వాస్తవాలు దారి తప్పాయని వెన్స్ భావిస్తున్నారు. అంతర్గత సమావేశాల్లో ఆయన పెంటగాన్ అధికారులను నిశితంగా ప్రశ్నిస్తూ, యుద్ధరంగంలో ఉన్న అసలు సవాళ్లను ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన క్షిపణి (Missile) నిల్వలు వేగంగా హరించుకు పోతున్నాయన్న వార్తల నేపథ్యంలో, నిల్వల కొరతను తక్కువ చేసి చూపడం వల్ల భవిష్యత్తులో రష్యా, చైనా లేదా ఉత్తర కొరియాతో తలెత్తే ఘర్షణల్లో అమెరికా రక్షణ లేని స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఈ ఉద్రిక్తతల వెనుక వ్యక్తిగత, రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తన బ్రీఫింగ్స్‌ను ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకే షెడ్యూల్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ 'ఫాక్స్ న్యూస్' చూస్తుంటారని, ఆ సమయంలో ఆయనను ప్రసన్నం చేసుకునేలా, ఆయన వినాలనుకునే విజయ గాథలను మాత్రమే వినిపిస్తూ హెగ్‌సెత్ ఒక రకమైన 'భ్రమ'ను కల్పిస్తున్నారని వెన్స్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. యుద్ధం చాలా గొప్పగా జరుగుతోందన్న చిత్రాన్ని అధ్యక్షుడి ముందు ఉంచడం వల్ల, సరైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని ఉపాధ్యక్షుడు భయపడుతున్నారు.

బయటి ప్రపంచానికి వెన్స్, హెగ్‌సెత్ పరస్పరం గౌరవించుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సైద్ధాంతిక పోరు సాగుతోంది. జేడీ వాన్స్ అధికారులపై నేరుగా ఆరోపణలు చేయకుండానే, వ్యూహాత్మక ప్రశ్నల ద్వారా వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రక్షణ బృందంలో చీలికలు రాకుండా జాగ్రత్త పడుతూనే, యుద్ధం వల్ల తలెత్తే దీర్ఘకాలిక ఆర్థిక,సైనిక పరిణామాల గురించి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా తన మొత్తం ఆయుధాగారాన్ని ఇరాన్ పైనే ఖర్చు చేస్తే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆయన వాదన.

మొత్తానికి, ఇరాన్ యుద్ధం అనుకున్నంత సులభంగా ముగియకపోవడంతో వైట్ హౌస్ లోపల సమాచార యుద్ధం మొదలైంది. రక్షణ శాఖ ఇస్తున్న 'అంతా బాగుంది' అనే నివేదికల్లోని లోపాలను ఎత్తిచూపడం ద్వారా ట్రంప్‌ను అప్రమత్తం చేయాలని వాన్స్ ప్రయత్నిస్తున్నారు. కేవలం ప్రస్తుత విజయంపైనే కాకుండా, అమెరికా భవిష్యత్తు రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెబుతున్నారు. ఈ అంతర్గత విభేదాలు మరియు సమాచార లోపం యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తాయనేది ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు