/rtv/media/media_files/2026/05/14/trump-2026-05-14-14-02-56.jpg)
America's arms embargo for Israel
US Iran War Updates : ఇరాన్‌తో జరుగుతున్న భీకర యుద్ధం మధ్య అంతర్జాతీయంగా ఒక సంచలన నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ దాడుల నుండి ఇజ్రాయెల్‌ను రక్షించే క్రమంలో అమెరికా తన క్షిపణి నిధులు (మిస్సైల్ స్టాక్) సగానికి పైగా కోల్పోయిందని, అదే సమయంలో ఇజ్రాయెల్ మాత్రం తన స్వంత ఆయుధ సంపత్తిని కాపాడుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యానికి సరికొత్త సవాలుగా మారింది.
ప్రముఖ అమెరికన్ వార్తాపత్రిక 'ది వాషింగ్టన్ పోస్ట్' కథనం ప్రకారం.. ఇరాన్‌తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ బాధ్యతను సింహభాగం అమెరికాయే మోసింది. దీనివల్ల అమెరికాకు చెందిన అత్యంత అధునాతన మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల నిల్వలు గణనీయంగా క్షీణించాయి. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆయుధాల కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా తన రక్షణ బాధ్యతలను అమెరికా సక్రమంగా నిర్వహించగలదా లేదా అనే ఆందోళనలు మొదలయ్యాయి.
ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా ఏకంగా 200 కంటే ఎక్కువ థాడ్ (THAAD - Terminal High Altitude Area Defense) ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది.తూర్పు మధ్యధరా సముద్రంలో మోహరించిన తన నౌకాదళ నౌకల నుండి 100 కంటే ఎక్కువ స్టాండర్డ్ మిస్సైల్-3 (SM-3), స్టాండర్డ్ మిస్సైల్-6 (SM-6) ఇంటర్‌సెప్టర్లను లాంచ్ చేసింది.దీనివల్ల అమెరికా వద్ద ఉన్న మొత్తం క్షిపణి నిల్వల్లో దాదాపు సగం ఖాళీ అయిపోయాయి.దీనికి భిన్నంగా ఇజ్రాయెల్ కేవలం 100 కంటే తక్కువ 'ఆరో' (Arrow) ఇంటర్‌సెప్టర్లను, దాదాపు 90 'డేవిడ్స్ స్లింగ్' (David's Sling) ఇంటర్‌సెప్టర్లను మాత్రమే వాడింది. వీటిలో కొన్నింటిని యెమెన్, లెబనాన్‌లలోని ఇరాన్ అనుకూల శక్తులు ప్రయోగించిన చిన్నపాటి దాడులను అడ్డుకోవడానికే ఉపయోగించింది.
అమెరికా క్షిపణి నిల్వలు సగానికి పడిపోవడంతో జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ అకస్మాత్తుగా చైనా లేదా ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు పెరిగితే, తమను రక్షించడానికి అమెరికా వద్ద తగినన్ని క్షిపణులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టిమ్సన్ సెంటర్ సీనియర్ ఫెలో కెల్లీ గ్రీకో మాట్లాడుతూ.. ఈ గణాంకాలు నిజంగానే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా మిస్సైల్ డిఫెన్స్ భారాన్ని మోస్తుంటే, ఇజ్రాయెల్ తన ఆయుధాలను దాచిపెట్టుకుందని విమర్శించారు. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 200 థాడ్ ఇంటర్‌సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటి ఉత్పాదక సామర్థ్యం డిమాండ్ కంటే చాలా నెమ్మదిగా ఉందని ఆమె హెచ్చరించారు.
డోలాయమానంలో ట్రంప్ ప్రభుత్వం
అమెరికా-ఇజ్రాయెల్ భాగస్వామ్యం గురించి బయటకు కనిపించే ప్రచారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న అసలు సైనిక భారానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం తమ కొన్ని మిస్సైల్ డిఫెన్స్ బ్యాటరీలను నిర్వహణ (రైంటెనెన్స్) కోసం తాత్కాలికంగా మూసివేయడానికి సిద్ధమవుతోంది. ఒకవేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వ్యతిరేకంగా మళ్లీ సైనిక చర్యలకు దిగితే, అమెరికా క్షిపణి నిల్వలపై ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తోసిపుచ్చింది. ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఆయుధాల వినియోగ సమతుల్యతను పెంటగాన్ సమర్థించింది. పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెల్ మాట్లాడుతూ.. "బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్‌సెప్టర్లు అనేవి కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అనేక రకాల అధునాతన సాంకేతికతలు కలిసి పనిచేసే ఒక సమగ్ర రక్షణ వలయం" అని పేర్కొన్నారు.'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు రక్షణ భారాన్ని సమానంగా పంచుకున్నాయని, ఈ ఆపరేషన్‌లో ఇరుదేశాలు యుద్ధ విమానాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సాంకేతికతలను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించాయని ఆయన స్పష్టం చేశారు.
Follow Us