Sahara Desert : సహారా ఎడారిలో ఘోర విషాదం: దాహంతో 49 మంది మృతి

పశ్చిమాఫ్రికాలోని నైజర్ దేశంలో అత్యంత దారుణమైన, హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారి నడిబొడ్డున తాగేందుకు చుక్క నీరు దొరక్క, తీవ్రమైన ఎండలను తట్టుకోలేక మహిళలు, పిల్లలతో సహా మొత్తం 49 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
FotoJet - 2026-06-06T093850.214

Sahara Desert tragedy

Sahara Desert : పశ్చిమాఫ్రికాలోని నైజర్ దేశంలో అత్యంత దారుణమైన, హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారి నడిబొడ్డున తాగేందుకు చుక్క నీరు దొరక్క, తీవ్రమైన ఎండలను తట్టుకోలేక మహిళలు, పిల్లలతో సహా మొత్తం 49 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ప్రయాణిస్తున్న ట్రక్కు ఎడారి మధ్యలో అకస్మాత్తుగా పాడైపోవడమే ఈ భారీ విషాదానికి కారణమైంది. నిర్జన ప్రదేశంలో వాహనం నిలిచిపోవడంతో సాయం అందక రోజుల తరబడి వారు అక్కడే నరకయాతన అనుభవించారు.

అధికారుల వివరాల ప్రకారం.. ప్రాణాలు కోల్పోయిన బాధితులంతా నైజర్‌ దేశానికి చెందినవారే. వీరంతా పొరుగు దేశమైన మాలీలో జరిగిన ఒక ప్రాంతీయ, మతపరమైన వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ పండుగ ముగించుకుని తిరిగి తమ స్వదేశానికి లారీలో బయలుదేరారు. ఈ క్రమంలో నైజర్-మాలి-అల్జీరియా సరిహద్దులకు సమీపంలో, ఉత్తర నైజర్‌లోని అస్సామాకా పట్టణానికి పశ్చిమంగా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్య ఎడారి ప్రాంతంలో వారి వాహనం చెడిపోయింది.

వాహనం ఆగిపోయిన వెంటనే డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు దాన్ని బాగు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ ప్రాంతం పూర్తిగా జనావాసాలకు దూరంగా ఉండటంతో వారికి ఎటువంటి బాహ్య సహాయం లభించలేదు. దీంతో ప్రయాణికులంతా రోజుల తరబడి ఎడారిలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సహారా ఎడారిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటం, ఉన్నట్టుండి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో తీవ్రమైన ఉక్కపోత, దాహానికి తట్టుకోలేక ప్రయాణికులు ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు.

ఈ నరకకూపం నుండి ఎలాగైనా బయటపడాలని భావించిన ఇద్దరు ప్రయాణికులు మాత్రమే సాహసించి ప్రాణాలతో బయటపడ్డారు. లారీ ఆగిపోయిన తర్వాత వారు సహాయం కోసం తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని, ఎడారి ఇసుక తిన్నెలపై దాదాపు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కాలినడకన ప్రయాణించారు. ఎట్టకేలకు ఒక చోట వారికి తాగునీరు దొరకడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత వారు అస్సామాకా పట్టణానికి చేరుకుని స్థానిక అధికారులను కలిసి ఎడారిలో జరిగిన దారుణాన్ని వివరించారు.

సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడి దృశ్యాలు రక్షక సిబ్బందిని సైతం కన్నీరు పెట్టించాయి. అధికారులు అక్కడికి చేరుకునే సరికి ట్రక్ కింద, చుట్టుపక్కల ప్రాంతాల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లారీలో ఉన్న 49 మంది అప్పటికే మరణించారు. బాధితులు ఎడారిలో ఖచ్చితంగా ఎన్ని రోజులు చిక్కుకుపోయారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, వారు పడిన దాహార్తి ఆ మృతదేహాల స్థితిని బట్టి స్పష్టమైంది.

సహారా ఎడారిలో విపరీతమైన వేడి ఎక్కువగా ఉండటం వల్ల, అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే మృతదేహాలు చాలా వరకు కుళ్ళిపోయే స్థితికి చేరుకున్నాయి. వాటిని నగరానికి లేదా వారి స్వగ్రామాలకు తరలించే పరిస్థితి లేకపోవడంతో, అధికారుల సమక్షంలోనే ఆ 49 మంది మృతదేహాలను ఎడారిలోనే సామూహిక సమాధుల్లో అత్యంత వేదనభరితమైన వాతావరణంలో ఖననం చేశారు. ఈ ఘోర ఉదంతం స్థానికంగానే కాక అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Advertisment
తాజా కథనాలు