Qatar: నేవీ మాజీ అధికారులకు ఊరట.. మరణ శిక్ష నుంచి జైలు శిక్షకు తగ్గించిన ఖతార్ కోర్టు

గూఢచర్యం కేసులో ఉరి శిక్ష పడి ఖతార్ లో నిర్బంధాన్నెదుర్కొంటున్న భారత నావికాదళ మాజీ అధికారులకు ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను జైలు శిక్షగా మారుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

New Update
Qatar: నేవీ మాజీ అధికారులకు ఊరట.. మరణ శిక్ష నుంచి జైలు శిక్షకు తగ్గించిన ఖతార్ కోర్టు

Qatar: గూఢచర్యం కేసులో ఉరి శిక్ష పడి ఖతార్ లో నిర్బంధాన్నెదుర్కొంటున్న భారత నావికాదళ మాజీ అధికారులకు ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను జైలు శిక్షగా మారుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడైన తర్వాతే శిక్షను ఎంత తగ్గించారన్న విషయమై స్పష్టత రానుంది. తాము మొదటి నుంచి వారికి అండగా ఉన్నామని, దౌత్యపరమైన సంప్రదింపులతోపాటు చట్టపరంగా కూడా సహకరిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఖతార్‌ అధికారులతో కూడా ఈ విషయంపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నది.

గూఢచర్యం కేసులో ఇరుక్కుని భారత నేవీకి 8 మంది మాజీ అధికారులు ఖతార్‎లో మరణశిక్షకు గురైన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత ఇతర సేవలందించే ప్రైవేటు సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసిన ఇండియన్ నేవీ మాజీ అధికారులు కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కెప్టెన్‌ సౌరభ్‌, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, కమాండర్‌ తివారీ, కమాండర్‌ సుగుణాకర్‌ పాకాల, కమాండర్‌ సంజీవ్‌ గుప్త, సెయిలర్‌ రాగేశ్‌పై ఇజ్రాయెల్‌ కోసం ఓ సబ్‌మెరైన్‌ ప్రోగ్రాంకు సంబంధించి గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఖతార్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వారిని 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకోగా, ఈ ఏడాది అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది.

ఇది కూడా చదవండి: RGV – Barrelakka: ఆర్జీవీపై బర్రెలక్క కేసు.. నోరు జారొద్దంటూ హెచ్చరించిన లాయర్

ఈ నేపథ్యంలో భారత నేవీ మాజీ అధికారుల కుటుంబ సభ్యులు, న్యాయ బృందాలతో సమన్వయం చేసుకుంటూ దౌత్యపరమైన చర్చలతో పాటు న్యాయపరమైన పోరాటం చేస్తామని కేంద్రం వెల్లడించింది. అందులో భాగంగానే మరణ శిక్షను న్యాయస్థానంలో అప్పీలు చేసింది. ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన ఖతార్‌ న్యాయస్థానం మరణశిక్షను జైలు శిక్షగా తగ్గిస్తూ తీర్పు వెలువరించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు