KCR: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది?

తెలంగాణ ఎన్నికలు కేసీఆర్‌ను జాతీయ నాయకుడిని చేస్తాయా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ నేషనల్‌ వైడ్‌ హీరోగా మారనున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి నోటా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్త, కాలమిస్ట్‌, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్‌ జర్నలిస్ట్ పెంటపటి పుల్లారావు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేసీఆర్ గెలిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా తిప్పలు తప్పవని విశ్లేషించారు. రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తారన్నారు.

New Update
KCR: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది?

వచ్చే ఏడాదితో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 10ఏళ్లు పూర్తవుతుంది. ఓవైపు కాంగ్రెస్‌(Congress) 2004, 2009 ఎన్నికల ఫలితాలను రిపీట్‌ చేయాలని భావిస్తోంది. భారత రాజకీయాలు 2014 ముందు నాటికి తిరిగి రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇటు మోదీ(Modi) హ్యాట్రిక్‌ కొట్టలాని గట్టిగా డిసైడ్ అయ్యారు. 2024 జనరల్ ఎలక్షన్స్ భారత్‌ రాజకీయాల భవిష్యత్‌ను నిర్ణయిస్తానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే సమయంలో యావత్‌ దేశం చూపు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్‌(KCR) పాత్ర ఎలా ఉండనున్నదానిపై ఈ ఎలక్షన్స్ తర్వాత ఓ క్లారిటీ రానుంది.

కేసీఆర్‌ను తెలంగాణ ఎన్నికలు జాతీయ నాయకుడిని చేస్తాయా?
దేశంలో కేవలం 17 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ సాపేక్షంగా చిన్న రాష్ట్రం. ఎంపీల సంఖ్య కేరళ కన్నా కూడా తెలంగాణలో తక్కువ. పెద్ద రాజకీయ రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. కానీ ఎంపీలు ఎంతమంది ఉన్నరన్నది కొన్నిసార్లు అసలు మేటర్‌ కాదు. తెలంగాణలో వచ్చే ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయించనున్నాయి. 5 రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3న రానున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల ఎన్నికల కంటే తెలంగాణ ఫలితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

తెలంగాణ ఎందుకు ముఖ్యమైనది?
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి. మరే ఇతర ప్రాంతీయ పార్టీ లేదు. మిజోరంలో స్థానిక చిన్న ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. ప్రతిపక్షంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. దేశంలో తెలంగాణలో ఉన్నట్టు రాజకీయాలు నడుస్తున్న మరో రాష్ట్రం ఒక్క ఒడిశా మాత్రమే. ఇక్కడ ప్రాంతీయ నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో పాత్ర పోషించాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేయడం ఆయన ప్రత్యేకత. మరే ఇతర ప్రాంతీయ ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పే ధైర్యం లేదు.

తెలంగాణలో ఎవరు గెలుస్తారు?
రానున్న కొద్ది వారాల్లో, అన్ని రకాల పోల్ సర్వేలు బయటకు వస్తాయి. వాటిలో చాలా సర్వేలకు ఏదో ఒక రాజకీయ పార్టీ రహస్యంగా నిధులు సమకూరుస్తుంది. ఓటర్ల నాడి బయటకు తెలిసేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం కేసీఆర్ మాత్రమే తన అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ ఆచితూచి తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన అనేక మందిలో వారు ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

కేసీఆర్ గెలిస్తే..?
తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే జాతీయ స్థాయిలో పూర్తి విశ్వాసంతో దూసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు లోక్‌సభ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరు కూడా. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకత్వాన్ని అంగీకరించడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నారు. అందుకే 'INDIA' కూటమిలో చేరేందుకు కేసీఆర్‌ ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌తో కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. అటు కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని కచ్చితంగా యాక్టివేట్ చేస్తారు. తెలంగాణలో గెలిస్తే కేసీఆర్ చరిష్మా పెరుగుతుంది. రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తారు. కేసీఆర్ గెలిస్తే ప్రాంతీయ నేతలు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, జార్ఖండ్‌కు చెందిన సోరెన్, బీహార్‌కు చెందిన నితీష్ కుమార్, ఉద్ధవ్ థాకరే సంతోషిస్తారు కూడా. కాంగ్రెస్ తమపై ఆధిపత్యం చెలాయించడం ఈ పార్టీలకు ఇష్టం లేదు.

ప్రతిపక్షానికి నాయకత్వం వహించాలంటే కాంగ్రెస్ తెలంగాణను గెలవాలి:
ప్రతిపక్షానికి నాయకత్వం వహించాలంటే కాంగ్రెస్ తెలంగాణను గెలవాల్సిన అవసరం ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటకను గెలుచుకున్న కాంగ్రెస్‌ తెలంగాణపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం హైకమాండ్ మొత్తం దృష్టి కేంద్రీకరించింది. కర్నాటకలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అనుసరిస్తోంది. వాగ్దానాల ఆధారంగానే విజయం సాధించాలని భావిస్తోంది. అయితే కర్నాటకలో ఉన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద నాయకుడు లేకపోవడం ప్రతికూలంశంగా చెప్పొచ్చు.

కేసీఆర్ విశిష్టమైన వ్యక్తిత్వం తెలంగాణను ఒక క్లిష్టమైన రాష్ట్రంగా మార్చింది. పలువురు ప్రాంతీయ నేతలు కాంగ్రెస్ కూటమిలో చేరగా, కేసీఆర్ మాత్రం అందుకు నిరాకరించారు. మిగిలిన 4 రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాంలలో జాతీయ నాయకుడు ఎవరూ లేరు. కేసీఆర్ గెలిస్తే తెలంగాణ నుంచే కొత్త జాతీయ నాయకుడు ఆవిర్భవిస్తాడు!

కేసీఆర్ గెలిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా తిప్పలు తప్పవు. కేసీఆర్‌ను కాంగ్రెస్‌ అడ్డుకోలేకపోతే కర్ణాటక వ్యూహం విఫలమైనట్టే లెక్క.
బీజేపీకి తెలంగాణలో ఓడిపోయినా పెద్ద నష్టం లేదు కానీ.. కాంగ్రెస్‌ మాత్రం ఇక్కడ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ ఓడిపోతే హీరో కాదు జీరో అవుతాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదుగుతారో లేదా అన్నది ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

పెంటపాటి పుల్లారావు:

ఆర్థికవేత్త

కాలమిస్ట్‌

మానవ హక్కుల యాక్టివిస్ట్

సీనియర్‌ జర్నలిస్ట్,

5, 000 పైగా రాజకీయ విశ్లేషణలతో కూడిన వ్యాసాలు, ఫీచర్ కథనాలు రాశారు.

ALSO READ:  చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ .. నెక్ట్స్‌ ఏం జరగబోతోంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు