వరద బాధితులను పట్టించుకోరా..

ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరదల వళ్ల ఇళ్లు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద ప్రభావిత ప్రాంత వాసులను పరామర్శించి వారికి కూరగాయలు,, గడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు

New Update
వరద బాధితులను పట్టించుకోరా..

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇళ్లు నీట మునగడంతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద బాధితులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో పర్యటించి బాధితులకు కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు దేశం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ముంపునకు గురైన ప్రాంతాలను అధికార పార్టీ నేతలు ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు. వారు తినడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముంపు ప్రాంత వాసులకు ఆర్‌&ఆర్‌ ప్యాకేజీ కింద 10 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం.. కనీసం 10 వేలు కూడా ఇవ్వలేక అయిందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పుకుంటు వస్తూ కాలయాపన చేస్తోందని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో ముంపు ప్రాంత వాసులను కలుస్తారు తప్ప.. వారు ఆపదలో ఉన్న సమయంలో కలవరని విమర్శించారు. గతంలో వచ్చిన వరదలకు జగన్‌ సర్కార్‌ నష్ట పరిహారం ప్రకటించిందన్న ఆయన.. ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందించలేకపోయిందని మండిపడ్డారు. భారీగా వచ్చిన వరదల వల్ల మత్య్సకారులు సర్వం కోల్పోయారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత నాలుగేళ్లలో సీఎం జగన్‌ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దొరికిన కాడికి దోచుకోవడమే అతని పనిగా మారిపోయిందన్నారు. నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి వైసీపీ నేత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. జగన్‌ తెచ్చిన అప్పులు ప్రజలకు భారంగా మారాయని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. బటన్‌ నొక్కి డబ్బు రిలీజ్‌ చేసే సీఎం.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చెప్పాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో కూర్చొని బటన్‌ నొక్కడం కాదన్న ఆయన.. జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు మార్గాన పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలన్నారు.

అవినీతి పరుడిగా మారిన జగన్.. రాష్ట్రంలో లిక్కర్‌ లేకుండా చేస్తామని చెప్పి తన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న మద్యాన్ని విక్రయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌ మోహన్ రెడ్డి అవినీతిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడం ఖాయమన్నారు. వైసీపీ నేతల అవినీతిపై ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడతున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు