గద్దరన్నా.. ఇక సెలవ్.. అశ్రు నయనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు అధికారిక అంచనాల మధ్య ముగిశాయి. అంతకుముందు అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

New Update
గద్దరన్నా.. ఇక సెలవ్.. అశ్రు నయనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు మహాబోధి పాఠశాలలో ముగిశాయి. అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రగతి భవన్ నుంచి అల్వాల్ చేరుకున్న కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, రసమయి బాలకిషన్ తదితర నేతలు ఉన్నారు.

ప్రజా యుద్ధ నౌక గద్దర్(74) ఇకలేరు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. చివరికి ఆరోగ్యం విషమించి ఆదివారం(ఆగస్టు 6) తుదిశ్వాస విడిచారు. 1949లో మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు.1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా గద్దర్ చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. ఆయనకు ముగ్గురు పిల్లలు– సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపోయారు) వెన్నెల ఉన్నారు.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. "బండెనక బండి కట్టి" అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక బుల్లెట్ ఆయన శరీరంలో ఇప్పటికీ ఉంది. అపోలో ఆసుపత్రిలో మరణించిన గద్దర్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంకు తరలించారు.

ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ (KTR), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయాణ, సినీ నటులు మంచు మోహన్ బాబు, మనోజ్, పరుచూరి గోపాలకృష్ణ, కాంగ్రెస్ నేత వీహెచ్, బీజేపీ సీనియర్ నేత స్వామిగౌడ్, గాయని మధుప్రియ తదిరతులు నివాళులర్పించారు.

మరోవైపు గద్దర్ మృతితో తన సొంత స్వగ్రామం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తూప్రాన్ పట్టణంలో గద్దర్ మృతికి సంతాపంగా స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. తెలంగాణ ఉద్యకారులు, గాయకులు, కళాకారులు తూప్రాన్లో ర్యాలీ నిర్వహించి గద్దర్‌కు నివాళులర్పించారు. ఉదయం నుంచే వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు ప్రాంతానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ తన సైకత శిల్పంతో గద్దర్‌కు ఘన నివాళులర్పించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి గద్దర్ సైకత శిల్పానికి రూపునిచ్చారు. అనేక ప్రాంతాల్లో గద్దర్ తన గళాన్ని విప్పి ప్రజా చైతన్య కల్పించారని సనత్ కుమార్ తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అన్నారు.

ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడంపై యాంటి టెర్రరిజం ఫోరం(ATF) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమే అని మండిపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది.

ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) స్పందించింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ప్రకటన విడుదల చేసింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరని పేర్కొంది. గద్దర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు