/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Former-ministers-son-Ajmira-Prahlad-joined-BJP-jpg.webp)
కమలం గూటికి బీఆర్‌ఎస్ అసంతృప్త నేత
ఈనెల 12వ తేదీ రోజున బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు మాజీ మంత్రి తనయుడు అజ్మీర ప్రహ్లాద్ చేరనున్నారు. మాజీ మంత్రి చందూలాల్ కొడుకు ప్రహ్లాద్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధం అయింది. ఈ నెల 12 ముహుర్తం ఖరారు చేశారు. కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. అంతేకాకుండా ములుగులో భారీ బహిరంగ సభకు సన్నాహం చేస్తున్నారు. ములుగు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ కుమారుడు డా. అజ్మీర ప్రహ్లాద్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరనున్నారు. ఇందుకోసం ఈనెల 12న ముహుర్తం ఖరారు చేసినట్లు బిజెపి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
క్యాడర్‌ను కాపాడుకునేందుకు
డా. ప్రహ్లాద్ చేరిక కోసం ములుగు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించనున్న సమాచారం, తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి స్వర్గీయ చందూలాల్ ములుగు రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. ఆయన మీదున్న గౌరవంతో కేసీఆర్ రెండు సార్లు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గౌరవించాడు. మొదటి సారి 2014లో గెలువగా మంత్రి పదవి ఇచ్చారు. రెండవ సారి 2018 లో జరిగిన ఎన్నికల్లో అందరిని కాదని సీఎం కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వగా సీతక్క మీద ఓటమి పాలయ్యాడు. ఇక అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం, పార్టీ శ్రేణులు సైతం ఆహ్వానించకపోవడం జరిగిందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత చందూలాల్ అనారోగ్యం కారణంగా మరణించగా, ఇక అప్పటి నుండి డా. ప్రహ్లాద్ బీఆర్ఎస్ పార్టీతో అంటినట్లు ఉన్నప్పటికీ తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఆయన స్వయంగా ములుగు జిల్లాలో వివాహాది శుభాకార్యక్రమాలకు, వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం జరుగుతుండేది.
చేరతారా ? లేదా ? అనేది వేచి చూడాల్సి
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించగా ఆయనకు కాదని ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి బీజేపీ నాయకులైన ఈటెల రాజేందరు, గరికపాటి మోహన్ రావుతో పాటు బీజేపీ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నాడు. గత ఇరవై రోజుల నుండి నియోజకవర్గంలో తిరుగుతూ తన క్యాడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తల సూచన మేరకు చివరగా బీజేపీ పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన చేరికలో కొంత మంది ఆయనకు సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరతారా ? లేదా ? అనేది వేచి చూడాల్సి ఉంది.
బుజ్జగించే ప్రయత్నం
లంబాడీ సామాజిక వర్గాన్ని.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధినాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రహ్లాద్ ఆరోపణలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపైనా ప్రహ్లాద్ విమర్శలు చేశారు. ప్రహ్లాద్ పోటీలో ఉంటే బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుందని మంత్రులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. బీజేపీ నుంచి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా జవహర్‌లాల్ తొలి దరఖాస్తును సమర్పించారు. మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.