Father's Day 2024: తమ కలల్ని బిడ్డల కళ్లలో చూసి ఉప్పొంగిపోయే నాన్నకు వందనం! బంధంలో బాధ్యత..ఓటమిలో ఊరట..నాన్న చూపే బాట! అనుసరణీయ నడత.. చిరునవ్వులో ఆత్మీయత..నాన్న నేర్పే మాట! కరిగిపోతూ వెలిగిపోవడం..నలిగిపోతూ మెరిసిపోవడం..నాన్న ఇచ్చే స్ఫూర్తి! అనుబంధాల వెలుగు..మమతల నెలవు..నాన్న పంచే అమృతం! నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు By KVD Varma 16 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Father's Day 2024: నాన్న.. ఒక బాధ్యత.. ఒక స్ఫూర్తి.. అనుభవాల కీర్తి! తప్పటడుగుల్ని సరిచేసి.. తన అనుభవాల నిచ్చెనతో బిడ్డల ఉన్నతికి బాటలు వేసి.. విజయాల ఉషస్సులో వారిని చూసి గంభీరంగా నవ్వుకునే నాన్న.. చేయి పట్టుకుని నడిపించినా.. భుజాల నెక్కించుకుని మోసినా.. తప్పు చేస్తే దండించినా.. పంటి బిగువున తన బాధని దాచుకుని.. బిడ్డల ఉన్నతికి బాటలు వేయడానికి కనిపించని కష్టాన్ని భరించే నాన్న.. చిరునవ్వుతోనే సమస్యల సుడిని కనిపించనీయకుండా.. పిల్లల విజయంలో తన పాత్రను గుండెలోతుల్లోనే దాచుకుని మురిసిపోయే నాన్న.. Father's Day 2024: అమ్మ పెట్టిన బువ్వతో పెరిగినా.. నాన్న ఇచ్చిన స్ఫూర్తితోనే జీవన పయనం సాగేది. అమ్మ గారాల గోరుముద్దలు ఆహ్లాదాన్నిచ్చినా.. నాన్న పలుకులే వ్యక్తిత్వ నిర్మాణానికి నిచ్చెన మెట్లవుతాయి. గుండెల్లో కష్టాల బడబాగ్నిని దాచుకుని.. తనయుల్ని చిరునవ్వుతో భుజాలమీద ఎక్కించుకుని ప్రపంచాన్ని పరిచయం చేసే నాన్న.. ఎదుగుతున్న బిడ్డ కోసం చేసే త్యాగాల సహవాసం.. బంగారు బతుకు వెలుగుని అందించడానికి ఆత్మసంఘర్షణకు కృతజ్ఞతాంజలి తెలుపుకుందాం. తమ కలల్ని బిడ్డల కళ్ళలో చూసి ఉప్పొంగిపోయే నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఇప్పటి తండ్రికి అసలైన పరీక్ష! Father's Day 2024: తండ్రి పిల్లలకు రక్షణ కవచం. కాబట్టి అతను కఠినంగా ఉండాలి. నాన్న కఠినంగా లేకపోతే.. తప్పును అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతాం. సుతిమెత్తగా చెబితే.. లైట్ తీసుకోవడం పిల్లల నైజం. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాఠిన్యంగా తండ్రి ఉండాలి.. అలానే తప్పుల విషయంలో విషయాన్ని అర్ధమయ్యేలా విడమరిచి చెప్పాలి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు. ఇది తండ్రి మాత్రమే చేయగలిగిన పని. జీవిత అనుభవాల్ని పిల్లలకు పాఠాలుగా చెబుతూనే.. అవసరమైన చోట కఠినంగా వ్యవహరించకపోతే పిల్లల్లో విషయాన్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటి తండ్రికి ఇది కత్తిమీద సాము లాంటి పనే. పూర్వం ఇంటిలో చాలామంది కలిసి ఉండేవారు. తండ్రి కోప్పడితే.. బాబాయి దగ్గరకు తీసుకుని తండ్రి కోపం ఎందుకు వచ్చింది అనేది చెప్పేవారు. కానీ.. ఇప్పుడు ఒంటరి కుటుంబాలు. తండ్రి కోప్పడితే బుజ్జగించే వారు ఎవరూ ఉండరు. తల్లి బుజ్జగింపు గారమే అవుతుంది కానీ, తండ్రి కోపానికి కారణం చెప్పగలిగేలా ఉండదు. ఈ నేపథ్యంలో ఇప్పటి తండ్రికి పిల్లల పెంపకం కఠినమైన పరీక్షే అనడంలో డౌట్ అక్కర్లేదు. ఆ పరీక్షకు ఎదురొడ్డి నిలుస్తున్న నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలుపుదాం. కష్టాన్ని ఎదుర్కోవడం.. Father's Day 2024: కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్పగలిగేది నాన్న ఒక్కడే. నోటితో చెప్పక్కర్లేదు. ఇంటిలో ప్రతి విషయంలోనూ నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తూ కూడా పిల్లలు చాలా నేర్చుకుంటారు. మార్కులు తక్కువ వచ్చినపుడు.. ఆటల్లో వెనుకపడినపుడు.. ఇలా బిడ్డలకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి వారి వెన్నుతట్టి.. కష్టాన్ని దాటి ముందుకు ఎలా వెళ్లడమో చెప్పి నడిపించాల్సింది నాన్నే! కష్టాల కడలిని దాటించే స్ఫూర్తిని ఇస్తున్న నాన్నలందరికీ శుభాకాంక్షలు అందిద్దాం. ఎమోషనల్ టచ్.. Father's Day 2024: చిన్నతనంలో మనం నడిచినా, పడిపోయినా, జారిపోయినా వేళ్లు పట్టుకుని నడవడం నేర్పేది మన నాన్న. సైకిల్ క్యారియర్ పట్టుకుని వెనకే పరిగెత్తేది నాన్న. సైకిల్ తొక్కడం ఎలాగో మనకు నేర్పేది నాన్న.. అన్ని విధాలుగా తండ్రి సపోర్ట్ ఉంటుంది. జీవితంలో కష్టాల్లో కూరుకుపోయినప్పుడల్లా లేదా ఓడిపోయినప్పుడల్లా, ప్రతి ఒక్కరూ తమ తండ్రిని సూపర్ హీరోలా గుర్తుంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఏ బిడ్డ అయినా కష్టాన్ని జయించడానికో.. సమస్య పరిష్కారం కోసం ఆలోచించినపుడో మొట్టమొదట గుర్తువచ్చేది తండ్రి మాత్రమే. మన తండ్రిలో మన రోల్ మోడల్‌ను చూసుకుంటాం. అందుకే మనం పెరిగి పెద్దయ్యాక, మన తండ్రిలా నిర్భయంగా, త్యాగశీలిగా, దృఢంగా, క్రమశిక్షణతో, అలాగే దయతో ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే.. మనం మన జీవితంలో అతి దగ్గరగా చూసే.. స్పష్టంగా అర్థం చేసుకోగలిగే కథ మన తండ్రిదే! #fathers-day-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి