ISRO: ఇదే రోజున అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. సక్సెస్ స్టోరీ తెలుసుకోండి!

New Update
ISRO: ఇదే రోజున అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. సక్సెస్ స్టోరీ తెలుసుకోండి!

ISRO: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో కథకు బీజం పడిన కథ ఇది. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట కథ తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా వెనక్కి తగ్గని నాటి భారతీయ సైంటిస్టుల పట్టుదల గురించి వినాల్సిందే. ఏప్రిల్‌ 19, 1975లో ఆర్యభట్ట శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అసలు అప్పుడు ఏం జరిగింది? ఆర్యభట్ట కథేంటో తెలుసుకుందాం..

100 కిలోల శాటిలైట్‌ని..

ఆర్యభట్ట ఉపగ్రహ కథ 1968లో మొదలైంది. విక్రమ్ సారాభాయ్ తన శిష్యులలో ఒకరైన యుఆర్ రావుతో కలిసి దేశంలో శాటిలైట్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. 1960 ప్రారంభంలో సారాభాయ్ సోవియట్ యూనియన్ సైంటిస్టులతో పాటు అమెరికా నాసా శాస్త్రవేత్తలను కలిశారు. శాటిలైట్‌ను ప్రయోగించడంలో సాయం అందిస్తానని అమెరికా నుంచి హామీ వచ్చింది. ఇటు సారాభాయ్‌ టీమ్‌ 100 కిలోల శాటిలైట్‌ని తయారు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో మాస్కోలోని భారత రాయబారి డీపీ ధర్ నుంచి ప్రధాని ఇందిరా గాంధీకి ఒక సందేశం చేరింది. ఉపగ్రహ ప్రయోగంలో భారత్‌కు సోవియట్ యూనియన్ సహాయం చేయాలనుకున్నట్టు ఇందిరాకు రాయబారి ద్వారా మెసేజ్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విక్రమ్ సారాభాయ్ వెంటనే సోవియాట్‌ ప్రొపజల్‌కు అంగీకరించారు.

కండీషన్‌ ఇదే..

భారతీయ శాస్త్రవేత్తలతో సోవియట్ యూనియన్ రాయబారి నికోలాయ్ మధ్య సమావేశం జరిగింది. అప్పటివరకు ఉన్న ప్లాన్‌ను సారాభాయ్‌ నికోలాయ్‌కు వివరించారు. ఇదవి నికోలాయ్‌కు నచ్చడంతో ఆయన ఉపగ్రహ ప్రయోగంలో భారత్‌కు సాయం చేసేందుకు అంగీకరించారు. అయితే ఓ షరతు పెట్టారు. ఉపగ్రహం 100కిలోల బరువు కాకుండా ఇంకా ఎక్కువగా ఉండాలని సోవియాట్‌ కండీషన్‌ పెట్టింది.

Also Read: ముఖేశ్‌ అంబానీ సిక్రేట్‌ లైఫ్‌… ఎంత కుబేరుడైనా…

సోవియాట్‌ పెట్టిన బరువు కండీషన్‌కు ఒక కారణం ఉంది. చైనా, సోవియట్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్న రోజులవి. అప్పటికే చైనా 173కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అందుకే చైనా శాటిలైట్‌ కంటే బరువు ఎక్కువ ఉండాలని ఇండియాకు షరతు పెట్టింది సోవియాట్‌. దీనికి ఇండియా ఓకే చెప్పింది.

ఎదురుదెబ్బ..
ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విక్రమ్ సారాభాయ్ డిసెంబర్ 1971లో గుండెపోటుతో మరణించారు. 52 సంవత్సరాల వయస్సులో, అప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్న సారాభాయ్‌ మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ సమయంలో సారాభాయ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. 1966లో డాక్టర్ హోమీ భాభా కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇటు పోస్టుమార్టంకు డాక్టర్ సారాభాయ్ కుటుంబీకులు అంగీకరించలేదు. ఇక సారాభాయ్ మరణం తరువాత MGK మీనన్ ఇస్రో తాత్కాలిక చీఫ్‌గా నియమితులయ్యారు. చివరకు 1972లో సతీష్ ధావన్ ఇస్రో బాధ్యతలు స్వీకరించారు.

ఏకంగా 350కిలోల..
మరోవైపు అంతరిక్షంలో ఉపగ్రమ బరువు ఎంత ప్రభావం చూపుతుంది.. అంతరిక్ష వాతావరణం ఏ వస్తువులపై ఎంత ప్రభావం చూపుతుంది.. ఇలా ఎన్నో సందేహాలు ఇస్రో సైంటిస్టుల్లో మెదిలాయి. అన్ని అంశాలపై పరిశోధన చేసిన ఇస్రో చివరకు అనుకున్నది సాధించింది. సోవియట్‌ చెప్పినట్టు 173 కిలోల కంటే ఎక్కువ మాత్రమే కాదు.. ఏకంగా 350కిలోల ఉపగ్రహాన్ని తయారు చేసింది ఇస్రో.

ఇండియాకు స్పెషల్..
మార్చి 1975 నాటికి ఉపగ్రహం సిద్ధమైంది. ప్రయోగ తేదీని ఏప్రిల్ 19, 1975గా నిర్ణయించారు. ఆ రోజు రానే వచ్చింది. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యాలోని వోల్గోగ్రాడ్ సమీపంలోని కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించాల్సి ఉంది. భారత్‌ నుంచి యుఆర్ రావు, సతీశ్‌ ధావన్ సహా 30 మంది శాస్త్రవేత్తలు ప్రయోగం కోసం రష్యా చేరుకున్నారు. బెంగళూరులోని గ్రౌండ్ స్టేషన్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకే చోట చేరారు. ఆర్యభట్ట కక్ష్యలోకి దూసుకెళ్లింది. భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి శాటిలైట్‌ వెళ్లింది. ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి మొదటి సంకేతం అందిన వెంటనే యూఆర్‌ రావు కళ్లలో నీళ్లు తిరిగాయి. భారతదేశం అంతరిక్షంలోకి తొలి అడుగు వేసింది. ఆర్యభట్ట నిర్మాణానికి అప్పట్లోనే రూ.3.5 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇది కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత విద్యుత్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోయింది. అయితే ఇస్రో తర్వాతి ప్రయోగాలకు పునాదులు వేసింది ఆర్యభట్ట ప్రయోగమే. అందుకే ఇది ఇండియాకు ఎంతో స్పెషల్.

#isro
Advertisment
Advertisment
తాజా కథనాలు