ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై ఉత్కంఠ.. రాజ్యసభలో కొనసాగుతోన్న చర్చ

ఇప్పటికే లోక్‌సభలో పాసైన ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లును రాజ్యసభలోనూ పాస్ చేసుకునేందుకు ఎన్డీఏ సిద్ధమైంది.ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది.

New Update
ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై ఉత్కంఠ.. రాజ్యసభలో కొనసాగుతోన్న చర్చ

రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. అటు బిల్లుపై చర్చను కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వి ప్రారంభించారు. ఇప్పటికే లోక్‌సభలో పాస్‌ అయిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా పాస్‌ అయితే ఆ తర్వాత ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ఇక 237మంది ఎంపీలున్న రాజ్యసభలో ఈ బిల్లు పాస్‌ అవ్వాలంటే 119 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏ(NDA)కి 131మంది ఎంపీల బలముండగా.. విపక్ష కూటమి INDIAకి 99మంది ఎంపీల సపోర్ట్ ఉంది. బీజేడీ, వైసీపీ, టీడీపీ ఎన్డీఏకే మద్దతిస్తోంది. అటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎవరికి సపోర్ట్ ఇస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. INDIA కూటమికి బీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తుండడంతో బిల్లుకు వ్యతిరేకంగా పడే ఓట్లు సంఖ్య 108కు చేరే అవకాశాలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది.

బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమమన్నారు అభిషేక్ సింఘ్వి. ప్రజాస్వామ్య విరుద్దమని మండిపడ్డారు. ఈ బిల్లు ఫెడరలిజం సూత్రాలను, సివిల్ సర్వీస్ అకౌంటబిలిటీతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. పౌర సేవలను 'నియంతృత్వ పౌర సేవలు'గా మారుస్తుందని ఆరోపించారు. వాజ్‌పేయి, అద్వానీ ఆశయాలకు వ్యతిరేకంగా బిల్లు ఉందని అటు ఆమ్‌ ఆద్మి పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్ర అధికారులను లాక్కోవడమే బిల్లు ఉద్దేశమని విమర్శలు గుప్పించింది.

రాజ్యాంగానికి లోబడే ఢిల్లీ బిల్లు :అందుకే మా మద్ధతు...స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి

ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉందని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉన్నందునే ఈ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని 239ఏఏ అధికరణం కింద పేర్కొన్న మూడు సబ్ క్లాజ్లు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారం పార్లమెంట్‌కు కట్టబెట్టిందని అన్నారు. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించి పార్లమెంట్‌ చట్టాలు చేయవచ్చున్నా అన్న అంశంపై సుప్రీం కోర్టు జారీ చేసిన విస్పష్టమైన ఆదేశాలను ఆయన ఉదహరిస్తూ సర్వీసులపై సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉండేలా చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. ఇది నిర్వివాదమైన అంశం. న్యాయపరంగా కూడా ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని ఆయన అన్నారు.

సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు పార్లమెంట్‌ పరిమితులు విధించ వచ్చునన్న అంశంపై కూడా సుప్రీం కోర్టు వివరణ ఇస్తూ రాజ్యాంగం లేదా పార్లమెంట్‌లో చేసిన చట్టం కింద కేంద్ర ప్రభుత్వానికి దఖలుపడిన అధికారం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ అధికారాలకు పరిమితులను విధించవచ్చని స్పష్టం చేసినట్లు శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 239ఏఏ అధికారణ కింద్ర పేర్కొన్న క్లాజ్‌లను, సుప్రీం కోర్టు ఆదేశాలను కలిపి పరిశీలిస్తే ఢిల్లీ బిల్లుకు పూర్తి చట్టబద్దత ఉన్నట్లేనని అన్నారు. ఢిల్లీ దేశ రాజధాని అయినందున ఇది దేశంలోని ప్రతి ఒక్కరికి చెందుతుంది. అందువలన దీనిపై తీసుకునే ఏ నిర్ణయం అయినా కేవలం ఢిల్లీ వాసులపైనే కాకుండా యావత్తు దేశ ప్రజానీకంపై ప్రభావం చూపుతుందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు