బీమా డబ్బుల కోసం తన పోలికలతో ఉన్న వ్యక్తిని హత్యచేసిన వ్యాపారి!... వ్యాపారంలో కోట్ల రూపాయలు నష్టపోయాడు. ఏం చేయాలో తోచలేదు. ఆఖరికి తన పేరు మీదున్న జీవితబీమా గుర్తొచ్చింది. తను చనిపోతే రూ.4 కోట్లు వస్తాయి. కానీ ఎలా అని ఆలోచించాడు. తనలానే ఉన్న మరొకరిని చంపేస్తే ఆ డబ్బులు తీసుకుని నష్టాలు భర్తీ చేసుకోవచ్చని పెద్ద ప్లాన్ వేసి చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సినిమాని తలదన్నేలా జరిగిన ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. By Shareef Pasha 29 Jun 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి పంజాబ్‌లోని రాందాస్ నగర్‌కు చెందిన గుర్‌ప్రీత్ సింగ్‌కు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. దీంతో తన భార్య కుషదీప్ కౌర్, స్నేహితులు సుక్వీందర్ సింగ్, జస్పాల్ సింగ్, దినేశ్ కుమార్, రాజేష్ కుమార్‌లు పథకం రచించారు. గుర్‌ప్రీత్ శరీర కొలతలతో సరిపోలుతున్న సుఖ్‌జీత్ సింగ్ అనే వ్యక్తిని గుర్తించారు. నిందితులకు మృతుడు సుఖ్‌జీత్‌కు ముందుగా పరిచయం లేదు. దాంతో ఎటువంటి ఇబ్బంది రాదని భావించి గుర్‌ప్రీత్ అతడితో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే.. జూన్ 19న సుఖ్‌జీత్ కనిపించడం లేదని అతడి భార్య జీవన్‌దీప్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుఖ్‌జీత్ కోసం గాలిస్తున్న పోలీసులకు పటియాలా రోడ్డు పక్కన కాల్వ దగ్గర అతడి బండి, చెప్పులు కనిపించాయి. దాన్ని బట్టి మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై అనుమానాలు ఉన్న జీవన్‌దీప్ కౌర్.. ఒక అపరిచిత వ్యక్తి కొద్ది రోజులుగా తన భర్తతో స్నేహం చేస్తూ మద్యం కొనిపెడుతున్నాడని చెప్పింది. దర్యాప్తు చేసిన పోలీసులు అతడిని గుర్‌ప్రీత్‌గా గుర్తించారు. దీంతో అతడి కుటుంబాన్ని విచారించగా.. గుర్‌ప్రీత్ అప్పటికే రోడ్డు ప్రమాదంలో మరణించాడని బుకాయించారు. పోలీసులకు వీరిపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. రూ.4 కోట్ల భీమా డబ్బుల కోసమే ఈ పని చేశామని గుర్‌ప్రీత్ కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పేశారు. అనంతరం ప్రాణాలతోనే ఉన్న అసలు సూత్రధారి గుర్‌ప్రీత్‌ను అదుపులోకి తీసుకుని కూపీని లాగారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం.. జూన్ 19న సుఖ్‌జీత్‌కు గుర్‌ప్రీత్ పీకల దాకా తాగించాడు. అతడు స్పృహ కోల్పోగానే తన బట్టలు సుఖ్‌జీత్‌కు తొడిగేసి ఆ శరీరాన్ని టిప్పర్‌తో తొక్కించి ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మార్చేశాడు. అనంతరం జూన్ 20న తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారని, ఆ శవం తన భర్తదేనని పోలీసు స్టేషన్‌లో గుర్‌ప్రీత్ భార్య కుష్‌దీప్ కౌర్ ఫిర్యాదు చేశారు. ఆ మరణ వాంగ్మూలంతో బీమా సొమ్ము దక్కించుకుందాం అనుకునేలోపే పోలీసులకు చిక్కడంతో గుర్‌ప్రీత్ దంపతులు, వారికి సహకరించిన నలుగురు స్నేహితులు కటకటాల పాలయ్యారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి