కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలుగు నేతలకు చోటు

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్య నేతలకు పార్టీలో కీలక పదవులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలుగు నేతలకు చోటు

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కొత్తగా వర్కింగ్ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 39 మందితో కూడిన సీడబ్ల్యూసీ(CWC)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 32 మందిని శాశ్వత ఆహ్వానితులు..13 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించింది. CWC టీంలోకి ఏపీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డికి చోటుదక్కడం విశేషం. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డిని నియమించింది. శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనర్సింహలకు అవకాశం కల్పించింది.

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి కొంతకాంలగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామమైన నీలకంఠాపురంలోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నారు. అయితే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనంతపురం జిల్లా సరిహద్దుల నుంచి ఏపీలోకి ప్రవేశించే సమయంలో రఘువీరారెడ్డి ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రఘువీరా మళ్లీ క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగింది. అంతేకాదు కర్ణాటక ఎన్నికల సమయంలో ఆయన సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం భావించింది. అయితే ఎందుకో ఆయన దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీడబ్ల్యూసీలోనే రఘువీరారెడ్డికి చోటు దక్కడంతో ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇక ఏపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, కొప్పుల రాజులకు సీడబ్ల్యూసీలో చోటు దక్కగా.. తెలంగాణ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిలకు మాత్రమే అవకాశం దక్కింది. అయితే ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాలకు చోటు దక్కకపోవడం గమనార్హం.

Advertisment
Advertisment
తాజా కథనాలు