Vikarabad: తాండూర్‌లో పోలీసుల అత్యుత్సాహం.. ఫిర్యాదు దారుడిపై కానిస్టేబుల్ దాడి!?

వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తిపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. కానిస్టేబుల్, ఎస్సై కాశీనాథ్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Vikarabad: తాండూర్‌లో పోలీసుల అత్యుత్సాహం.. ఫిర్యాదు దారుడిపై కానిస్టేబుల్ దాడి!?

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వివాదంలో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. పిడియూఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గురువారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో కంప్లైంట్ రాస్తుండగా ఓ కానిస్టేబుల్ దుర్భాషలాడుతూ తనపై దాడి చేశాడని, ఓ ఫైనాన్స్ కంపెనీపై కంప్లైంట్ ఇవ్వరాదని స్టేషన్ ఎస్ఐ కూడా తనను తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా, జూనియర్ ప్రాక్టీస్ అడ్వకేట్‌గా ఉన్న తాను ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు దౌర్జన్యం చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీస్ స్టేషన్‌లోని సిసి కెమెరాలను పరిశీలించాలని, తన తప్పు ఏదైనా ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నాడు. కానిస్టేబుల్ దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు.

రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి టార్చర్..
టీవీఎస్ ఫైనాన్స్ వాళ్ళు రాత్రి 8 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చి టార్చర్ చేసి డబ్బులు వసూలు చేశారని, ఆల్రెడీ ఫైనాన్స్ కట్టిన కూడా ఇబ్బందులకు గురి చేస్తూ అధిక వసూలు చేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినట్లుగా తెలిపారు. ఈ క్రమంలో తనపై కానిస్టేబుల్ దాడి చేయడం, ఎస్సై కాశీనాథ్ బెదిరించడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్‌పై కానిస్టేబుల్ దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో పలు విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా తప్పేమీ లేదు..
ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన శ్రీనివాస్‌కు పేపర్ కూడా అందించాం. మాట్లాడడానికి లోపలికి రావాలని కానిస్టేబుల్ తెలుపగా, ఎదురు సమాధానం ఇవ్వడంతో కానిస్టేబుల్ నెట్టుకు వచ్చారు. అంతేకానీ అతన్ని కొట్టలేదని ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. టీవీఎస్ ఫైనాన్స్ వాళ్ళని శ్రీనివాస్ అడ్డుకొని, వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో ఫైనాన్స్ వారు కూడా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. ఇదే క్రమంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి శ్రీనివాస్‌ను పిలిచిన క్రమంలోనే ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు