ప్రతి ఒక్కరినీ కాపాడలేమూ....సీఎం షాకింగ్ కామెంట్స్....!

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది. పోలీసులు అందరికీ రక్షణ కల్పించలేరని సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా 2.7 కోట్లు ఉంటే, ప్రభుత్వం దగ్గర 60 వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారన్నారు.

New Update
ప్రతి ఒక్కరినీ కాపాడలేమూ....సీఎం షాకింగ్ కామెంట్స్....!

రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తాము కాపాడలేమని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా శాంతిని పాటించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్టు సీఎం తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా వున్నట్టు వెల్లడించారు. ఘటనకు సంబంధించి 116 మందిని అరెస్ట్ చేశామ‌న్నారు.

మరో 200 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. హింసాత్మక ఘటనల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు రూ. 57 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు వివరించారు. అల్లర్లలో జరిగిన ఆస్తి నష్టానికి పరిహారం చెల్లిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగితే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు.

కానీ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగితే ఆ నష్టానికి కారకులైన వారి నుంచి పరిహారాన్ని వసూలు చేసి మరి చెల్లిస్తామన్నారు. అల్లర్లలో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామన్నారు. వారి నుంచి పరిహారాన్ని వసూలు చేస్తామన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలోని అన్ని సీసీ టీవీ పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారన్నారు.

బ‌జ‌రంగ్ ద‌ళ్ నేత‌ మోను మ‌నేస‌ర్ ఎక్క‌డున్నార‌నే విషయం ఇంకా తెలియలేదన్నారు. మోనును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. అల్ల‌ర్ల‌లో మోను మనేస‌ర్ ప్ర‌మేయం ఉంటే ఆ దిశ‌గా విచార‌ణ సాగుతుంద‌న్నారు. హర్యానాలోని నూహ్ లో వీహెచ్‌పీ చేపట్టిన ర్యాలీ అల్లర్లకు దారి తీసింది. ఊరేగింపు సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అల్లర్లు మొదలయ్యాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు