/rtv/media/media_files/2026/04/17/jacqueline-fernandez-2026-04-17-14-37-52.jpg)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుకేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా తనపై ఉన్న కేసుల నుండి బయటపడటానికి ఆమె స్వయంగా కోర్టులో ఒక కీలక ప్రతిపాదన చేశారు. తాను ఈ కేసులో అప్రూవర్ గా మారతానని, కేసులోని నిజాలను బయటపెడతానని ఢిల్లీ కోర్టుకు విన్నవించారు. అయితే దీనిపై నేరుగా నిర్ణయం తీసుకోలేమని చెప్పిన కోర్టు, ఈ విషయాన్ని ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులకు అధికారికంగా తెలియజేయాలని ఆమెకు సూచించింది. ఒకవేళ ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి, దానికి అంగీకరిస్తేనే కోర్టులో ఆమెను అప్రూవర్‌గా మార్చే ప్రక్రియ ముందుకు సాగుతుంది.
చాలా కాలంగా ఇబ్బందులు
వాస్తవానికి ఈ కేసులో జాక్వెలిన్ చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తనపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడి నుండి ఆమెకు ఎలాంటి ఊరట లభించలేదు. మరోవైపు జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మాత్రం తాను జాక్వెలిన్‌ను ప్రేమిస్తున్నానని, ఆమె తన ప్రేయసి అని చెబుతూ తరచుగా ఉత్తరాలు రాస్తుంటాడు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ, జాక్వెలిన్ మాత్రం తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. సుకేశ్ ఒక మోసగాడని తనకు తెలియదని, అతను ఒక పెద్ద వ్యాపారవేత్త అని తనను నమ్మించి బురిడీ కొట్టించాడని ఆమె కోర్టులో చెప్పారు.
అయితే ఈడీ అధికారులు మాత్రం జాక్వెలిన్ వాదనలను తోసిపుచ్చుతున్నారు. సుకేశ్ చేస్తున్న నేరాల గురించి తెలిసినప్పటికీ ఆమె అతని నుండి దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన నగలు, బట్టలు, కార్లను బహుమతులుగా తీసుకున్నారని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా సుకేశ్ అరెస్టయిన తర్వాత ఆమె తన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారని, మొదట్లో తన ఆర్థిక లావాదేవీల గురించి కూడా అబద్ధాలు చెప్పారని అధికారులు ఆరోపిస్తున్నారు. మొత్తం 215 కోట్ల రూపాయల భారీ మోసానికి సంబంధించిన ఈ కేసులో జాక్వెలిన్ అప్రూవర్‌గా మారితే, సుకేశ్‌కు మరిన్ని కష్టాలు తప్పవని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ కేసులో జాక్వెలిన్ ఒక నిందితురాలిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె అప్రూవర్ గా మారతానంటున్నారు. అంటే, "నేను నిందితురాలిని కాదు, సాక్షిని అవుతాను.. ఈ కేసులో నాకు తెలిసిన నిజాలన్నీ చెబుతాను, కాబట్టి నాపై ఉన్న కేసును మాఫీ చేయండి" అని కోర్టును కోరుతున్నారు. ఒకవేళ ఈడీ దీనికి ఒప్పుకుంటే, ఆమె సుకేశ్‌కు వ్యతిరేకంగా మెయిన్ సాక్షిగా మారుతారు.
Follow Us