Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ సేల్స్ 5 లక్షల డాలర్ల వద్దే ఉండటంతో 3 మిలియన్ ఓపెనింగ్ లక్ష్యం కష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్, పాటలు పెద్దగా హైప్ తీసుకురాకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.

New Update
Peddi

Peddi

Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూన్ 3న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్కడి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇప్పుడు చర్చగా మారింది.

సినిమా బుకింగ్స్ రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. మొదట్లో మంచి స్పందన రావడంతో ఓపెనింగ్ డేకు భారీ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ గత కొన్ని రోజులుగా బుకింగ్స్ వేగం తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నార్త్ అమెరికాలో ‘పెద్ది’ అడ్వాన్స్ సేల్స్ సుమారు 5 లక్షల డాలర్ల వద్ద మాత్రమే ఉన్నాయని సమాచారం. 1500కి పైగా షోలు ప్లాన్ చేసినప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో ముందుకెళ్లడం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మొదట ఈ సినిమా ఓపెనింగ్ రోజే 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆ లక్ష్యం చేరుకోవడం కష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా సినిమా ట్రైలర్‌కు ఉత్తర అమెరికా తెలుగు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడమేనని చెబుతున్నారు. అలాగే ఇటీవల విడుదలైన ప్రమోషనల్ సాంగ్ కూడా ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురాలేకపోయిందని సమాచారం. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ వేగం తగ్గినట్లు తెలుస్తోంది.

నార్త్ అమెరికా మార్కెట్‌లో సినిమా మొదటి వీకెండ్ కలెక్షన్లు చాలా ముఖ్యంగా భావిస్తారు. అక్కడ సినిమా లాభాల్లోకి రావాలంటే మొత్తం 7.5 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం కనీసం 6.5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వీకెండ్ రావాలి. అందులో మొదటి రోజు కనీసం 3 మిలియన్ డాలర్ల వసూళ్లు చాలా అవసరమని అంటున్నారు.

ఇప్పుడైనా సినిమా టీమ్ బలమైన ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ‘మస్సా మస్సా’ సాంగ్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న కొత్త ట్రైలర్ విడుదల చేస్తే సినిమా మీద మళ్లీ హైప్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

‘ఉప్పెన’ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రెండో సినిమా ‘పెద్ది’. ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించనున్నాడు. విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో, ఇప్పుడు సినిమా టీమ్ చేసే ప్రమోషన్స్‌నే అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు