Chandra Mohan Death: హీరోయిన్లకు లక్కీ హీరో.. తొలి సినిమాకే నంది అవార్డు.. చంద్రమోహన్ సక్సెస్ స్టోరీ

హీరోయిన్లకు లక్కీ హీరోగా.. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న నటుడిగా చంద్రమోహన్ చరిత్ర సృష్టించారు. 1966లోనే ‘రంగుల రాట్నం’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్ లో 932 సినిమాల్లో నటించి రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు.

New Update
Chandra Mohan Death: హీరోయిన్లకు లక్కీ హీరో.. తొలి సినిమాకే నంది అవార్డు.. చంద్రమోహన్ సక్సెస్ స్టోరీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (80) హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో చంద్రమోహన్ లేనిలోటు పూడ్చలేనిదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. కాగా కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు. మేడూరు, బాపట్లలోనే చదువు పూర్తిచేశారు. అయితే ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు అయిన చంద్రమోహన్ 1966లోనే ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతేకాదు తొలి సినిమాకే ఉత్తమ నంది అవార్డు తెచ్చుకున్న నటుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన ఆయన.. సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు.. వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించి వినోద పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

చంద్రమోహన్ మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో 932 సినిమాల్లో నటించారు. రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లోనూ ‘చందమామ రావే’ కోసం నంది అవార్డులు దక్కించుకున్నారు.

ఇక సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసును సినిమాలను తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతుండేవారు. అలాగే ఇక తన తల్లి చనిపోయేసమయంలో ‘మనసంతా నువ్వే‘ సినిమా చేస్తున్నట్లు వెల్లడించిన ఆయన ఈ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్లు అగవని పలు సందర్భాల్లో తెలిపారు. ఇక నిజానికి తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచించినట్లు తెలిపారు.  డబ్బులు దాచుకున్నవారికే విలువ ఎక్కువగా ఉంటుందని చెబుతుండేవారు.

ఇక అప్పట్లో వరుస హిట్‌లతో దూసుకుపోయిన చంద్రమోహన్ సీనియర్ హోరోయిన్లందరికీ లక్కీ హీరోగా మారిపోయాడు. ఆయనతో సినిమా చేస్తే కెరీర్ గాడిన పడుతుందని భావించి అవకాశాలకోసం కథానాయికలంతా క్యూ కట్టేవారంటే ఆయన ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు. కెరీర్‌ బిగినింగ్‌లో శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి కథానాయికలంతా చంద్రమోహన్‌తో నటించినవారే కావడం విశేషం. కాగా జయసుధ, చంద్రమోహన్ కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అయింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా వీరిద్దరూ చాలా సినిమాలు చేశారు. తెలుగుతోపాటు తమిళంలోనూ అవకాశాలు దక్కించుకున్న ఆయన తమిళ్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్దుల్ని చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు