Chandrababu Naidu: అప్పుడలా. . ఇప్పుడిలా. . చంద్రబాబులో అనూహ్య మార్పు ఎందుకు ? ఏపీ రాజకీయాల్లో కొత్తదనం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహజధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉండదని ప్రకటించడం కొత్త చంద్రబాబును చూపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. By KVD Varma 13 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Chandrababu Naidu: ఇది నమ్మశక్యంగా లేదు.. చంద్రబాబులో ఎంతటి మార్పు? ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో అంటున్న మాట. అవును.. చంద్రబాబు నాయుడు గత రాజకీయ విధానాలకు.. ఇప్పటి నిర్ణయాలకు చాలా తేడా కనిపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకోవడం. నిజానికి ఇలాంటి వైఖరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో గతంలో ఎప్పుడూ లేదు. ఎన్నిక ఏదైనా సరే.. బలం ఉందా.. లేదా అనేదానితో పని లేదు.. పోటీ పడాల్సిందే. గెలుపు కోసం ఎటువంటి దారిలో అయినా వెళ్లాల్సిందే. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉండేది. దానికి కారణంగా.. బలం లేదేమో అని పోటీ చేయకపోతే ప్రజల్లో రాంగ్ సిగ్నల్ వెళుతుంది అని చంద్రబాబు కానీ, ఆ పార్టీ నాయకులు గాని చెప్పుకుంటూ ఉండేవారు. అయితే, మొదటిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చిన మొదటి ఎన్నికల బరిలో నిలబడడం లేదు అంటూ హుందాగా తప్పుకున్నారు. ఇది రాజకీయ పరిశీలకులను.. ప్రజలను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. బలం లేకనేనా? Chandrababu Naidu: విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అక్కడ గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ పార్టీ మారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన తరఫున పోటీ చేసి గెలిచారు. దీంతో వైసీపీ వంశీకృష్ణపై ఎమ్మెల్సీ అనర్హత వేటు వేసింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. నిజానికి స్థానిక సంస్థల్లో 600కు పైగా ఓట్ల బలం వైసీపీకి ఉంది. తెలుగుదేశం పార్టీకి 200కు కాస్త అటూ ఇటూగా ఓట్లు ఉన్నాయి. అంటే రెండు పార్టీల మధ్య భారీగా ఓట్ల తేడా ఉంది. ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరుపై నడకే అనేది సత్యం. అయితే, టీడీపీ కూడా బరిలోకి దిగాల్సిందే అని కొందరు నాయకులు గట్టిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర తమ అభిప్రాయాన్ని వినిపించారు. దీంతో మొదట్లో ఈ ఎన్నిల బరిలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికోసం ప్రత్యేకంగా కూటమి తరఫున ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. వైసీపీ కూడా అదే నమ్మింది. గత అనుభవాలను.. చంద్రబాబు రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్నిరోజులుగా బొత్స గెలిచి తీరాలని వ్యూహాలు రచించడంలో నిమగ్నమైపోయారు. ఒకదశలో తమ ఓటర్లకు క్యాంపు ఏర్పాటు చేయాలని కూడా భావించి ఏర్పాట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు టీడీపీ పోటీనుంచి తప్పుకోవడంతో వైసీపీ టెన్షన్ తగ్గింది. బొత్స గెలుపు ఖాయం అయింది. అది కూడా ఏకగ్రీవంగా అయ్యే ఛాన్స్ ఉంది. సార్ మారిపోయారా? Chandrababu Naidu: సాధారణంగా చంద్రబాబు నాయుడు బలంతో పని లేకుండా ఎన్నికల్లో పోటీకి ఎప్పుడూ సై అంటారు. గెలుపు కోసం.. తమ బలం పెంచుకోవడం కోసం ఎన్ని రాజకీయాలు చేయాలో అన్నీ చేస్తారు. అటువంటి రాజకీయాలకు దేశంలోనే చంద్రబాబు పెట్టింది పేరు. ఇందుకు ఉదాహరణగా గతంలో తెలంగాణలో బలం సరిపోదని తెలిసినా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి.. నోటుకు ఓటు స్కామ్ లో ఇరుక్కుపోయిన చరిత్రను చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే అప్పట్లో కడప ఎమ్మెల్సీ సీటు విషయంలో కూడా వైఎస్ అడ్డాగా చెప్పుకునే చోట బలం లేకపోయినా పోటీచేసి గెలుపు సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం నుంచి బీటెక్ రవి బరిలో దిగారు. స్థానికంగా వైఎస్ కుటుంబానికి ఉన్న బలాన్ని ఛేదిస్తూ.. ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించి బీటెక్ రవి చరిత్ర సృష్టించారు. ఇది వైసీపీకి మింగుడుపడని విషయంగా మారింది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ గెలుపుకోసం అన్నిరకాల మార్గాలనూ వాడుకుందని చెప్పుకున్నారు. అంతేకాకుండా, ఈ ఓటమిని చూపిస్తూ చాలాకాలం పాటు వైసీపీ సొంత జిల్లాలోనే చావు దెబ్బ కొట్టాం అని టీడీపీ నాయకులు జబ్బలు చరుచుకునేవారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. బలం లేదు.. అని చెబుతూ విశాఖ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన అందుకే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కొంతకాలంగా.. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ చిన్న నాయకుల నుంచి పెద్ద నేతల వరకూ బొత్సకు చెక్ పెట్టడానికి చంద్రబాబు పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు అంటూ ప్రచారం చేశాయి. కానీ, అందుకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరించడం విశేషం. ఎందుకీ మార్పు.. Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అందరి మెదళ్ళనూ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. అసెంబ్లీ ఎన్నిల బరిలో పోరాటానికి దిగిన దగ్గర నుంచి.. అధికారం సాధించి ముందుకు సాగుతున్న ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిలో చాలా మార్పు వచ్చింది. దూకుడు రాజకీయాలు చేయడం లేదని విశ్లేషకుల అభిప్రాయం. స్వచ్ఛమైన పాలన అందిస్తాను అని చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో నిలబడక పోవడం వలన వచ్చే చెడు కంటే. ఎన్నికల్లో నిలబడి గెలిచినా.. ఓడినా వచ్చే అప్రతిష్టే ఎక్కువ ఉంటుందని కూటమి పెద్దలు భావించి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే, ఒకవేళ ఓడిపోతే.. బలం లేని దగ్గర బరిలో సవాలు చేయడం అవసరమా? అనే హేళనలు వచ్చే అవకాశం ఉంది. ఇక పోరాటం చేసి.. రాజకీయాలు చేసి.. వైసీపీ ఓట్లను తమవైపుకు ఏదోవిధంగా(?) తిప్పుకుని గెలుపు సాధించినా పెద్ద ప్రమాదమే వచ్చేది. స్వచ్ఛమైన పాలన ఇస్తామన్న కూటమి.. రాజకీయాల్లో అవినీతిని ప్రోత్సహించింది అనే అపప్రధను మోయాల్సి వచ్చేది. సో.. ఏతా వాతా ఎటైనా విమర్శల పాలుకాక తప్పదు. అందుకే హుందాగా తప్పుకుంటే, ప్రజల్లో పలుచన కాకుండా ఉండవచ్చు అనే అభిప్రాయంతోనే పోటీకి దిగలేదని భావించవచ్చంటున్నారు. పవన్ ఫ్యాక్టర్ కూడా ఉందా? Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నట్టుగా ఉందని కొందరు అంటున్నారు. ఎందుకంటే, మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో హుందాతనం తీసుకురావాలి. మనం ఆదర్శంగా నిలబడాలి. ప్రజల దృష్టిలో పలుచన అయ్యేలా వ్యవహరించకూడదు అంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. పైగా అవినీతి విషయంలో పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటల నేపథ్యంలో ఈ ఎన్నికల విషయంలో ఎక్కడ తేడా జరిగినా అది పెద్ద మచ్చ అవుతుందని భావించి ఉండవచ్చు. అలానే, ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు నెలలు కాకుండానే అంత పెద్ద టాస్క్ పెట్టుకోవడం రిస్క్ అని పవన్ చెప్పి ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తన సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం కొత్తదనాన్ని రాజకీయాల్లో పరిచయం చేస్తుందనే భావన ప్రజల్లో కల్పించినట్టు ఈ వ్యవహారం ఉంది. కొసమెరుపు ఏమిటంటే.. నిజానికి వైసీపీ అధినేత బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ బరిలోకి దించడం వెనుక ఆయన పార్టీనుంచి జంప్ అవుతారేమో అనే భయంతోనే అనే గుసగుసలు వైసీపీలో అంతర్గతంగా లేకపోలేదు. అంతేకాకుండా, వైసీపీలో మెజార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో బొత్స రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని భావించారు. టీడీపీ పోటీలో ఉంటే.. ఆ అధికార బలం ముందు.. ఇక్కడి ఓట్ల బలం వీగిపోయేదనే అంచనాలు వేశారు. అందుకే క్యాంప్ రాజకీయాలకు తెరలేపాలని భావించారు. కానీ, అనూహ్యంగా టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో వైసీపీలో నాయకులే అయోమయానికి గురవుతున్నారని చెప్పుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. #chandrababu #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి