Chandrababu Naidu: అనేక నిందలు, అవమానాలు.. అరుదైన రికార్డులు: చంద్రబాబు సీఎం@30 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు కావస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన 15 ఏళ్ళు ప్రతి పక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 30 ఏళ్ళ ప్రయాణంలో ఆయనలో కనిపించిన మంచీ చెడుల విశ్లేషణ ఈ ఆర్టికల్ లో.. By KVD Varma 01 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Chandrababu Naidu: మూడు దశాబ్దాల క్రితం అనుకోని పరిస్థితుల్లో.. ఒకరకంగా ప్రజావ్యతిరేక స్థితిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాయకుడు.. తరువాత ప్రజాక్షేత్రంలో నిలిచి.. గెలుపు ఓటముల మధ్య రాజకీయాలను చేసి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఇదే రోజు అంటే సెప్టెంబర్ 1, 2095 నాడు ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. అప్పుడు ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పదవి చేపట్టాల్సి వచ్చింది. ప్రజల్లో పెద్దగా అప్పుడు ఆయనపై ఇష్టత లేదన్న అభిప్రాయం ఉంది. పైగా వెన్నుపోటు అనే నిందను మోయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ప్రజలను తనవైపుకు తిప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారు. తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో తనను తాను నిరూపించుకున్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే సగం కాలం అధికారంలో.. సగం కాలం అధికారం లేకుండా పార్టీని నడిపించారు. లెజెండరీ ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు ఇప్పటికీ అప్పటి ఆ మచ్చను భరిస్తూనే ఉన్నారు. విలక్షణ శైలి.. Chandrababu Naidu: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తనను తాను నిరూపించుకోవడమే ముఖ్యంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ, కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్, మన్ కీబాత్, జన్ ధన్ ఖాతాలు, ముద్రలోన్ ఇలాంటి పథకాలన్నిటికీ ఆద్యుడు ఆయనే. ఆయన క్లీన్ అండ్ గ్రీన్, డయల్ యువర్ సీఎం, పరిమిత వడ్డీ రుణాలు, స్వయంసహాయక బృందాలు (డ్వాక్రా) వంటి రకరకాల కార్యక్రమాలకు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా వాటిని విజయవంతంగా నడిపించారు కూడా. ఇక ప్రజలను దగ్గర చేసుకునే కార్యక్రమం కోసం చాలానే శ్రమ పడ్డారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజలవద్దకు పాలన ఇలాంటి విలక్షణ కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కాగలిగారు. ఇలా ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రచారంలో తనదైన ముద్ర వేసుకున్నారు. కేంద్ర రాజకీయాల్లో.. Chandrababu Naidu: చంద్రబాబు ఎప్పుడూ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే భావిస్తూ వచ్చినట్టు కనిపిస్తుంది. అప్పటి యానైటెడ్ ఫ్రంట్(1996)లో భాగస్వామ్యం కావడం దగ్గర నుంచి ఇప్పటి ఎన్డీయే తో జట్టు కట్టడం వరకూ జాతీయ రాజకీయాల విషయంలో చంద్రబాబు ఎప్పుడూ చురుకుగానే వ్యవహరించారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన సజావుగా సాగాలంటే, కేంద్రంతో సయోధ్య తప్పదని ఆయన వ్యవహారశైలి ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఎంతగా ప్రజల్లోకి దగ్గరగా చేసినా.. ఒంటరిగా పార్టీని గెలిపించడంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కారణాలు ఏమైనా కూటమిగా ఏదైనా పార్టీతో కలిస్తేనే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. అందులోనూ బీజేపీతో కలిసి రెండుసార్లు అధికారం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోరాడి గెలిచిన ఒక్క ఎన్నిక కూడా లేదు. వాడుకుని వదిలేయడం.. Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా దగ్గరకు చేర్చుకున్న నాయకుల్లో చాలామంది తరువాత ఆయనకు ఎదురు తిరిగారు. ఇప్పటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారంతా ఆయన ప్రోత్సాహంతోనే తెలుగుదేశంలో నాయకులుగా ఎదిగారని విశ్లేషకులు చెబుతారు. చంద్రబాబు వాడుకుని వదిలేస్తారు అనే పెద్ద నింద కూడా ఉంది.. ఇటు జాతీయ రాజకీయాల్లో కానీ, స్థానిక రాజకీయాల్లో కానీ ఎవరిని ఎప్పుడు ఎందుకు పక్కన పెడతారు అనేది ఎవరికీ అర్ధం కాని విషయంగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణ దగ్గుబాటి వేంకటేశ్వర రావు, పురంధేశ్వరి, బాలకృష్ణలను చెప్పుకోవచ్చు. అవసరం అయినపుడు వాడుకుంటారని.. తరువాత పక్కన పెట్టేస్తారనీ చంద్రబాబుకు పెద్ద పేరు ఉంది. ప్రజలంటే భయం.. Chandrababu Naidu: చంద్రబాబుకు ప్రజలంటే భయం అని చెబుతారు ఆయనను బాగా తెలిసిన వాళ్ళు. ప్రజలు చెడుగా అనుకుంటారని, తన గురించి దుష్ప్రచారం జరుగుతుందని ఆయన ఎప్పుడూ భయపడుతుంటారట. అందుకే, ఏ చిన్న విషయం వెలుగులోకి వచ్చినా.. తన పార్టీ వారిని కూడా చూడకుండా వారితో విరోధం తెచ్చుకునేలా ప్రవర్తిస్తుంటారని అంటారు. అలాగే చంద్రబాబు పార్టీలో కుటుంబాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు కాదు. కుటుంబ పాలన ముద్ర పడకుండా ఉండాలని కూడా చాలా ప్రయత్నించే వారు. అందుకే, చాలాకాలం తన కొడుకును, భార్యను రాజకీయాలకు దూరంగా ఉంచారు. బాబు మారారా? Chandrababu Naidu: గతంలో గెలుపు ఓటముల మధ్యలో చంద్రబాబు ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించారు. ఆయన వ్యవహార శైలి ఒకేలా ఉండేది. కానీ, ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించాకా.. ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశాకా చంద్రబాబు పద్ధతుల్లో చాలా మార్పు వచ్చింది. పెన్షన్ వంటి పథకాలకు వ్యతిరేకంగా ఉండే ఆయన తొలిసారిగా పెన్షన్లను సమయానికి ఇవ్వడం అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కూటమిలో ఉన్న ప్రతి నాయకుడికి విలువ ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో తనతో సమానమైన ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నారు. ఇదంతా తన గతశైలికి విరుద్ధంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి చంద్రబాబు తనపై ఉన్న మరకల్ని అంటే, వాడుకుని వదిలేస్తారు.. ప్రజా సంక్షేమ పథకాలకు వ్యతిరేకి వంటి ముద్రల్ని చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫిరాయింపులు. ఒకప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చంద్రబాబు స్టైల్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా ఉండేది. ఇష్టం వచ్చినట్టుగా పార్టీల నుంచి అభ్యర్థులను చీల్చేసేవారు. కానీ, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తరువాత వైసీపీ నుంచి ఎంపికైన నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని ప్రయత్నించినా, వారిని పదవులకు రాజీనామా చేసి రావాలంటూ చెబుతున్నారు. ఇది చంద్రబాబులో వచ్చిన అతి పెద్ద మార్పుగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదీ చంద్రబాబు స్పెషాలిటీ.. Chandrababu Naidu: చంద్రబాబు, వైఎస్సార్ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాంగ్రెస్ లో ఉన్నపుడు వైఎస్సార్ తో కొట్లాడారు.. టీడీపీలోకి వచ్చి కొట్లాడుతూనే ఉన్నారు. తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో తలపడుతున్నారు. చంద్రబాబు ముందు వెనుక ఏపీకి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది చంద్రబాబు ఒక్కరే. ఇక ఓటమిలోనూ ప్రజల మధ్యలో తిరిగి పార్టీని ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చారు. పార్టీని ఎప్పుడూ బలహీన పడనివ్వలేదు. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో విజయం సాధించారని చెప్పవచ్చు. మొత్తంగా మూడు దశాబ్దాల చంద్రబాబు ప్రస్థానంలో అన్నిస్థాయిల్లోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే ఘనతనూ మూటగట్టుకున్నారు. ఆయనను వ్యతిరేకించే వర్గాలు కూడా ఇతర ముఖ్యమంత్రుల పోకడలతో పోలిస్తే చంద్రబాబు నయం అనే చెబుతుంటారు. #chandra-babu-naidu #telugu-desam-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి