Opinion: ఓటమితో గెలిచిన బీజేపీ... గెలిచి ఓడిన కాంగ్రెస్! ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో గెలిచిందని... కాంగ్రెస్ గెలిచి ఓడిందంటూ విశ్లేషించారు చలసాని నరేంద్ర. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయన్నారు. పదేళ్లుగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా లేని ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయన్నారు. By Nikhil 06 Jun 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 2014 లోక్ సభ ఎన్నికలు విలక్షణమైనవి. 400 సీట్లతో చరిత్ర సృష్టిస్తామంటూ ప్రచారం చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పార్టీకి పూర్తి మెజారిటీ సాధింపలేకపోవడంతో ఓటమి చెందారు. అయినప్పటికీ ఆయన నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ సాధించడంతో తిరిగి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు, పదేళ్ల తర్వాత చెప్పుకోదగిన విజయాలు సాధించి, అధికార పక్షాన్ని పూర్తి మెజారిటీ సాధించలేక కట్టడి చేయగలిగిన కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్నా.. అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకనే ఆశాభంగం కలిగినా 2004లో మాదిరిగా బీజేపీకి భంగపాటు కలిగించే ఫలితాలు కావు. అయితే, ఓ పెద్ద షాక్ ను ఆ పార్టీకి కలిగించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా ఎన్నికల ముందు హడావుడిగా విగ్రహ ప్రతిష్ట కావించి, అంతా తానే అన్నట్లు వ్యవహరించి, అయోధ్య ఉద్యమంలో పేరొందిన నాయకులు ఎవ్వరూ అక్కడకు రాకుండా జాగ్రత్త పడి, కేవలం తాను మాత్రమే 500 ఏళ్ళ పోరాటంకు ఫలితంగా రామమందిరం నిర్మించినట్లు ప్రచారం చేసుకున్న ప్రధాని మోదీ తీవ్ర భంగపాటుకు గురికావాల్సి వచ్చింది. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఓటమి చెందడంతో పాటు కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో మెజారిటీ సీట్లను బీజేపీ కోల్పోవలసి వచ్చింది. రెండు రోజుల క్రితమే, ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవంగా బీజేపీ తిరిగి గొప్ప ఆధిక్యతతో అధికారంలోకి వస్తుందని చేసిన అంచనాలను ఓట్ల లెక్కింపు తలకిందులు కావించింది. ఎగ్జిట్ పోల్‌లు ఓటర్ల అంతర్లీన స్వభావాన్ని తప్పుగా చదవడమే కాకుండా ప్రజలను దారిమళ్లించే విధంగా ప్రకటించారని స్పష్టం అవుతుంది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాలలో `బ్రాండ్ నరేంద్ర మోదీ' ఓట్లను సాధించలేక పోయింది. ప్రధానమంత్రి కంచుకోట అయిన గుజరాత్‌లో బీజేపీ కొంత ఓటర్ల పట్టును కోల్పోయింది. రాజస్థాన్ లో కీలకమైన వసుంధరాజే వంటి నాయకులను పక్కన పెట్టడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నేతలు పార్టీ కంచుకోట అయిన మధ్యప్రదేశ్ ను కాపాడుకో గలిగారు. కేవలం తూర్పున ఒడిశా, తెలంగాణలో ఫలితాలు బీజేపీని ఆదుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, బీహార్ లలో మిత్రపక్షాలు బీజేపీని గట్టెక్కించాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాలు నడిపే అనుభవం లేని మోదీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ల వంటి బలమైన నాయకులతో కలిసి ఏ విధంగా ప్రభుత్వం నడుపుతారో ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. వారిద్దరూ కొద్దీ నెలల క్రితమే ఎన్డీయేలోకి తిరిగి వచ్చారు. వారిద్దరికీ మోదీతో చెప్పుకోదగిన అనుబంధం లేదన్నది బహిరంగ రహస్యం. తమతో పొత్తులో ఉంటూనే తమ రాష్ట్రంలో తమ ప్రత్యర్థులైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ వంటి వారిని ప్రోత్సహిస్తున్న మోదీ వైఖరి పట్ల వారిద్దరూ గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినవారే. ఈ ఎన్నికలు ఓ విధంగా కాంగ్రెస్ కు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయి. పదేళ్లుగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా లేని ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. అంతేకాకుండా కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో చెప్పుకోదగిన విజయం సాధించింది. 2019లో రాహుల్ గాంధీని ఓడించిన అమేథీలో కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీని ఓడించ గలిగారు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో సీట్లు సాధించిన కాంగ్రెస్‌ను హిందీ ప్రాంతంలో తన బలమైన ఉనికి ఏర్పర్చుకోగలిగింది. పార్లమెంట్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా నిలబడే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో సహితం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవర్ పార్టీలకన్నా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుపొంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బలమైన పార్టీగా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఏర్పడింది. ఇక దక్షిణాదిన విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. రెండు తెలుగు రాస్త్రాలలో బలమైన నేతలుగా పేరొందిన కె చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మట్టికరిచారు. ఎవ్వరూ ఊహించని తీర్పు ఓటర్లు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ ఈ ఎన్నికలలో కనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ జరగగా, ఉత్తర ప్రదేశ్ లో సమాజవాది పార్టీ, కాంగ్రెస్ లమధ్య జరిగింది. గతంలో కలిసి పోటీ చేసినప్పుడు ఆ విధంగా జరగలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో, మైనారిటీ ఓట్లు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏకీకృతం కాగా, షెడ్యూల్డ్ కులాలు కూడా ఈ కూటమికి పెద్ద సంఖ్యలో ఓటు వేసినట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు అసదుద్దీన్ ఒవైసీ ముస్లీమ్ ఓట్లను, మాయావతి దళిత్ ఓట్లను చీలుస్తూ పరోక్షంగా బిజెపి గెలుపుకు ఉత్తరాదిన సహకరిస్తున్నారని ఆ వర్గాలలో నెలకొన్న ఆగ్రవేశాలే ఈ మార్పుకు కారణం అని చెప్పవచ్చు. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్‌పీ) రాజకీయంగా తెరమరుగవుతున్న సమయంలో దళితులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారని ఈ పరిణామం సూచిస్తుంది. పైగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని అంటూ ప్రధాని మోదీ స్వయంగా చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసి, ఎస్సి, ఎస్టీ, ఓబిసి రేజర్వేషన్లను రద్దు చేస్తుందని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కొంత కాలంగా బిజెపి డబల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో రాస్త్రాలలో బలం పుంజుకొని ప్రయత్నం చేస్తున్నది. అయితే బీజేపీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలలో ప్రతికూల ఫలితాలు ఏర్పడటం చూస్తుంటే ఈ నినాదంకు కాలం చెల్లుతున్నట్లు అర్ధం అవుతుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో బిజెపి రెండో స్థానంలోకి నెట్టివేయబడటం ఆ పార్టీ శ్రేణులకు విభ్రాంతి కలిగిస్తున్నది. అందుకు పార్టీ అధినాయకత్వం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణులు కారణంగా విమర్శలు చెలరేగుతున్నాయి. దేశవ్యాప్తంగా చెక్కుచెదరని ఇమేజ్ ఏర్పర్చుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఈ ఎన్నికలలో దాదాపు ప్రేక్షక పాత్ర వహింప చేశారని, అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికల వ్యూహంలో ఎటువంటి పాత్ర లేకుండా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్గత సర్వేలలో తిరిగి గెలుపొందే అవకాశాలు ఉన్న వారికి సహితం తిరిగి సీట్లు ఇవ్వకుండా వ్యాపార వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటం పలు రాష్ట్రాలలో పార్టీ శ్రేణులలో తిరుగుబాటుకు దారితీసింది. పార్టీతో, ఆ ప్రాంతంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి తమపై రుద్దుతున్నారనే అసంతృప్తి పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. `మోదీ గ్యారంటీ' పేరుతో పార్టీ ఎన్నికల ప్రచారం ప్రకటించి, ఆయనే పార్టీ, ఆయనే ప్రభుత్వం అన్న విధంగా ప్రచారం చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు పలుచోట్ల తమాయించుకోలేక పోయారని చెబుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో బలమైన నాయకులు, రాస్త్రాలలో కీలు బొమ్మ నాయకులతో నడుపుతూ ఉండేవారు. అటువంటప్పుడు బిజెపికి జాతీయ స్థాయి నాయకులు మీడియాకు పరిమితమైనా రాస్త్రాలలో బలమైన నాయకులు ఉండేవారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కు పలు రాష్ట్రాలలో బలమైన నాయకులు కనిపిస్తున్నారు. బీజేపీలో మాత్రం భజనపరులకే నాయకత్వం పరిమితం చేస్తూ కేవలం ప్రధాని ఇమేజ్ పైననే మొత్తం పార్టీ ఆధారపడినట్లు చేస్తున్నారు. బీజేపీకి, మిత్రపక్షాలకు ఎదురుదెబ్బ తగిలిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లలో ఈ ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్ష కానున్నాయి. అయితే, బిజెపి నామమాత్రపు ఓట్లు పోగొట్టుకోగా 60కు పైగా సీట్లు కోల్పోవడం, కాంగ్రెస్ నామమాత్రపు అధిక ఓట్లతో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో నమోదైన 37.3 శాతంతో పోలిస్తే తగ్గింది 0.7 శాతం మాత్రమే. కానీ, సీట్ల పరంగా మాత్రం భారీగా గండి పడింది. ఏకంగా 303 నుంచి 240 స్థానాలకు భారతీయ జనతాపార్టీ పడిపోయింది. మొత్తంగా 63 స్థానాలు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 21.2 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అంటే 1.7 శాతం ఓట్లు పెరిగాయి. కానీ, సీట్లు మాత్రం దాదాపు రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. ఎన్నికల్లో ఓట్ల శాతాల్లో తేడాలు స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో పెద్ద వ్యత్యాసానికి దారితీస్తోంది. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ విషయంలో అదే జరిగింది. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. కానీ, పెరిగిన ఆ ఓట్లు ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాయి. పంజాబ్‌లో ఓట్ల శాతం 9.6 శాతం నుంచి 18.6 శాతానికి పెరిగింది. ఏ పార్టీతో పొత్తు లేకపోవటం వల్ల ఉన్న రెండు సీట్లనూ భారతీయ జనతా పార్టీ చేజార్చుకోవాల్సి వచ్చింది. బిహార్‌లో 23.6 శాతం నుంచి 20.5 శాతానికి కుంగడం కమలదళానికి ఐదు సీట్లకు గండి కొట్టింది. బెంగాల్లో బీజేపీకు 1.6 శాతం ఓట్లు తగ్గగా, ఆరు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. 2019లో బంగాల్‌లో 18 సీట్లు నెగ్గిన బీజేపీ ఈసారి 12కే పరిమితమైంది. మహారాష్ట్రలోనైతే తగ్గింది 1.4 శాతం ఓట్లే అయినా సీట్ల సంఖ్య మాత్రం 23 నుంచి 9కి పడిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. మహారాష్ట్రలో 16.3 శాతం నుంచి 17.1 శాతానికి ఓట్లను పెంచుకొని సీట్ల సంఖ్యను ఏకంగా ఒకటి నుంచి 13కు చేర్చింది. రాజస్థాన్‌లో 3.7 శాతం ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా సున్నా నుంచి ఎనిమిది సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 శాతం నుంచి 9.5 శాతానికి ఓట్లు పెరగ్గా, సీట్లు ఒకటి నుంచి ఆరుకు ఎగబాకాయి. ఆ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 18 నుంచి 33.5 శాతానికి పెరిగింది. ఆ పార్టీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 37 సీట్లను కైవసం చేసుకుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి