Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పరామర్శ..
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు. గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు.
telugu-news | latest-news | ntr-district