Balakrishna 50 years: ఐదు దశాబ్దాలు..ఆల్ జానర్స్..అన్ స్టాపబుల్.. ఇదీ బాలయ్య బాబు అంటే!

నందమూరి బాలకృష్ణ లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు. ఐదు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా కొనసాగుతున్నారు. బాలయ్య బాబు ఏభై ఏళ్ల సినీజర్నీ, ఎదుర్కున్న ఒడిదుడుకులు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Balakrishna 50 years: ఐదు దశాబ్దాలు..ఆల్ జానర్స్..అన్ స్టాపబుల్.. ఇదీ బాలయ్య బాబు అంటే!

Balakrishna 50 years: ఆయనకు ఎవరైనా ఎదురెళ్ళినా వారికే ప్రాబ్లమ్.. ఎవరికైనా ఆయన ఎదురువెళ్లినా వారికే ప్రాబ్లమ్.. ఐదు దశాబ్దాలు.. వందలాది సినిమాలు.. ఆల్ జోనర్స్.. మామూలు హిస్టరీ కాదిది. ఒక నటశిఖరానికి వారసుడిగా.. వెండితెరపై అడుగుపెట్టిన నాటి నుంచి ఏభైఏళ్లుగా తనదైన ప్రత్యేకమైన ఛరిష్మాతో తెలుగు సినీ వినీలాకాశంలో మెరిసిపోతున్నారాయన. ఇంత చెప్పాకా.. ఆయన పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, చెప్పుకోవాల్సిందే కదా. అవును.. ఆయనే నందమూరి అందగాడు బాలకృష్ణ. తన ఏభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన చూడని రికార్డులు లేవు. ఆయన టచ్ చేయని జానర్ లేదు. పౌరాణికం.. జానపదం.. సాంఘికం.. సైన్స్ ఫిక్షన్.. వీటిలో మళ్ళీ కామెడీ.. ఎమోషనల్.. యాక్షన్.. ఫాంటసీ అసలు బాలకృష్ణ ఇది చేయలేదు అని చెప్పడానికి వీలులేని రకరకాల పాత్రల్లో ప్రజల్ని మెప్పించిన నటుడు ఆయన. ఒక లెజెండ్ వారసత్వ ముద్రతో టాలీవుడ్ లో అడుగు పెట్టినా.. ఆ నీడలో ఎదిగినా.. క్రమంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సృష్టించుకోవడంలో బాలకృష్ణ సూపర్ సక్సెస్ అయ్యారు. ఐదు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో తిరుగులేకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాని విషయం. బాలకృష్ణ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అయితే, ఇదంత తేలికగా జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో కోలుకోలేని దెబ్బలు.. ఏది జరిగినా సినిమాను వదలకుండా.. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బాలయ్య బాబుగా టాలీవుడ్ లో ఇప్పటికీ ఒక ప్రభంజనంలా నిలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన సినీ ప్రస్థానం 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా టాలీవుడ్ ఆయనకు ప్రత్యేక కార్యక్రమంతో శుభాకాంక్షలు అందచేస్తోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ జీవితంలో ఎదుర్కున్న ఒడిదుడుకుల ప్రస్థానం ఒకసారి చెప్పుకుందాం. 

balakrishna balakrishna

Balakrishna 50 years: తాతమ్మ కల సినిమాతో 1974లో బాలకృష్ణ సినీ అరంగేట్రం జరిగింది. అక్కడి నుంచి పదేళ్ల పాటు అంటే 1983లో సింహం నవ్వింది వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ప్రత్యేక పాత్రలు.. సపోర్ట్ క్యారెక్టర్స్. అదే సంవత్సరం సోలో హీరోగా సాహసమే జీవితం అంటూ ఎంట్రీ ఇచ్చారు. నిజంగానే ఆ సమయంలో ఆయన సాహసం చేశారు. ఒక పక్క అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్స్.. మరోపక్క చిరంజీవి, సుమన్ వంటి అప్పటికే దూసుకుపోతున్న సమకాలీన హీరోలు వీరి మధ్యలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చారు బాలయ్య. అయితే, అదే ఏడాది వరుసగా డిస్కో కింగ్, జననీ జన్మభూమి సినిమాలు బాలకృష్ణ సినిమాల్లో ఎలా నెగ్గుకు వస్తారో అనిపించేలా చేశాయి. కానీ, 1984లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారిమనవడు సినిమా వచ్చింది. అప్పటి వరకూ తెలుగులో వచ్చిన సినిమాల రికార్డులు తిరగరాసింది. అదే సంవత్సరం కథానాయకుడు సినిమా కూడా బాలకృష్ణకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా కుటుంబ కథా చిత్రాలతోనే కనిపిస్తూ వచ్చారు బాలకృష్ణ. 1986 వరకూ అలా అలా సాగింది కెరీర్ మళ్ళీ అప్పుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే వచ్చింది ముద్దుల కృష్ణుడు. మళ్ళీ బ్లాక్ బస్టర్. ఆ తరువాత చాలా కమర్షియల్ సినిమాలు చేసినా.. బాలకృష్ణకు కలిసి వచ్చిన జోనర్ మాత్రం ఫ్యామిలీ జొనరే. ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు, రాముడు భీముడు ఇలా అన్ని సినిమాల్లోనూ కుటుంబ నేపధ్యం ఉన్న కథలే. సరిగ్గా ఇలాంటి సమయంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చింది ఆదిత్య369. టైమ్ లైన్ జానర్ లో సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సమయంలో ఇలాంటి సినిమా బాలకృష్ణకు సూట్ అవ్వదు..అని అందరూ అన్నారు. కానీ, సినిమా విడుదలయ్యాకా ఇది బాలయ్య కోసమే ప్రత్యేకమైన సినిమా అని చెప్పుకున్నారు. ఇప్పటికీ, ఆ సినిమా బాలకృష్ణ సినిమాల్లో ది బెస్ట్ సినిమాల్లో టాప్ 5లో ఉంటుంది. 

thathamma kala Credits @ IMDB

Balakrishna 50 years: ఇక 2004 వరకూ బాలకృష్ణ తనదైన శైలిలో ఫ్లాప్స్ ఉన్నా.. మధ్య మధ్యలో బ్లాక్ బస్టర్స్ ఇస్తూ దూసుకుపోయారు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగారు. అయితే 2004లో ఎన్నో అంచనాలతో  వచ్చిన విజయేంద్ర వర్మ సినిమా నుంచి వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దెబ్బతిన్నాయి. అక్కడ నుంచి 2011 వరకూ బాలకృష్ణ ప్రతి సినిమా ఫెయిల్ అవుతూ వచ్చింది. మధ్యలో ఒకటీ ఆరా ఏవరేజ్ గా నిలిచినా ఈ ఏడేళ్లలో బాలకృష్ణ స్టామినాకు తగ్గ సినిమా ఒక్కటీ పడలేదు. దీంతో ఇండస్ట్రీలో బాలకృష్ణ పని అయిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. అసలు ఇక బాలకృష్ణ సినిమాల్లో ఉండలేరు అంటూ జోస్యాలు మొదలు అయిపోయాయి. అంత ఈజీగా ఓటమి ఒప్పుకుంటే ఆయన బాలకృష్ణ ఎందుకు అవుతారు? శ్రీరాముడిగా శ్రీరామరాజ్యం సినిమాతో మళ్ళీ నేనున్నాను.. టాలీవుడ్ షేక్ చేస్తాను అంటూ దూసుకువచ్చారు. తరువాత మళ్ళీ సినిమాలు బోల్తా కొట్టినా.. ఈసారి 2014లో లెజెండ్ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక మళ్ళీ ఇప్పటివరకూ దాదాపు రెండు దశాబ్దాలుగా బాలకృష్ణ వెన్నక్కి తిరిగి చూడలేదు. బాలయ్య బాబు సినిమా వస్తుంది అంటే.. ప్రేక్షకుల్లో అదోరకమైన ఊపు. ఫ్యామిలీ ఎమోషన్స్ కి మాస్ ఎలివేషన్స్ టచ్ తో వరుసగా హిట్స్ కొడుతూ.. ప్రేక్షకులను ఒక్క వైపే చూసేలా అంటే తన వైపే చూసేలా చేసుకున్నారు.. 

Balakrishna

Balakrishna 50 years: ఇప్పుడు బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో అఖండ నట శిఖరం. ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ వేరు. ఇటు సినిమాల్లో.. అటు రాజకీయాల్లో సమానంగా విజయవంతంగా రాణిస్తూ వస్తున్న ఏకైక నటుడు బాలకృష్ణ అంటే అతిశయోక్తి కాదు. పరాజయాలు ఎదురైనా.. ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే తన పని అనుకుంటూ తన పని అయిపొయింది అనేవారికి అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి సమాధానం ఇచ్చిన బాలకృష్ణ.. అటు బుల్లితెరపై కూడా క్రేజీ స్టార్ అయిపోయారు. అవును.. బాలయ్య బాబు ఆహా కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ ఆయన నట ప్రస్ధానంలానే అన్ స్టాపబుల్ వ్యూయర్స్ ని సాధించి రికార్డులు సృష్టించింది. ఏభైఏళ్ల సినీ ప్రస్థానం పండుగ జరుపుకుంటున్న బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని తెలుగు సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 

publive-image

#balakrishna-50-years #balakrishna
Advertisment
Advertisment
తాజా కథనాలు