AP-TG Elections: ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ వివరాలివే!

ఏపీ, తెలంగాణలోనూ పోలింగ్‌ రోజుల్లో కొన్ని సీట్లలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. RTV గత నెలలో చెప్పిన స్టడీ ప్రకారమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉండగా.. రెండు సీట్లలో మార్పు జరిగింది. అవి ఏ స్థానాలో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
AP-TG Elections: ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ వివరాలివే!

Elections 2024: నెల రోజుల క్రితం ఏపీ తెలంగాణలకు సంబంధించి మా స్టడీ రిపోర్టును మీకు చూపించాం. నిన్న టీవీ ఛానల్స్‌, పలు సర్వే సంస్థలు లోక్‌సభతో పాటు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ చూపించిన వెంటనే రవిప్రకాష్‌ ఫోన్‌కు చాలా మెసేజ్‌లు వచ్చాయి. నాకు మెసేజ్‌లు, కాల్స్‌ చేసిన అందరూ ఒకటే చెప్పారు. నెల రోజుల క్రితం మీరు ఏం చూపించారో, ఏం చెప్పారో ఇవాళ ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణ, ఆంధ్రకు సంబంధించి అవే ఫలితాలు చూపిస్తున్నాయని తెలిపారు. అయితే పోలింగ్‌ రోజుల్లో కొన్ని సీట్లలో ఏపీ, తెలంగాణలోనూ అనూహ్యమైన మార్పులు జరిగాయి. అందుకే ఈ పోస్ట్‌ పోల్‌ స్టడీ రిపోర్టును మీ ముందుకు తెస్తున్నాం. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై అనేక సంస్థలు తమ ఎగ్జిట్‌ ఫోల్‌ ఫలితాలు వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించిన ఫలితాలన్నీ క్రోడీకరిస్తే తెలంగాణలో బీజేపీ 9 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించబోతుందని, కాంగ్రెస్‌ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని, బీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కానుందని, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తేల్చాయి.

గతంలో ఆర్టీవీ సర్వే రిపోర్టులో మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 8, కాంగ్రెస్‌ 8, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తాయని, బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదని తేలింది. అయితే రాజకీయాల్లో పరిస్థితులు మారడానికి ఒక్క రోజు చాలు. అయితే పోలింగ్‌ రోజున ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది ఆర్టీవీ పోస్ట్‌ పోల్‌ స్టడీలో తేలింది. పోలింగ్‌కు ముందు కాంగ్రెస్‌-8 (ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూలు), బీజేపీ-8 (నిజామాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌), ఎంఐఎం-1(హైదరాబాద్‌), బీఆర్‌ఎస్‌-0 స్థానాల్లో గెలుస్తాయని ఆర్టీవీ స్టడీ తెలియజేసింది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. మారిన తాజా వివరాలను కూడా ఆర్టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఆర్‌టీవీ పోస్ట్‌ పోల్‌ స్టడీలో బీజేపీ-10 (ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, వరంగల్‌), కాంగ్రెస్‌-6 (పెద్దపల్లి, మహబూబాబాద్‌, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూలు), ఎంఐఎం-1 (హైదరాబాద్‌), బీఆర్‌ఎస్‌-0 సీట్లు గెలుస్తుందని తేలింది. ప్రీ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్న ఆదిలాబాద్‌, వరంగల్‌లు.. పోస్ట్‌ పోల్‌ సర్వేలో బీజేపీకి వచ్చి చేరాయి. దీంతో బీజేపీ తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాలు గెలవనుంది. కాంగ్రెస్‌ 6 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానంతో సరిపెట్టుకోనుంది. ఇక గతంలో చెప్పిన లెక్క ప్రకారమే బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవడం కష్టమే

ఆదిలాబాద్‌లో మారనున్న ఫలితం..
ఆదిలాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సుగుణ గెలుస్తారని పోలింగ్‌కు ముందు ఆర్టీవీ స్టడీలో తేలింది. పోలింగ్ తర్వాత అక్కడ పరిస్థితి మారింది. బీజేపీ అభ్యర్ధి గోడం నగేష్‌కు మోడీ మేనియా బాగా కలిసొచ్చింది. నగేష్ వివాద రహితుడు, వ్యక్తిగతంగా మంచి పేరుంది. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా కలిసొచ్చింది. అటు కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సుగుణ ఉద్యమకాలంలో బంజారాలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వైరల్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆదివాసీల్లోని ప్రధాన తెగలు కూడా నగేష్ వైపే మొగ్గాయి. ఆదివాసీ తెగల్ని ఏకం చేసేందుకు సీతక్క ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. ఇక కాంగ్రెస్ హామీలపై అసంతృప్తి కూడా నగేష్‌కు ప్లస్ అయింది. కాంగ్రెస్ ఇంచార్జ్‌గా వచ్చిన సత్తు మల్లేష్‌... కాంగ్రెస్‌లో గ్రూపుల్ని ఏకం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీంతో ఫలితం బీజేపీకి అనుకూలంగా మారింది. దీంతో ఆదిలాబాద్‌ పార్లమెంటు సీటును బీజేపీ దక్కించుకోబోతంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మా ప్రీపోల్‌ సర్వే తర్వాత ఈ నియోజకవర్గాల్లో ఏం మార్పులు జరిగాయో ఒక్కసారి చూద్దాం. సిర్పూర్ సెగ్మెంట్‌లో బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ ఎమ్మెల్యేగా గెలవడం ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి కలిసొచ్చింది. బీజేపీ భారీ స్థాయిలో జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడం ప్లస్ అయింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉన్న బెంగాలీ ఓటర్లు పూర్తిగా కమలం గుర్తుకే ఓటేశారని మా స్టడీలో తేలింది. మోడీ మేనియా కూడా కలిసొచ్చింది. ఆసిఫాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి కోవా లక్ష్మి గెలిచారు. అయితే లోక్‌సభకి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. స్థానికంగా బలమైన నాయకత్వాన్ని పార్టీలోకి ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక్కడ ఎక్కువగా ఉండే బంజారాలని అకట్టుకోవడంలో బీజేపీ వ్యూహాలు పనిచేశాయి. దీనికి నరేంద్రమోదీ మేనియా కూడా తోడయింది. ఖానాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వెడ్మా బొజ్జు గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. కాంగ్రెస్‌లో వర్గపోరుని బీజేపీ క్యాష్ చేసుకుంది. కమలం గుర్తుని స్థానిక నాయకులు బలంగా ప్రజల్లోకి తీసకెళ్లారు. విద్యావంతుల్లో పెరిగిన మోదీ గ్రాఫ్ కూడా పనిచేసింది. ఓవరాల్‌గా ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ పైచేయి కనిపించింది. ఆదిలాబాద్ విషయానికొస్తే... అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధి పాయల్ శంకర్ గెలవడం కలిసొచ్చింది. మోదీ స్వయంగా బహిరంగసభలో పాల్గొని, ఆదిలాబాద్‌కు వరాలు కురిపించడంతో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. వరుసగా జాతీయ స్థాయి నాయకులతో సభలు పెట్టడంతో జనంలోకి బాగా వెళ్లింది బీజేపీ. మహారాష్ట్ర బోర్డర్ ఏరియాలో బీజేపీ బలంగా ఉండటం కూడా అడ్వాంటేజ్ అయింది. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్‌కి వస్తే... అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి అనిల్ జాదవ్ గెలిచారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఎంపీ అభ్యర్ధి గోడం నగేష్ స్థానికుడు కావడం ఇక్కడ బీజేపీకి కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఆదివాసులు కూడా స్థానికుడైన నగేష్‌కే ఓటేసేందుకు మొగ్గు చూపారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఖర్చుపెట్టారు. తమ సిట్టింగ్ సీట్‌ని కాపాడుకునే లక్ష్యంతో BJP-RSS శ్రేణులు తీవ్రంగా ప్రచారం చేశారు. దీంతో చివరి నమిషంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. ఇక నిర్మల్‌కి వెళ్తే... అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్ధి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే గెలిచి ఉండటం ప్లస్ అయింది. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఉండటం అడ్వాంటేజ్ అయింది. అయోధ్య రామాలయ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. బీఆర్‌ఎస్‌లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆ పార్టీకి మైనస్ అయినట్టు తెలుస్తోంది. ముథోల్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలవడం ఆ పార్టీకి కలిసొచ్చింది. మతపరంగా సెన్సిటివ్ ఏరియా అయిన భైంసా లాంటి చోట బీజేపీకి వన్‌సైడ్‌ ఓట్లు పడ్డాయి. హిందుత్వ ఎజెండాని జనంలోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ కార్యకర్తలు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా రామాలయ నిర్మాణం అంశం ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. దీనికి మోదీ మేనియా కూడా తోడయింది. బీజేపీ అభ్యర్ధి నగేష్‌కు విజయావకాశాలు బాగా పెరిగినట్టు మా సర్వేలో తేలింది.

వరంగల్‌లో ఆరూరి వైపు మొగ్గు..
ఆదిలాబాద్‌లో ఫలితం మారబోతున్న విషయం ఇప్పటిదాకా చెప్పుకున్నాం.. తర్వాత సీటు వరంగల్ . ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య గెలిచే అవకాశం ఉందని పోలింగ్‌కు ముందు చేసిన ఆర్టీవీ స్టడీలో చెప్పాం. కానీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్ధి ఆరూరి రమేష్‌ ఆర్ధికంగా బలంగా ఉండటంతో పాటు భారీగా అనుచరగణం ఉంది. పోలింగ్‌కు 3-4 రోజుల ముందు నుంచి సంఘ్ పరివార్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసింది. వరంగల్‌కు స్మార్ట్ సిటీ గుర్తింపు, ఎయిర్ పోర్ట్ హామీ, కాజీపేట్ రైల్వే డివిజన్ లాంటి అంశాల్ని బీజేపీ బలంగా జనంలోకి తీసుకెళ్లింది. మందకృష్ణ మాదిగ ప్రచారం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి కడియం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌లోకి రావడం ఆ పార్టీలో అంతర్గత సమస్యలకి కారణమైంది. విద్యావంతుల్లో మోదీ మేనియా ఉండటం ఆరూరి రమేష్‌ విజయావకాశాల్ని పెంచేసింది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్‌ ఎన్నికకు వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏం మారిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్, ఒక్కచోట బీఆర్ఎస్ గెలిచాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడంతో మొత్తం ఏడు సెగ్మెంట్లు కాంగ్రెస్‌ ఖాతాలో చేరిపోయాయి. అయితే పార్లమెంట్‌ ఎన్నిక నాటికి పరిస్థితి అనూహ్యంగా మారిపోయి బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్లాయి. వరంగల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ముందుగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ సీటుకి వెళ్దాం. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా తన కుమార్తె కడియం కావ్యకి టికెట్ తెచ్చుకున్నారు. బీఆర్ఎస్‌కు పట్టున్న ఈ సెగ్మెంట్‌లో కడియంకి తాటికొండ రాజయ్యకు మధ్య ఉన్న గొడవ కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. కడియంకు వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేసి బీఆర్ఎస్‌కి ఓట్లు పడేలా రాజయ్య కష్టపడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఓడించారు కడియం. దీంతో ఆయన్ను దెబ్బతీయాలన్న పట్టుదలతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలు పని చేయడం కావ్యకి మైనస్ అయింది. ఓవరాల్‌గా ఈ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు పడటం బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ హవా కనిపించింది. ఈ సెగ్మెంట్‌లో తాజాగా అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్‌కు ఓట్లు పడకుండా కృషి చేశారు. ఇది బీజేపీకి కలిసొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు పరకాల చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. సంఘ్‌ పరివార్‌ ఈ సెగ్మెంట్‌లో బలంగా ఉంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు కాబట్టి మోదీ మేనియా కూడా ఇక్కడ పని చేసిందనే చెప్పాలి. వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో ఈసారి అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది. విద్యావంతులు ఎక్కువగా ఉండటంతో పడిన ఓట్లలో బీజేపీకే ఎడ్జ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ ఈస్ట్‌లో బీజేపీకే అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అర్బన్‌ ఏరియాలో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ కూడా ఈసారి బీజేపీ వైపు పడినట్లు పోల్‌ పండితులు చెబుతున్నారు. వరంగల్‌ వెస్ట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నా ఈసారి ప్రభావం తక్కువేనని తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకత కనిపిస్తోంది. అది బీజేపీకి ప్లస్‌ అయినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ నుంచి కే.ఆర్‌.నాగరాజు గెలిచారు. అయితే ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌ సొంత నియోజకవర్గం కావడం ఆయనకు ప్లస్‌ అయింది. బీజేపీ హవా, మోదీ ప్రచారం ఆయనకు కలిసి వచ్చినట్టు పోలింగ్‌ తర్వాత జరిపిన మా అధ్యయనంలో తేలింది. భూపాలపల్లె అసెంబ్లీ సీటులో కాంగ్రెస్‌ నుంచి గండ్ర సత్యనారాయణ గెలిచారు. ఈ సెగ్మెంట్‌లోనూ ఇప్పుడు అత్యధికంగా ఓట్లు పడ్డాయి. ఇది కూడా కాంగ్రెస్‌ అనుకూల సీటు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ BJP- RSS శ్రేణులు ప్రతి గడప గడపను టచ్‌ చేశారు. రామాలయ నిర్మాణ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. దీని ప్రభావం పోలింగ్‌పై కనిపించింది. మొత్తానికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది.

భువనగిరిలో టఫ్‌ ఫైట్‌
వరంగల్ పక్కనే ఉండే భువనగిరి లోక్ సభ సీటుకు వస్తే.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్‌కుమార్ రెడ్డి గెలుస్తారని పోలింగ్‌కు ముందు ఆర్టీవీ స్టడీలో చెప్పాం. ఇక్కడ కాంగ్రెస్ విజయం చాలా తేలిక అనుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా రాజగోపాల్ రెడ్డి ఉండటంతో... పోటీ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బూర నరసయ్యగౌడ్ గా మారింది. కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం ఇది. దాంతో పాటు జనగాం మినహా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావడంతో గెలుపుపై ధీమా కనిపించింది. కానీ చివరలో బీఆర్‌ఎస్‌ క్యాడర్ బూరనర్సయ్య గౌడ్ వైపు వెళ్లారు. బీసీ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో బూర నర్సయ్యకే ఓటేశారన్న వాతావరణం ఉంది. దీనికి తోడు మోదీ మేనియా, రామాలయ నిర్మాణం కూడా ఓటర్లపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు