Pawan Kalyan: ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తే ఊరుకోను.. పార్టీ నేతలకు పవన్ హెచ్చరిక ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలిచ్చిన గొప్ప విజయాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. అధికారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించేవారి పై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. By Archana 15 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. కూటమి ఘన విజయంలో జనసేన గెలుపే వెన్నెముకని, వైసీపీ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్ధులుగానే చూడాలన్నారు. ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలిచ్చిన గొప్ప విజయాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు జరిగిందన్న పవన్.. జనసేన పార్టీ పటిష్టానికి ప్రతి ఒక్కరు కష్టపడాలని పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులను, వారసులను దూరంగా ఉంచాలని చెప్పారు. అతిగా ఊహించుకుని ఇష్టానుసారం ప్రవర్తించేవారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. వారంలో ఒక రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించాలని ఆదేశించారు. పత్రికా ప్రకటన ‘భారతదేశ రాజకీయ చరిత్రలో జనసేన సాధించిన విజయం రాజకీయ నిఫుణులకు, రాజనీతి శాస్త్ర విభాగంలో ఒక కేస్ స్టడీ అయ్యింది. జాతీయ స్థాయిలో నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అమితంగా గౌరవించడానికి జనసేన విజయం ఎంతో దోహదపడుతుంది. ఇటీవల శ్రీ ముకేష్ అంబానీ గారి కుమారుడి వివాహానికి వెళ్లిన సమయంలోనూ అక్కడి అతిధులు జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ విజయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఎలా సాధ్యమని అడగడం గొప్పగా అనిపించింది. ఇది ఐదు కోట్ల ఆంధ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకం అని మనం గుర్తించాలి. ప్రజలు ఇచ్చిన ఈ విజయం ఓ గురుతర బాధ్యత అని మరువద్దు. ఆ నమ్మకాన్ని నెరవేర్చాలి’ అని ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఐదేళ్ల కిందట పరాజయం తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంతదూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదనీ, మరొకరైతే పార్టీని అప్పుడే వదిలేసేవారన్నారు. గత పాలక పక్షానికి ఇప్పుడు 11 సీట్లు రాగానే అసెంబ్లీకే రాకుండా ఉండిపోయారు... అంటే ఓటమిని తట్టుకోవడం అంత సులభం కాదు అని చెప్పారు. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం జనసేన పార్టీ సాగించిన పోరాట ప్రయాణం ఇంత దూరం నడిపించిందన్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికయిన లోక్ సభ సభ్యులకు, శాసన సభ, శాసన మండలి సభ్యులకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ సీట్లను పరిమితం చేసుకుని ఎన్నికల బరిలో దిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మనం తీసుకున్న 21 సీట్లు 175లో తక్కువే కావచ్చు. కానీ కూటమి 164 చోట్ల విజయ దుంధుబి మోగించడంలో ఆ 21 సీట్లే వెన్నెముక అయ్యాయి. క్షేత్ర స్థాయిలో ప్రజలు జనసేన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఎక్కడా ఓట్లు చీలకుండా కూటమికి ప్రజలంతా అండగా నిలబడిన తీరు జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గెలిచిన తీరు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చగలిగింది. ఓ రాక్షస పాలన అంతం చేయడానికి ప్రజలు ఎంతో నిశ్శబ్దంగా, క్రమశిక్షణగా చేసిన ఓటు పోరాటం గొప్పది. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో డబ్బు వెచ్చించి మరీ వచ్చి ఓట్లు వేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఆ ప్రజాస్వామ్య విలువలను మనం పూర్తిగా గౌరవించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని మనమంతా సమష్టిగా పని చేసి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది. • అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు గత వైసీపీ పాలనలో ప్రజలంతా భయం గుప్పెట్లో బతికారు. కోట్లాది మంది ప్రజలు మార్పు కోసం ఆశగా ఎదురుచూశారు. రోడ్డు మీదకు రావాలంటే భయం. అభిప్రాయం తెలియచేయాలంటే భయం. కనీసం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. బూతులు, బెధిరింపులు, కేసులు, వ్యక్తిగత దూషణలు గత ప్రభుత్వంలో నిత్యకృత్యం అయిపోయాయి. సాక్షాతూ ప్రజల చేత ఎన్నికయిన ఎంపీని బంధించి భౌతికంగా హింసించిన తీరు అందరికీ తెలిసిందే. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 54 రోజుల పాటు జైల్లో పెట్టించిన తీరు కూడా అవగతమే. గత ప్రభుత్వ దాష్టికాలను బలంగా ఎదురొడ్డి నిలిచింది ఒక్క జనసేన పార్టీ మాత్రమే. జనసైనికులు, వీర మహిళలు తప్పు జరిగిన ప్రతి చోటా రోడ్ల మీదకు వచ్చి పోరాడిన తీరు ఐదు కోట్ల మంది ప్రజలకు బలం అయ్యింది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నో పోరాటాలు, ఎంతో కష్టం, శ్రమ పడిన జనసైనికులకు, నాయకులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. జనసేన పోటీ చేయని చోట కూడా బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాలా సహకరించిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. • మన బలం 20 శాతానికి పెరిగింది శ్రీ పొట్టి శ్రీరాములు, శ్రీమతి డొక్కా సీతమ్మ గారి వంటి మహనీయుల సేవలు మనం మర్చిపోతే కృతఘ్నులుగా మిగిలిపోతాం. అలాంటి మహనీయుల ప్రేరణతోనే ఏ పదవీ ఆశించకుండానే రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాను. పదవి ఉన్నా లేకున్నా కడవరకు ప్రజల కోసం పని చేయాలన్న తపనతోనే రాజకీయాలు మొదలు పెట్టాను. ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు అధికారం చూడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైన శాఖలను తీసుకున్నాం. ఈ శాఖల్లో తగిన విధివిధానాలు నిర్ణయించి శాఖలను పటిష్టంగా తీర్చిదిద్దిన తర్వాత ఈ బాధ్యతలు కూడా తగిన విధంగా అప్పగిస్తాను. ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారితో ఏం మాట్లాడాలని ఇటీవల పార్టీ ఎంపీలు అడిగారు. 140 కోట్ల మంది భారతీయుల బరువు మోసే ఆయనకు మన తరఫున బరువు దించే అంశాలే మాట్లాడిరావాలని సూచించాను. ప్రధాని శ్రీ మోదీ గారితో అవసరం అయిన సందర్భంలో ఖచ్చింతగా 5 కోట్ల ఆంధ్రుల కోసం మాట్లాడుతాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకుండా చూసే అంశం గురించి, రైల్వే జోన్ విషయం గురించి రాష్ట్రంలో ఉపాధి అవకాశాల పెంపు గురించి మాట్లాడుతాను. ప్రజలకు అవసరం అయిన విషయాల గురించి మాత్రమే చర్చిస్తాను. మనం రాష్ట్రం కోసం బలంగా నిలబడ్డాం అని ప్రజలు నమ్మారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన బలం 7 శాతం నుంచి 20 శాతంకు పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. గెలిచిన వారికి కూడా ఊహించని మెజారిటీలు వచ్చాయి. జనసేన ఓటు బలంగా కూటమి వైపు టర్న్ కావడం శుభసూచకం. అధికారంలోకి వచ్చామని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ మనం చేయకూడదు. వైసీపీ నాయకులు మనకి శత్రువులు కాదు. కేవలం రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమే. వారి విధానాల మీదనే మన పోరాటం ఉండాలి. వ్యక్తిగతంగా కాదు. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు లోతుగా అర్ధం చేసుకోవాలి. కక్ష సాధింపులు, వ్యక్తిగత వేధింపులు, దూషణలకు దూరంగా ఉండాలి. ఏదైనా అంశం మీద చర్చ జరిగినప్పుడు భావంలోని తీవ్రతను భాషలో చూపించాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే పరుషపదజాలం లేకుండానే చెప్పవచ్చు. దీనిని ప్రతి ఒక్కరు పాటించాలి. ముఖ్యంగా రౌడీయిజం, గూండాయిజం నమ్ముకోవడం పూర్తిగా పక్కన పెట్టి ప్రజల్లో పార్టీ పట్ల పూర్తి విశ్వాసం నింపేలా పని చేయాల్సిన అవసరం ఉంది. • శాఖల్లో లెక్కలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అడ్డగోలు ఖర్చులు, నిధులు వినియోగం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కనీసం కార్యాలయంలో ఫర్నిచర్ కూడా కొనుగోలు చేయవద్దని సొంత ఫర్నిచర్ నే కార్యాలయంలో వాడుతున్నాను. ప్రజాధనాన్ని రూపాయి కూడా అనవసరంగా వృధా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. రూ. 200 కోట్లు ఖర్చు పెడితే ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో పథకాలను పాలకులు వదిలేశారు. రూ. 600 కోట్లు ఖర్చు చేసి రుషి కొండ ప్యాలెస్ ను ఏ కారణం చేత కట్టారో కూడా తెలియదు. ప్రజాధనం వినియోగంలో జాగ్రత్త వహించాలి. వీధి పోరాటాలు, రాష్ట్రం కోసం ప్రజా పోరాటాలు చేసి ఈ స్థితికి వచ్చాం. చిన్నపాటి కుర్చీ ఉంటే దానిలో కూర్చునే పాలన సాగిద్దాం. పౌర సరఫరాల శాఖ మంత్రిగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తనిఖీలు చేస్తుంటే పేదలకు వెళ్ళే బియ్యాన్ని ఎలా తరలించేస్తున్నారో, అదెంత మాఫియానో ప్రజలకు తేటతెల్లం అయింది. • జనం కోసం సొంత కుటుంబాన్నే పక్కన పెడతాను పార్టీని పటిష్టం చేయడానికి ఎవరి స్థాయిలో వారు బలంగా పని చేయాలి. నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఆయా నియోజకవర్గాల్లో జనవాణి నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించి వారి సమస్యలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజల కష్టాలు తెలుస్తాయి. వాటిని తీర్చేందుకు ఏం చేయాలో తెలుస్తుంది. జనసేన పార్టీ నుంచి ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగం చేస్తే సహించను. అధికారులతో కూడా చాలా హుందాగా మాట్లాడాలి. ఇంట్లో కుటుంబ సభ్యులను అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేయనీయొద్దు. వారసత్వ రాజకీయాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు గాని, నాయకుల కుటుంబ సభ్యులను సహజ ధోరణిలో రాజకీయాల్లోకి తీసుకురావాలి తప్పితే జనం మీద రుద్ది వారిని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం నేను సహించను. మన నాయకుల్ని మనమే ఇష్టానుసారం సోషల్ మీడియాలో తిడితే వారు నాకు విధేయులైనా, అమితంగా ఇష్టపడే వారైనా వారిని వదులుకోవడానికి సిద్ధం. ముఖ్యంగా మహిళా నేతలను ఎవరైనా కించపర్చినట్టు మాట్లాడితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. రాజకీయాలను సంస్కరించాలి అని వచ్చిన మనమే సంస్కార హీనులుగా మారకూడదు. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను. ప్రజలు మనల్ని ఎంతో నమ్మి ఇచ్చిన విజయాన్ని దుర్వినియోగం చేయొద్దు. నేను లేకపోతే పార్టీ లేదు అనుకునే తత్వం వీడాలి. ఎవరు లేకపోయినా జనసేన పార్టీ ప్రయాణం ఆగిపోదు. కాలం చాలా గొప్పది. మాకంటే గొప్పవారు ఎవరూ లేరు అనుకున్న వారినే 11 సీట్లకు పరిమితం చేసింది. అదే తీరులో మనం ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించండి. నా వెనుక నిస్వార్ధంతో పని చేసే జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు. క్రమ శిక్షణారాహిత్యంతో నాకు లేనిపోని తలనొప్పులు తీసుకురావొద్దు. జనం కోసం పని చేసే వాడిని. ప్రజల కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తా. నా సొంత బిడ్డలైనా ప్రజల తర్వాతే. దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. వైసీపీ లాంటి రౌడీ పార్టీతోనే పోరాడి ఈ స్థాయికి వచ్చిన వాడిని నాకు ఎలాంటి భయాలు ఉండవని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. • అడగండి.. నన్ను అర్థం చేసుకోండి కూటమి ప్రభుత్వం అంటే కేవలం ఒక పార్టీ ప్రభుత్వం కాదు. ఎన్నికల్లో ఉమ్మడి విజయం. టీడీపీ, బీజేపీ నాయకులను ఏ మాత్రం తగ్గించి మాట్లాడవద్దు. అందరం కలిసి ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే వరకు కలిసి ప్రయాణించాలి. వ్యక్తిగతంగా ఎవర్నీ కించపర్చవద్దు. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పదవులకు అనుగుణంగా కూటమి పార్టీల మధ్య పంపకాలు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా నాయకులకు పదవులు కట్టబెడతాం. అవసరం అయితే కొందరికి ప్రభుత్వ పదవులు, మరికొందరికి పార్టీలో ఉన్నతస్థాయి పదవులు అందచేస్తాం. ఏ పదవి ఇచ్చినా నా గుండెల్లో మీ స్థానం పదిలంగా ఉంటుందని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద పదవులు కోరుతున్నారు. ఉన్న అవకాశాలను బట్టి పదవులు దక్కుతాయని అర్ధం చేసుకోండి. మీకు న్యాయబద్దంగా ఏ పదవులు కావాలో అడగండి. ఆ పదవుల గురించి, చేయాల్సిన పనుల గురించి అవగాహన పెంచుకోండి. దానిని నెరవేర్చేందుకు సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. శాంతిభద్రతల విషయంలో పార్టీ నుంచి ఎన్నికయిన ప్రతినిధులు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. శాంతిభద్రతలకు ఏ మాత్రం విఘాతం కలగకుండా చూసుకోండి. ఆడబిడ్డల మీద అఘాయిత్యాల విషయంలో అప్పటికప్పుడు ఆవేశాలకు లోనై సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేకంటే దీనిపై శాశ్వత పరిష్కారం ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. భీమవరానికి చెందిన యువతిని 9 రోజుల్లోగా నా ఆదేశాల మేరకు పోలీసులు పట్టుకున్నారు. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయ్యారంటే అప్పటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాల నిరోధానికి ఓ శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రసార మాధ్యమాల్లో కూడా దీనిపై లోతైన చర్చ జరగాలి. ఓ పరిష్కారం సమాజం నుంచే రావాలి. పార్టీ నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేలు వారానికి ఒక్కరు చొప్పున పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ప్రజలు అందించే వినతులను స్వీకరించి వారితే ప్రత్యేకంగా మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో కల్తీ చేసే వారిని, అక్రమ ఎగుమతులు చేసే వారిని బలంగా ఎదుర్కొంటాం. కూటమి ప్రభుత్వంలో సుస్థిరత, ప్రజల సంపన్నత, బలమైన భవిష్యత్తు ఇచ్చేలా పని చేస్తాం. • రెండు అనాధ శరణాలయాలకు కూరగాయలు, రూ. లక్ష చొప్పున విరాళం ఆత్మీయ సత్కారంలో ప్రజా ప్రతినిధులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూరగాయలతో చేసిన గుచ్చాలను అందచేశారు. అలాగే పార్టీ తరఫున ఎన్నికయిన ప్రజా ప్రతినిధులంతా కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడిగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందచేసిన కూరగాయల గుచ్చాలను రెండు అనాథ శరణాలయాలకు విరాళంగా అందించారు. ఈ కూరగాయల గుచ్చాల వల్ల బిడ్డలకు కడుపు నిండుతుందని, తనను ఎవరు కలవడానికి వచ్చినా ఇలాంటి పనికి వచ్చే బహుమతులే తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కూరగాయల గుచ్చాలను ఇచ్చి మిమ్మల్ని పంపలేనని అనాధ శరణాలయాల నిర్వాహకులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున విరాళం అందచేశారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఎస్.కె.సి.బి. ఆర్ఫనేజ్ హోమ్, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ లకు ఈ విరాళాలు అందించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎంపీలు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శ్రీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ, శ్రీమతి లోకం నాగమాధవి, శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేశ్ బాబు, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ వంశీకృష్ణ యాదవ్, శ్రీ పంతం నానాజీ, శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ దేవ వరప్రసాద్, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ పులపర్తి రామాంజనేయులు, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ చిర్రి బాలరాజు, శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ ఆరవ శ్రీధర్, ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ లు సత్కారం అందుకున్నారు. Also Read: AP Cabinet Meet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పలు పథకాలకు ఆమోదం! - Rtvlive.com #pawan-kalyan #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి