/rtv/media/media_files/2026/02/09/cm-chandrababu-2026-02-09-19-50-33.jpg)
CM Chandrababu
CM Chandrababu : రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతోపాటు... పశువుల దాణాకూ సమస్యలు రాకూడదని సీఎం చెప్పారు. మరోవైపు ప్రజాసమస్యలు-పాలనా తీరు తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా... క్షేత్ర స్థాయిలో పాలసీలు సమర్ధవంతంగా అమలు కానప్పుడు ఆశించిన ఫలితాలు రావని సీఎం అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘‘ప్రతీ ఐదేళ్లకూ జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలి. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుంది. కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలి. క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకోవాలి. పీ 4 అనేది రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమం.గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాలన్నీ రీషెడ్యూలు చేస్తున్నాం. గత పాలనలో పాలకులు 2019-24 మధ్య ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బతీశారు. జీతాలు కూడా మొదటి తేదీకి ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు జీతాల చెల్లింపులను గాడిలో పెట్టాం...సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. కొన్ని జిల్లాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. భవిష్యత్తులో ఆ జిల్లాలు మరింత వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కశ్మీర్లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుంది. కాఫీ సాగు పెంచటంతో పాటు అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాం.. ఇది మరింతగా పెరగాలి.” అని సీఎం చంద్రబాబు వివరించారు.
66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్
“సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని చంద్రబాబు సూచించారు. 5 లక్షల మంది హాస్టల్ విద్యార్ధుల హెల్త్ స్క్రీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకూ ఉన్న 70 లక్షల మంది విద్యార్ధుల హెల్త్ ప్రొఫైల్స్ కూడా తయారు చేయాలి. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, ఎదుగుదలను నమోదు చేయాలన్నారు. పౌష్టికాహారం అందించటంతో సహా అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలి. అవిశ, మునగ, రకరకాల ఆకు కూరల్లో పౌష్టికాహారం లభిస్తుంది. వాటిని ఆహారంగా తీసుకోవడం మానేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలు, అన్న క్యాంటీన్లలో కూడా పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇక గర్భిణీల నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలి... సిజేరియన్లు తగ్గాలి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా జూన్ నాటికి సమగ్రమైన కార్డు జారీ చేస్తాం. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఒత్తిడి లేని విద్యాభోదనే లక్ష్యం...
“పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేని విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే కొత్త ఆలోచనలు వస్తాయి... సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. వయోజన విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా డ్వాక్రా మహిళల సహకారం తీసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న కర్మయోగి పథకంలో ఏపీకి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. సామాజిక బాధ్యత కింద ప్రైవేటు సంస్థలు యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా స్కిల్లింగ్ తో పాటు ఉద్యోగాలు ఏ మేరకు వస్తున్నాయనే అంశాన్నీ పర్యవేక్షించాలి. రాష్ట్రంలో 38,608 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నీటి నిల్వలకు అనుగుణంగా ప్రణాళికలు చేయాలి. చెరువులు, కాల్వలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలి. దీంతో పాటు డీసిల్టింగ్, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్‌లను తవ్వాలి, నిల్వలు పెరిగేలా చూడాలి ప్రస్తుతం 7.34 భూగర్భజలాలు ఉన్నాయి. నీటి బ్యాంకు తరహాలో భూగర్భ జలాలు వినియోగం జరగాలి. వాటిని సద్వినియోగం చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు సాధించగలం.” అని సీఎం వివరించారు.
వారిదే బాధ్యత
“పారిశ్రామిక కాలుష్యం ద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలి. సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందాలని చంద్రబాబు కోరారు. ఆశ్రమ హాస్టల్‌లో కలుషితమైన నీరు కారణంగా విద్యార్ధులు అస్వస్థతకు గురైన పరిస్థితి ఎదురైంది. ఈ తరహా ఘటనలు ఇక రాష్ట్రంలో ఉత్పన్నం కాకూడదు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే... దానికి సంబంధిత జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ మంత్రులదే బాధ్యత. పంచాయితీరాజ్ రోడ్లు, నీటి సంరక్షణా చర్యలు, గోకులం షెడ్లు, మేజిక్ డ్రెయిన్లు చేపట్టాలి.”అని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Follow Us