/rtv/media/media_files/2026/02/05/fotojet-20-2026-02-05-17-56-35.jpg)
AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : ‘ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతార’ని వైసీపీ వారిని ఉద్ధేశించి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వారు భగవంతుడి మీదే పగ పట్టారన్నారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకుపోతారన్నారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసిందే కాదని రిపోర్టులో పేర్కొన్నట్టు చెప్పారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురు మమ్మల్ని క్షమాపణ చెప్పమని బుకాయిస్తున్నారన్నారు. ఇది హిందూ విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు ఏడుకొండల వాడికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, సహచర మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మతం, ధర్మం చాలా లోతైన అంశాలు. చాలా సున్నితమైనవి కూడా. అలాంటి వ్యవహారాల్లో ఒక్క మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి, మేము కూడా మాట్లాడే సమయంలో సంయమనంతో, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాలి అన్నది ఆలోచించే మాట్లాడుతామన్నారు.
దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు
2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయి. అన్నీ మతపరంగా సున్నితమైన అంశాలే. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఎవరో ఆకతాయి చేశాడు. పిచ్చోడు చేశాడని చెప్పారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అశుద్దం పూస్తే అదీ పిచ్చోడి పనే అన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు చోరికి గురైతే కొత్తది కొనుక్కోవచ్చంటూ తేలికగా మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగులబెడితే అదీ ఎవరో పిచ్చోడి పనే అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు 219కి పైగా జరిగాయి. ఒక్క అంశంలోనూ సరైన చర్యలు తీసుకున్నది లేదు. ఇలాంటి అంశాల్లో ఏ రోజూ రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించలేదని పవన్ ఆరోపించారు.
జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది
వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత రక్షించబడిన చంద్రబాబు నాయుడు ఇలాంటి అంశాల్లో చాలా అప్రమత్తంగా మాట్లాడుతారు. ఎన్నికల అనంతరం ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆయన కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్.డి.డి.బి) రిపోర్టును మా అందరికీ చదివి వినిపించారు. ఒక రిపోర్టులో విజిటెబుల్ ఆయిల్స్ ఉన్నాయని ఉంది. వాళ్లు ఏ స్థాయిలో కల్తీకి పాల్పడ్డారని చెబుతూ అసలు ఆ ద్రావకంలో నెయ్యే లేదని, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, పంది కొవ్వు లాంటివి ఉన్నాయని రిపోర్టులో ప్రస్తావించారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని బయటపెట్టే ముందు చాలా ఆలోచించాం. పర్యవసానాలు ఎలా ఉంటాయి అని ఆలోచించే ముందుకు వెళ్లాం. చెప్పకపోతే తెలిసీ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడాం అనుకోవడానికి అప్పుడే అధికారంలోకి వచ్చాం. ఐదేళ్లు మేమే పాలనలో ఉంటాం. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాజకీయం చేయాల్సిన అవసరం మాకు ఏం ఉంటుంది. విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లకపోతే మాదే తప్పు అవుతుందని మాత్రమే ఆలోచన చేశాం. హైందవ సంస్కృతిని అపవిత్రం చేసినప్పుడు మాట్లాడకపోవడం తప్పనిపించి గొంతు విప్పాం. వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. విచారణ జరపాలనుకున్నాం అని ఆయన వివరించారు.
నెయ్యే లేకుండా లడ్డూ ప్రసాదం చేసి బుకాయింపు
ఏ నివేదిక చూసినా- అస్సలు వారు నెయ్యి అని చెబుతున్నదానిలో నెయ్యే లేదని తేలింది. తప్పు చేసినవారు మాత్రం జంతువుల కొవ్వు లేదని చెప్పి బుకాయిస్తున్నారు. వైసీపీ హయాంలో వినియోగించిన 59.70 లక్షల కేజీల నెయ్యి వాడితే అందులో 58 లక్షల కేజీలు పామ్ ఆయిల్, మిగిలింది కెమికల్స్. విచారణలో వాటి కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు దొరికాయి. సీబీఐ నివేదికలో ఈ నెయ్యి - పాల కొవ్వులతో చేసింది కాదు అని చెప్పింది. అందులో ఏమున్నాయన్నది నిర్ధారించలేకపోతున్నాం అని మాత్రమే చెప్పింది. ఎన్.డి.డి.బి రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసిందని స్పష్టంగా ఉంది. నెయ్యి లేకుండా లడ్డూలు చేసి ఎదురు మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 మధ్య నువ్వుల నూనె ధరే రూ. 180 నుంచి రూ. 268 ఉంది. వీరు నెయ్యి కిలో రూ. 319, రూ. 320కి కొనుగోలు చేశామంటే సాధారణ గృహిణిని అడిగినా అందులో కల్తీ ఉందని చెప్పేస్తారు. ఈ పాపం చేసిన వారికి హిందూ ధర్మం మీద గౌరవం లేదు. అలా అని ఛార్జ్ షీట్ లో ఉన్న పేర్లు చూస్తే వేరే ఏ మతానికి సంబంధం లేదు.
కల్తీ జరిగిందని 2022లోనే తెలిసినా రిపోర్టు తొక్కిపెట్టారు
ఇక్కడ అంతా హిందువుల మనోభావాల గురించే మాట్లాడుతున్నాం. ఆయోధ్య రామమందిర నిర్మాణం ఎలాంటి పరిస్థితుల మధ్య జరిగిందో దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి రామమందిరం విగ్రహ ప్రతిష్టకు పంపిన లక్ష లడ్డూలు ఇదే కల్తీ నెయ్యితో చేసినవి. తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే ఎదురు క్షమాపణ కోరమని అడుగుతున్నారు. భగవంతుడి మీద పగ పట్టినవాడు బతికిన దాఖలాలు లేవు. వై.ఎస్.వివేకానందరెడ్డి గారిని చంపేశారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. వీళ్లేమో అది గుండెపోటని చెబుతారు. వెండి విగ్రహాలు పోతే పోనీ అంటారు. నెయ్యిలో కల్తీ జరిగింది అంటే కల్తీయే లేదని వాదిస్తారు. ఏడుకొండల వాడికి రెండు కొండలు చాలన్న ఆలోచనా విధానం నుంచి పుట్టిన వారు ఏ స్థాయికైనా దిగజారుతారు. హిందూ ధార్మిక విలువల పరిరక్షణ వ్వవహారంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయదు. నెయ్యి కల్తీ వ్యవహారంలో ఏ మతాన్ని కించపర్చడం లేదు. 2022లోనే నెయ్యిలో కల్తీ ఉందన్న వ్యవహారం బయటపడితే ఆ ల్యాబ్ నివేదికను తొక్కి పెట్టారు. అన్నీ తెలిసే అయోధ్యకి కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు పంపారు. ఇది విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు భగవంతునికి మొకరిల్లే వరకు ఈ యుద్ధం జరుగుతుంది” అన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ , ఆర్థిక శాఖ మంత్రిపయ్యావుల కేశవ్ , ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Follow Us