/rtv/media/media_files/2025/05/27/wCIRh1NR4pOWy51ZK0sJ.jpg)
AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన వివాదంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన ఆయన.. కుల రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలు, సొంత పార్టీలోని లోపాలు మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీపై అత్యంత ఘాటుగా స్పందించారు. శత్రువులు బయట ఎక్కడో లేరని, సొంత పార్టీలోనే ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన చర్చలపై వస్తున్న ఆరోపణలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. "నేను అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? ఇలాంటి ప్రచారాలపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? వైఎస్సార్‌సీపీ (YCP) నాయకుడు జైలుకెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? అలా అయితే జనసేన ఎదుగుతుందా? కేంద్ర హోంమంత్రితో ఇలాంటి లీగల్ విషయాలు మాట్లాడతామా? ఇది వ్యవస్థను అవమానించడమే. నేను అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే." అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేసిన పవన్.. శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటానని, బలహీనులను కాదని వ్యాఖ్యానించారు. "మాకు కూడా కోపాలు, బాధలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. భరిస్తాం, సహిస్తాం.. హద్దు దాటితే అవసరమైతే తాట తీస్తాం" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమిళనాడులో రాజకీయాలు చాలా సాఫీగా, సులభంగా సాగిపోయాయని, అక్కడి రాజకీయ వాతావరణాన్ని చూస్తే అసూయ కలిగేంత సులువుగా జరిగాయని వ్యాఖ్యానించారు.
తాను పదేపదే కులం గురించి మాట్లాడుతున్నానని విమర్శిస్తున్న వారికి పవన్ కౌంటర్ ఇచ్చారు. "నేను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? మిగతా పార్టీల నేతలు కులం గురించి మాట్లాడటం లేదా?" అని ప్రశ్నించారు. సమాజంలో కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం ఎవరికీ మంచిది కాదని ఆయన హితవు పలికారు. సొంత పార్టీ నాయకుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పదవులు వచ్చిన తర్వాత చాలా మంది జనసేన నాయకులు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదని స్పష్టం చేశారు.
తాను తెలుగుదేశం పార్టీ (TDP) కోసం కాదని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే సర్దుకుపోతున్నానని కీలక వ్యాఖ్య చేశారు. "మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. శత్రువులు బయట ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు" అని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండగలిగే వాళ్లు మాత్రమే పార్టీలో ఉండాలని, లేనివాళ్లు వెళ్ళిపోవచ్చని తేల్చిచెప్పారు. ఇకపై జనసేన పార్టీ లైన్ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, తమను వ్యక్తిగతంగా విమర్శిస్తే అదే స్థాయిలో గట్టిగా బదులిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో టాలీవుడ్, పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా, పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో, జనసేన అంతర్గత వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.
Follow Us