/rtv/media/media_files/2025/03/26/kzdKIadPAcMf40bj5mL5.jpg)
Pastor Praveen Pagadala
Pastor Praveen Pagadala : రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ ప్రచారకుడు కేఏపాల్ వెళ్లారు. పోస్టుమార్టం గదిలోకి తనను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవుడు క్షమించడని హెచ్చరించారు.
కాగా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారు. అయితే ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాలు, కేఏపాల్ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ప్రవీణ్ మృతిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ ప్రసంగికుడు అనుమానాస్పద మృతిపై ఏపీ , తెలంగాణలో అలజడి రగిలింది. ఆయన ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు ప్రాథమిక విచారణలో ప్రకటించగా.. కాదు ప్రత్యర్థులు హతమార్చారని క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ స్పందించారు. ఘటనసపై సమగ్ర విచారణ జరపాలని సీఎం డీపీజీని ఆదేశించారు. ఈ కేసును పూర్తి సమాచారంతో దర్యాప్తు జరపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ మరణ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగింది ?
తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గామన్ బ్రిడ్జి రహదారిపై కొంతమూరు నయారా పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీఎహెచ్ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్(46) అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై వెనుక లగేజీ బ్యాగ్ కట్టుకుని రాజ మహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని, భార్యకు చెప్పి వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమవారం అర్ధరాత్రి కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి మోటార్‌సైకిల్ అదుపుతప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతానికి పడిపోవడంతో ప్రవీణ్‌కుమార్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మర్నాడు ఉదయం వరకు ఎవరూ గమనించలేదు. మంగళవారం ఉదయం అందిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించామని, బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్ రహదారి పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్ ఆయనపై పడిపోవడంతో మృతిచెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేం ద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఎస్‌ఐ మనోహర్ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
రాజమండ్రిలో ఉద్రిక్తత
మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ల ఆందోళనలతో రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్దకు భారీగా దళిత సంఘాలు,పాస్టర్లు, క్రైస్తవులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలున్నాయని… రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని క్రైస్తవ సంఘాల నేతలు చెబుతున్నారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు, మూడు గంటలపాటు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ధర్నాను తాత్కాలికంగా విరమింప చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్, రాజేష్ మహాసేనతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ, జేమ్స్, విజయరాజు వంటివారితోపాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?