కూతుర్ని చంపి..పాతిపెట్టి..పైన కంప వేసి

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే ఆమెను చంపేశారు. ఇంటి స‌మీపంలోనే మృత‌దేహాన్ని పూడ్చిపెట్టారు. ఏమీ తెలియ‌న‌ట్లు త‌మ బిడ్డ క‌నిపించ‌డం లేదని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

New Update

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రం పల్లిపాళెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తిరుమూరు వెంక‌ట‌ర‌మ‌ణ‌య్య‌, దేవ‌సేన‌మ్మ దంప‌తుల‌కు కుమారుడు సాయి, ఇద్ద‌రు కుమార్తెలు భువ‌నేశ్వ‌రి, శ్రావ‌ణి ఉన్నారు. పెద్ద కుమార్తె భువ‌నేశ్వ‌రికి ప‌దేళ్ల కిందట వివాహ‌మైంది. రెండో కుమార్తె శ్రావ‌ణి (24)కి ఆరేళ్ల కింద‌ట వివాహం చేశారు. భార్యభ‌ర్త‌ల మ‌ధ్య‌ గొడవలు రావ‌డంతో.. విడాకులు తీసుకొని త‌ల్లిదండ్రుల వ‌ద్దనే ఉంటుంది. .

ఈ క్రమంలోనే శ్రావణికి నార్త్‌ ఆమూలూరుకి చెందిన బాషా అనే పెయింటర్‌ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు పది రోజుల కిందట దర్గాలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రావణి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా కొట్టి బలవంతంగా లాక్కుని వెళ్లారు. 

 త‌మ కులానికే చెందిన మ‌రో వ్య‌క్తితో వివాహం చేస్తామ‌ని, బాషా దగ్గరకు వెళ్లొద్ద‌ని శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. శ్రావ‌ణిని త‌ల్లిదండ్రులు, సోద‌రి, సోద‌రుడు కొట్టి చంపేశారు. 

ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు.. ఇంటి ప‌క్క‌నే ఉన్న ఖాళీ స్థ‌లంలో చెంచ‌య్య అనే వ్య‌క్తి సాయంతో గుంత తీసి మృత‌దేహాన్ని పూడ్చిపెట్టారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా పైన కంప వేశారు. మ‌ళ్లీ ఏమీ తెలియ‌న‌ట్లు త‌మ కుమార్తె క‌నిపించ‌కూడా పోయిందని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్నారు.

అయితే.. ఎన్ని రోజులైన శ్రావ‌ణి నుంచి ఫోన్ రాక‌పోవ‌డంతో  బాషా గ్రామంలో ఆరా తీశాడు. త‌ల్లిదండ్రుల‌తో శ్రావ‌ణి లేద‌ని గ్రామ‌స్తులు చెప్పగా.. వారే హ‌త‌మార్చి ఉంటార‌ని అనుమానించాడు. గ్రామస్తుల‌కు సందేహం వ‌చ్చి ఇంటి ప‌రిస‌ర ప్రాంతాలు ప‌రిశీలించ‌గా.. ఖాళీ స్థ‌లంలో పాతిపెట్టిన ఆన‌వాళ్లు గుర్తించారు.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తి డ‌య‌ల్ 100కు ఫోన్ చేశాడు. వెంకటరమణయ్య నివ‌సిస్తున్న ఇంటి స‌మీపంలోని ఖాళీ స్థ‌లంలో మ‌హిళ మృత‌దేహాన్ని పూడ్చి పెట్టారని పోలీసులకు చెప్పారు. ఎస్ఐ కోటి రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. గ్రామస్థుల‌ను ఆరా తీశారు. శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యం బయటపడింది.

పోలీసులు, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అనుమానాస్ప‌ద ప్ర‌దేశంలో తవ్వి చూడగా.. శ్రావ‌ణి మృతదేహం కనిపించింది. మృత‌దేహం నుంచి న‌మూనాలు తీసుకున్నారు. మిస్సింగ్ కేసును మ‌ర్డ‌ర్ కేసుగా మార్చి ద‌ర్యాప్తు ప్రారంభించినట్లు  సీఐ సురేంద్రబాబు చెప్పారు. శ్రావ‌ణి త‌ల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే శ్రావ‌ణిని హ‌త్య చేసి పాతిపెట్టామ‌ని అంగీక‌రించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు