/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t131033-2026-02-04-13-11-03.jpg)
Pawan fires at Nagababu
Pawan fires at Nagababu : లేడీస్ డ్రెస్సుల వివాదాలపై, సినిమా వాళ్ల కామెంట్లకు స్పందించే సమయం ఉంది కానీ రాష్ట్రం మొత్తం ప్రధానంగా చర్చించుకుంటున్న తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్పందించడానికి మీకు సమయం లేదా? అని జనసేన ఎమ్మెల్సీ నాగబాబుపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లండన్ టూర్లకు వెళ్ళడానికి టైమ్ దొరుకుతుంది కానీ, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి టైమ్ దొరకదా? అని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌పైనా అసహనం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అత్యవసర సమావేశం వాడివేడిగా సాగింది. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని రీతిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల పనితీరు, ప్రతిపక్ష వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో వారు చూపుతున్న నిర్లక్ష్యంపై పవన్ మండి పడ్డారు. ముఖ్యంగా మెగాబ్రదర్ నాగబాబును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవలే సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, మహిళల దుస్తుల వివాదాలపై నాగబాబు వీడియోలు విడుదల చేశారు. దీనిని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ.. అలాంటి వివాదాలపై స్పందించడానికి, వీడియోలు చేయడానికి మీకు ఉత్సాహం ఉంటుంది, కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై గట్టిగా మాట్లాడటానికి ఎందుకు వెనుకాడుతున్నారని పవన్ నిలదీసినట్లు తెలిసింది.
కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుపైనా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షం ప్రభుత్వంపై బురద జల్లుతున్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి అందుబాటులో ఉండకపోవడంపై ఆయన క్లాస్ తీసుకున్నారు. వ్యక్తిగత పనుల కోసం, లండన్ వంటి విదేశీ పర్యటనలకు వెళ్ళడానికి సమయం దొరుకుతుంది, కానీ పవిత్రమైన టీటీడీ లడ్డూ కల్తీ అంశంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి మాత్రం టైమ్ ఉండదా? అని పవన్ నిలదీశారు.
జనసేన నాయకులు, ఎమ్మెల్యేలపైనా ఈ సమావేశంలో పవన్ కళ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు ఇచ్చింది దర్జాగా అనుభవించడానికి కాదు పని చేయడానికి అని గుర్తు చేశారు. తమ నమ్మకాన్ని వమ్ము చేస్తే, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిని సహించేది లేదని తేల్చిచెప్పారు. టీటీడీ కల్తీలడ్డూ వ్యవహారంపై వైసీపీ సోషల్ మీడియాలో, బయటా విస్తృత ప్రచారం చేస్తోందని, దానిని కౌంటర్ చేయడంలో జనసేన సోషల్ మీడియా వింగ్ మరియు ముఖ్య నేతలు విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.
Follow Us