తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని... తాను కూడా ప్రతి సంక్రాంతికి తన ఊరికి వెళ్తనన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పండక్కి తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లే సంప్రదాయానికి తన భార్య భువనేశ్వరే కారణమని సీఎం చెప్పుకొచ్చారు. పాతికేళ్ల క్రితం ఆమె మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నానని వెల్లడించారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమని తెలిపారు సీఎం చంద్రబాబు. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు.. ఆ ఊరిలో ఉండే పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలిన వారిపై ఉందని తెలిపారు. ఈ విధానం ప్రోత్సహించటానికే పీ4 కాన్సెప్ట్ పేపర్ ను రేపు విడుదల చేస్తామన్నారు సీఎం. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు. పీ4 విధానంపై బాగా పనిచేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు సీఎం. సంక్రాంతికి నారావారిపల్లెకు ప్రతి ఏడాది సంక్రాంతికి నారావారిపల్లెకు వెళ్తుంటారు సీఎం చంద్రబాబు. అక్కడే తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పండగను జరుపుకుంటారు. తన పాత మిత్రులను కలుసుకుని వారితో సరదాగా గడుపుతారు చంద్రబాబు. సీఎం కుటుంబంతో పాటుగా నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా నారావారిపల్లెలోనే సంక్రాంతి సంబరాలను జరుపుకుంటుంది. కరోనా టైమ్ లో మాత్రం మూడేళ్లు చంద్రబాబు తన సొంత గ్రామానికి వెళ్లలేదు. ఈ ఏడాది కూడా నారావారిపల్లెలోనే సీఎం ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోనుంది. తిరిగి సీఎం అయ్యాక చంద్రబాబు సొంతూరికి వస్తుండటంతో ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు కార్యకర్తలు ప్లాన్ చేస్తున్నారు. Also Read : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్!