/rtv/media/media_files/2026/04/27/anantpur-2026-04-27-09-13-00.jpg)
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు నిజమని తేలడంతో డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, ఎస్పీ జగదీశ్ గట్టి చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నేరగాళ్లకు సహకరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ఏకంగా 9 మంది పోలీసులపై వేటు వేశారు.
హనీట్రాప్ ముఠాతో నేరుగా సంబంధాలు ఉండి, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని సర్వీస్ నుంచి పూర్తిగా తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో... రాప్తాడు సీఐ శ్రీహర్ష , హెడ్ కానిస్టేబుల్ గిరి , కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్ ఉన్నారు.
మరికొంత మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్ లను సస్పెండ్ చేశారు. అలాగే సీఐ శేఖర్‌ను కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటివరకు 9 మంది పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు ఈ కేసులో నిందితులపై కూడా పోలీసులు పట్టు బిగిస్తున్నారు. మొత్తం తొమ్మిది మంది సభ్యులున్న ఈ హనీట్రాప్ ముఠాలో ఇప్పటికే ఐదుగురిపై చర్యలు తీసుకోగా, తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సామాన్యులను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడే ఇలాంటి ముఠాలకు సహకరించే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీస్ బాస్ లు హెచ్చరిస్తున్నారు.
ఏడాది కిందటే వలపు వల
నగరానికి చెందిన ఒక 62 ఏళ్ల వ్యక్తి గతేడాది నవంబరు 2న ఈ ముఠా విసిరిన వలపు వలలో చిక్కుకున్నాడు. పక్కా ప్లాన్‌తో ఆ వృద్ధుడిని ట్రాప్ చేసిన నిందితులు, ఆ తర్వాత తమ అసలు రూపం బయటపెట్టారు. జరిగిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని ఆ ముఠా బాధితుడిని డిమాండ్ చేసింది. పరువు కోసం భయపడిన సదరు వ్యక్తి, వారితో బేరసారాలు సాగించి చివరకు రూ. 2 లక్షలు ముట్టజెప్పి ఆ గండం నుంచి బయటపడ్డాడు.
Follow Us