బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం.. అనుమానాస్పద స్థితిలో మృతదేహం

పుంగనూరుకు చెందిన చిన్నారి అస్వియా (6) మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. 4 రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్‌ దగ్గర చిన్నారి మృతదేహం లభ్యం అయింది. పోస్ట్‌మార్టం నివేదిక వెలువడిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

New Update

పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యం సంచలనంగా మారింది. స్నేహితులతో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆ బాలికను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. దీంతో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆ బాలిక కనిపించలేదు. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలిక కోసం రెండు డాగ్ స్క్వాడ్ బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. ఎందుకు ఎత్తికెళ్లారో?.. ఎవరు ఎత్తికెళ్లారో? తెలియలేదు.. కానీ ఆ చిన్నారి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దీంతో చిన్నారి హత్యతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉబేదుల్లాకాంపౌండ్‌కు చెందిన అజ్మతుల్లా కూతురు అస్వియా (6) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు తమ ఇంటి బయటకు వెళ్లింది. అలా ఆడుకుంటుండగా ఒక్కసారిగా కరెంట్ పోయింది. దీంతో కాసేపటికి అస్వియా తల్లి బయటకొచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కలా చూసింది ఎక్కడా లేదు. ఆపై అరుస్తూ వీధుల్లో పరుగులెట్టింది. కానీ అస్వియా ఎక్కడా కనిపించలేదు. కంగారు పడిన చిన్నారి తల్లి వెంటనే తన భర్త అజ్మతుల్లాకు ఫోన్ చేసి చెప్పింది. ఇక అతడు కూడా ఇంటికొచ్చి చూడగా చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. 

దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చేసేదేమిలేక రాత్రి 10.30 గంటలకు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ మరుసటి రోజు ఎస్పీ మణికంఠ ఆదేశాలతో 11 పోలీసు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే రెండు డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా చిన్నారి అస్వియా కోసం రంగంలోకి దిగాయి. కొంచెం కూడా ఆచూకీ లభించలేదు. కాగా చిన్నారి తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడంతో కొందరినీ విచారించారు. కానీ ఫలితం లేకపోయింది.

విషాదంగా మారిన చిన్నారి మిస్సింగ్ మిస్టరీ

ఇక బుధవారం చిన్నారి అస్వియా మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. దాదాపు 4 రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్‌ దగ్గర చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహాం కనపడకుండా పోయిన చిన్నారి అస్వియాదేనని భావించి బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆ మృతదేహాం తమ పాపదేనని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. ఇన్నాళ్లు తమ పాప తిరిగి వస్తుందని భావించామని.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తమ పాపను చూడాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు. 

అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో అస్వియాను ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపణ చేస్తున్నారు. చిన్నారి హత్యతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. నలుగురు వైద్యుల బృందంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. వెంటనే ఎస్పీ మణికంట చందోలు హాస్పిటల్‌ వద్దకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించినట్లు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వెలువడిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు