Ande Sri: ఆశుకవిత్వానికి అందె వేసిన చేయి.. తెలంగానానికి ఆయనే సిరి!

అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా అందెశ్రీ గురించిన కొన్ని విశేషాల సమాహారం ఈ కథనం. అందేశ్రీ గురించి.. తెలంగాణ గీతం పుట్టుక గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Ande Sri: ఆశుకవిత్వానికి అందె వేసిన చేయి.. తెలంగానానికి ఆయనే సిరి!

Ande Sri:

  • మాయమైపోతున్న మనిషితనాన్ని.. తన కవితా ప్రకృతి ఒడిలో కూచోబెట్టి.. తన పదాలతో ప్రజా చైతన్యాన్ని ధూం.. ధాం అంటూ తట్టిలేపి తెలంగాణ పాటకు విశ్వవ్యాప్త కీర్తిని.. తెలుగు పదానికి మరో రూపునూ ఇచ్చిన వాగ్గేయకారుడు.. 
  • బలపం పట్టకుండా.. అక్షరాలు దిద్దకుండా.. గుక్కతిప్పుకోకుండా గుండెల్ని నింపేలా పదాల పదనిసలను అందంగా.. ఆశువుగా ఆలపించిన అందెల రవళి.. 

ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉండాలి.. ఎవరి గురించి చెబుతున్నామో.. అవును.. అందె శ్రీ (Ande Sri) గురించే. అమ్మ బువ్వ తినిపించి బడికి పంపించినా.. నాన్న డబ్బులు పెట్టి ఇస్కూలుకి అంపినా.. పెద్దగయినాకా కాలేజీల్లో కతలు పడినా.. సివరికి లచ్చల కొలువు  కోసమే పరుగులు తీసే కాలం.. అక్షరం నేర్సుకునేది ఎందుకంటే.. సంపాయించనీకే అని గర్వంగా సెప్పే కుర్రతనం. కానీ, అక్షరం రాయకుండా.. పదాన్ని కాగితం మీద పేర్చకుండా.. మనిషి బతుకు చుట్టూ ఉన్న చీకటిని తన గొంతునుంచి ఆశువుగా వల్లె వేసి మనసు పొరలమీద తెలంగాణ పాటను బలంగా ముద్రవేసి.. గొర్రెలను చేరాల్సిన దారిని చూపించిన కాపరి.. తెలంగాణ పాటకు విశ్వజనామోదా  బాటను పేర్చిన పాటసారి అందెశ్రీ. 

అందెశ్రీ గురించి..
అసలు పేరు అందె ఎల్లయ్య (Ande Yellaiah).  పుట్టిన తేదీ.. జూలై 18, 196. ఊరు అప్పటి వరంగల్.. ఇప్పటి జనగామ జిల్లా, రేవర్తి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన అసలు బడికి వెళ్ళలేదు. అక్షరాలు నేర్చుకోలేదు. పశువుల కాపరిగా జీవనం సాగించారు. తరువాత కొన్ని రోజులు తాపీపని చేశారు. నిజామాబాద్‌లో తాపీ పని నేర్చుకోవడానికి వెళ్ళినపుడు శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్‌ మహారాజ్‌ఆయనను చేరదీసి అయన పేరును అందె శ్రీగా మార్చారు. అక్కడ నుంచి ఈయన ఆశువుగా పాటలు పడుతూ వచ్చారు. ఈయనకు చదువులేకపోయినా కవిత్వం అలానే వచ్చేసింది. ఆశువుగా పాటలు పాడేస్తారు.  తరువాత రాయడం నేర్చుకున్నారు. కొద్దిగా చదువుకున్నారు.   

చనిపోదాం అనుకుంటే.. సినిమాల్లోకి..
1994లో ఆయన బతకలేక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. ఆ సమయంలో యలమంచి శేఖర్‌ సినిమాల్లో పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని అందెశ్రీ (Ande Sri)ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అలా ఆయన విప్లవ సినిమాలు తీసే నారాయణమూర్తి సినిమాలు చాలా వాటిలో పాటలు రాశారు. బతుకమ్మ అనే సినిమాకి మాటలు కూడా అందించారు. ప్రపంచంలోని మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాయాలని ప్రపంచమంతా తిరిగారు. ఇక ఇప్పుడు ఆయన రాసిన జయజయహే తెలంగాణ పాటను (Jaya Jaya Telangana Song) రాష్ట్ర పాటగా ప్రభుత్వం నిర్ణయించింది. 

Also Read: పడిపోతున్న మార్కెట్ విలువ.. నిండా మునిగిన Paytm షేర్ హోల్డర్స్

తెలంగాణ గీతం పుట్టిందిలా..
అప్పట్లో తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణ ధూం.. ధాం పేరుతో ఆయన తన పాటలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఆ సమయంలో 2003 మార్చి 2న కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూంధాంలో (Telangana Dhoom Dham) మనకంటూ ఒక పాట ఎందుకు ఉండకూడదు అనిపించిందట ఆయనకు. ఆలోచన వచ్చిన వెంటనే పాట పురుడు పోసుకుంది. నాలుగు చరణాలు రాశేశారు. దానిని ఆదిలాబాద్ లో 2003 నవంబరు 11న నిర్వహించిన ధూం.. ధాంలో మొదటిసారిగా పాడారు. ఆ పాట విన్నవారంతా మంత్ర ముగ్ధులైపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పాట తెలంగాణలో ఏ మీటింగ్ జరిగినా.. స్కూల్స్, కాలేజీలు ఎక్కడైనా సరే వినిపిస్తూనే ఉంది. ఈ పాటలో మొత్తం 12 చరణాలు ఉన్నాయి. నిజానికి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అంటే 9 డిసెంబర్ 2009 తరువాత బాగా అందరికీ తెలిసింది. కానీ అంతకు ముందు నుంచే ఈ పాట ఉద్యమకారుల నోటిమాటలా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ పాటను(Ande Sri Songs) రాష్ట్ర పాటగా గుర్తిస్తారని చెప్పారు. కానీ, ఎందుకో ఏమో కానీ, ఇన్నేళ్లయినా డి జరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈపాటను రాష్ట్రగీతంగా ప్రకటించింది. 

అందె శ్రీ పాట(Ande Sri Songs) సాధించిన విజయాలు ఇవీ.. 

  • 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారం 
  • తెలంగాణ ప్రభుత్వము ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ కోసం ప్రతిపాదించింది
  • ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
  • కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
  • అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదునిచ్చి ఫిబ్రవరి 1, 2014లో సన్మానించారు.
  • వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (ఆగష్టు 14, 2015)
  • డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (జూలై 5, 2015)

మాయమైపోతున్న మనిషికోసమే నా కవితాగమనం (Ande Sri Songs)అని చెప్పే పద్మశ్రీ ఎన్నోసార్లు చావు కోసం ఆలోచించానని చెబుతారు. జీవితమే అన్నీ నేర్పుతుంది అంటూనే.. నాది కవిగానం కాదు, కాలజ్ఞానం అంటాడాయన. తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆయన రాసిన పాట గుర్తింపు పొందిన సందర్భంగా ఇదీ అందెశ్రీ గురించిన జీవిత విశేషాల కథనం.

ఇక అందెశ్రీ రాసిన పాటను యధాతథంగా తీసుకుంటున్నారా లేకపోతే ఏమైనా మార్పులు చేస్తారా అనే సందేహాలు చాలామందికి వున్నాయి. ఎందుకంటే, పాట రాసిన కాలానికి తెలంగాణలో 10 జిల్లాలు. ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. దీంతో చాలామందికి ఈ సందేహం వస్తోంది. అయితే, అందరూ ముక్తకంఠంతో యధాతథంగా దీనిని స్వీకరించాలని కోరుతున్నారు.  

Watch this interesting Video:

Advertisment