Explainer: కేజ్రీవాల్ అరెస్టుకు కారణాలేంటి? అసలెంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం?

మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై పడింది.ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌? ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Explainer: కేజ్రీవాల్ అరెస్టుకు కారణాలేంటి? అసలెంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం?

Explainer: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ..నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో దాదాపు 2గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ లాక్కున్నారు. ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వెలుపల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు. అంతే కాదు కేజ్రీవాల్ ఇంటి బయట కూడా 144 సెక్షన్ విధించారు. అటువంటి పరిస్థితిలో, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలు ఏంటో తెలుసుకుందాం.

ఢిల్లీ లిక్కర్ స్కాం మరోసారి టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తే ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని కవిత నివాసంపై ఈడీ (ED), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈ రైడ్స్‌ చేశారు. గతేడాది నాటి ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంతి, ఆప్‌ నేత మనీశ్‌సిసోడియా ఇదే కేసులో అరెస్ట్‌ అవ్వగా.. ఇప్పటివరకు ఆయన బయటకు రాలేదు.మొన్న కవితను కూడా అదుపులోకి తీసుకుంది ఈడీ. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌? ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఏ మేరకు ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఢిల్లీ మద్యం పాలసీ ఏమిటి?
నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని (Liquor Policy Scheme) అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది నూటికి నూరు శాతం ప్రైవేటుగా మారింది. దీనివల్ల రూ.3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది.

ఫీజులు పెంపు:
ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్-1 లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గతంలో రూ.25 లక్షలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్‌ సర్కార్‌. బడా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఫీజును పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఢిల్లీలో చిన్న కాంట్రాక్టర్ల దుకాణాలు మూతపడ్డాయి. బడా మద్యం కంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. అంతేకాదు మద్యం మాఫియా ఈ పాలసీలో వేలు పెట్టిందని.. ఆప్ నాయకులు, అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.అయితే లైసెన్స్ ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని కేజ్రీవాల్‌ ప్రభుత్వం వాదించింది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గించినట్టు చెప్పుకొచ్చింది.

కొత్త మద్యం పాలసీలో అదే 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ ధరను రూ.530 నుంచి రూ.560కి పెంచారు. దీంతోపాటు రిటైల్ ట్రేడర్ లాభం కూడా రూ.33.35 నుంచి రూ.363.27కు పెరిగింది. అంటే రిటైల్ వ్యాపారుల లాభం 10 రెట్లు పెరిగింది.

దర్యాప్తు ఎలా ప్రారంభమైంది?
ఈ మద్యం పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు (CBI Enquiry) సిఫారసు చేశారు. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

అరెస్టుల పర్వం:
ఈ కేసులో ఎక్కువగా అరెస్టైన వారంతా ఆమ్‌ ఆద్మి పార్టీ (Aam Aadmi Party) ప్రముఖులే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్, సమీర్ మహేంద్రూ, అరుణ్ రామచంద్రన్, రాజేష్ జోషి, గోరంట్ల బుచ్చిబాబు, అమిత్ అరోరా, బెనాయ్ బాబు (ఫ్రెంచ్ లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్ జనరల్ మేనేజర్), అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పి శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్త అమన్ దీప్ ధాల్, వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్ పల్లి ఉన్నారు. ఈ కేసులో దాదాపు 80 మందికిపైగా విచారణ చేయగా.. వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఉన్నారు. తాజాగా కవితను కూడా అరెస్టు చేసింది ఈడీ.

338 కోట్ల మనీ ట్రయల్:
వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.338 కోట్లు చేరినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. మనీష్ సిసోడియా బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, ఈడీ కోర్టు ముందు 338 కోట్ల రూపాయల మనీ ట్రయల్‌ను ఉంచిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్సైజ్ పాలసీ సమయంలో లిక్కర్ మాఫియా నుంచి రూ.338 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరాయని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందని తేలడంతోనే ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీడియో కాల్ ద్వారా కేజ్రీవాల్‌తో సమావేశం:
అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్ ఫేస్ టైమ్ యాప్ (వీడియో కాల్) ద్వారా అరవింద్‌ను కలిసేలా చేశాడని ఎక్సైజ్ స్కామ్‌లో నిందితుడైన ఇండోస్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు విచారణ సందర్భంగా ఈడీకి తెలిపినట్లు రెండో ఆరోపణ ఉంది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ విజయ్ నాయర్ తన వ్యక్తి అని, అతను నాయర్‌ను నమ్మాలని చెప్పడం గురించి పక్కా ఆధారాలను ఈడీ సేకరించింది.

మార్జిన్ లాభాన్ని పెంచిన కేజ్రీవాల్ :

అంతేకాదు ఎక్సైజ్ పాలసీలో 6శాతం మార్జిన్ లాభం ఉందని, అరవింద్ కేజ్రీవాల్ ఆమోదంతోనే 12శాతానికి పెంచామని మనీష్ సిసోడియా అప్పటి కార్యదర్శి సి అరవింద్ ఇంటరాగేషన్‌లో చెప్పినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అంటే ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కీలకమైందని ఈడీ పేర్కొంది.అటు ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో కూడా సమావేశం జరిగింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జరిగిన మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఇలాంటి పక్కా ఆధారాలతోనే కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు