ఆరోగ్యానికి తేనె ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా..

ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల్లో తేనెను ఒకటిగా చెబుతుంటారు. దీన్ని తరచూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి రోజూ తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
ఆరోగ్యానికి తేనె ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా..

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే పదార్థాల్లో తేనె కూడా ఒకటని చెప్పవచ్చు. తేనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక రకాల వ్యాధులకు చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. మన దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలుగా చెప్పుకునే సిద్ధ, ఆయుర్వేదంలో కూడా తేనెను ప్రధాన మూలికగా వినియోగిస్తున్నారు. అలాంటి తేనె వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

 తేనెలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో నియాసిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్‌, పొటాషియం, జింక్​ తదితర మినరల్స్ ఉంటాయి. అంతేగాక తేనెలో కార్బోహైడ్రేట్స్​ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు. తేనెలో బ్యాక్టీరియాను ఎదుర్కొనే గుణం ఎక్కువ. దగ్గు, గొంతు మంట నుంచి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీంట్లో ఉండే ప్రోబయాటిక్ ప్రాపర్టీస్ జీర్ణ వ్యవస్థకు సహాయకారిగా పనిచేస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆరోగ్య సంరక్షణిగా తేనె ఉపయోగపడుతుంది.

చర్మ సంబంధిత వ్యాధులను కూడా తేనె నివారిస్తుంది. దీంతో పాటు తలపై ఉండే చుండ్రు, దురద నుంచి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తేనె వినియోగం వల్ల పిల్లలు బాగా నిద్రపోతారని అనేక అధ్యయనాల ఫలితాలు సూచిస్తున్నాయి. పొడి దగ్గును కూడా ఇది తగ్గిస్తుంది.భారత్​లోనే కాదు ఈజిప్ట్ లాంటి ప్రాచీన నాగరికత కలిగిన పలు దేశాల్లోనూ వేల ఏళ్ల నుంచి తేనెను వాడుతూ వస్తున్నారు. ఈజిప్ట్​లో తేనెను చర్మ సంరక్షణ, కళ్లకు సంబంధించిన వ్యాధుల నివారణతో పాటు గాయాలు, కాలిన గాయాలను సహజంగా నయం చేసే మూలికగా దీన్ని వినియోగించేవారు. ఇప్పుడు అనేక వైద్య శాస్త్ర పరిశోధనల ద్వారా తేనెలో దాగిఉన్న ప్రయోజనాల గురించి నేటి తరం వారికీ తెలిసొచ్చింది.

తేనెను రోజూ తీసుకంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. తేనె వినియోగం వల్ల కీమోథెరపీ రోగుల్లో తక్కువగా ఉన్న తెల్ల రక్తకణాల సంఖ్యను నియంత్రిస్తాయని పలు పరిశోధనల్లో రుజువైంది. ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లాంటి వాటిని నియంత్రించడంలో తేనె చక్కగా పనిచేస్తుంది.తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు డాక్టర్లు. 12 నెలల లోపు పిల్లలకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని అంటున్నారు. షుగర్​ రోగులు కూడా దీనికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. మామూలు చక్కెర వలె తేనె కూడా డయాబెటిక్​ పేషెంట్స్​కు ప్రమాదకరం. ఇది రక్తంలో షుగర్ స్థాయులను పెంచుతాయి. అయితే కొన్నిసార్లు తేనెను తీసుకోవాలనుకునే వారు మాత్రం గోరు వెచ్చటి నీటితో కలిపి తాగొచ్చు. అలాగే వేసవిలో నిమ్మ రసంలో కలుపుకొని తీసుకోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు