UP: యూపీలో దుమారం రేపుతున్న కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి కాల్చివేత ఘటన

New Update
UP: యూపీలో దుమారం రేపుతున్న కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి కాల్చివేత ఘటన

Man shot dead at Union Minister House - రూ.12వేల విషయంలో గొడవ..

యూపీలో కేంద్రమంత్రి ఇంట్లో ఓ యువకుడి కాల్చివేత ఘటన దుమారం రేపుతోంది. యూపీ క్రిమినల్స్‌కు అడ్డాగా మార్చారంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు తన కుమారుడి హత్య కేసును.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు మృతుని కుటుంబసభ్యులు. లక్నో బెగారియా రోడ్డులో ఉన్న కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు ఉన్నారు. మంత్రి కుమారుడు వికాస్‌ కిషోర్‌ ఫ్రెండ్స్‌ పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు మద్యం తాగుతూ పేకాట ఆడారు. అయితే పేకాటలో రూ.12వేల విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ.. కాల్పులకు దారి తీసింది. మంత్రి కుమారుడి లైసెన్స్‌డ్‌ గన్‌తో.. వినయ్‌ అనే యువకుడిపై కాల్పులు జరిపాడు అంకిత్‌. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు వినయ్‌.

పోలీసుల విచారణలో తేలిన నిజం.. 

తెల్లవారుజామున 2 నుంచి 2.50 గంటల వ్యవధిలో ఈ మొత్తం ఘటన జరిగినట్టు విచారణలో తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. లైసెన్స్‌డ్‌ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అజయ్‌ రావత్‌, అంకిత్‌ వర్మ, షమీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేకాటలో డబ్బులు పోగొట్టుకోవడమే కాల్పులకు కారణమని తేల్చారు. అయితే ముందు తనకు తాను కాల్చుకున్నాడని చెప్పిన నిందితులు..ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

కాల్పుల ఘటనపై మంత్రి స్పందన..

అయితే తన నివాసంలో జరిగిన కాల్పుల ఘటనపై మంత్రి కౌషల్ కిషోర్ స్పందించారు. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని..ఈ ఘటన ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలియదని వెల్లడించారు. విచారణ జరిపి బాధ్యులను శిక్షించేలా చేస్తామని తెలిపారు. వినయ్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవాడని అతను ఇలా చనిపోవటం బాధాకరమని అన్నారు. వినయ్ నా కుమారుడికి మంచి స్నేహితుడు..అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సమాజ్ వాదీ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యోగి ప్రభుత్వం నేరస్తులకు లైసెన్స్‌ ఇచ్చిందని ఆరోపించారు. ఆయన కుమారుడి రివాల్వర్‌తో హత్య అంటే శాంతిభద్రతలు ఎక్కడ.. మంత్రుల ఇళ్లన్నీ క్రైమ్‌ స్పాట్స్‌గా మారిపోయాయంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు పోలీసులు కట్టుకథ చెబుతున్నారని..వారిపై నమ్మకం లేదని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబసభ్యులు. వినయ్‌ హత్యకు మంత్రి కుమారుడు వికాస్‌ కిషోర్‌ కుట్ర పన్నాడని అంటున్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: ఆదిత్య ఎల్-1 సక్సెస్.. ఇస్రో నెక్ట్స్ టార్గెట్ అదేనా? ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ మీకోసం..

Advertisment
Advertisment
తాజా కథనాలు