Sammakka-Sarakka: గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలకు భక్తజన నీరాజనం సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల ధైర్య సాహసాలకు ప్రతీక.. తమ జాతి గౌరవం కోసం వీరవనితల త్యాగ చరిత.. ఎప్పటికీ తమవారిని కాచుకుని ఉండే వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతర. గిరిజనుల గుండెల్లో కొలువైన సమ్మక్క-సారక్క జాతర వెనుక ఉన్న చరిత్ర ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Sammakka-Sarakka: దేశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర.. దానినుంచి పుట్టిన కథలు.. ఆ కథల నుంచి కొలువైన దేవతలు ఉన్నారు. విభిన్న జాతుల.. భిన్న నమ్మకాల.. మిళితమైన భారత దేశంలో పండుగలు.. జాతరలు.. మేళాలు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అవన్నీ ఆ ప్రాంత సమూహాల్ని లేదా ఆ ప్రాంతానికి అటూ, ఇటూ ఉన్న ప్రాంతాల ప్రజలు.. భక్తులను ఆకర్షిస్తాయి. కానీ, రెండు జాతరలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ తమవైపు తీసుకుపోతాయి. ఒకటి ఉత్తర భారతదేశ ప్రాంతంలో నిర్వహించే కుంభమేళా అయితే, రెండోది మన తెలంగాణలోని ములుగు ప్రాంతంలో రెండేళ్ల కోసారి నిర్వహించే సమ్మక్క-సారక్క జాతర. దేశంలోనే ఆ మాటకొస్తే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనదేవతల పండుగ ఇది. సమ్మక్క-సారలమ్మ(Sammakka-Sarakka) జాతర కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుంది. ఎక్కడ జరుగుతుంది? తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా.. ఇప్పటి ములుగు జిల్లా లో తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో దట్టమైన అడవులు, కొండ చరియల మధ్య ఈ జాతర జరుగుతుంది. వరంగల్ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే పండుగ మేడారం సమ్మక్క సారక్క (Sammakka-Sarakka)జాతర. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అలాగే అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ జాతరకు వస్తారు. ఎవరీ సమ్మక్క-సారక్క? ఇది 13వ శతాబ్దంలో జరిగిన చరిత్ర. ఇప్పటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సమీపంలోని పొలవాస ప్రాంతానికి రాజుగా మేడరాజు ఉండేవాడు. కరువు, కాటకాలతో అల్లాడుతున్న ఆ ప్రాంతానికి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తుంటారు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు మేడరాజు ఆధ్వర్యంలో అందరూ వేటకు వెళతారు. అప్పుడు సింహాలు, పులులు తిరుగాడే ఆ అడవిలో ఒక గుట్టమీద చిన్న పాప పడుకుని కనిపిస్తుంది. ఆ చిన్నారిని దేవుడు పంపిన దేవత అని భావించిన మేడరాజు సమ్మక్క అని పేరు ప్తెట్టి పెంచుతాడు. ఆమెకు యుక్తవయసు రాగానే తన మేనల్లుడు మేడారం రాజు అయినా పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వీరికి సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుడతారు. ఇదిలా ఉంటే, కాకతీయ సామ్రాజ్య పాలకుడు ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పాలవాస పై దండెత్తుతాడు ప్రతాపరుద్రుడు. దీంతో మేడరాజు తన అల్లుడు మేడారం రాజు అయిన పగిడిద్దరాజు దగ్గరకు చేరతాడు. అయితే, అప్పటికే పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడి కోపం ఉంటుంది. ఎందుకంటే, పగిడిద్దరాజు అతని సామంత రాజు. కానీ, మేడారం ప్రాంతంలో కరువు కాటకాల వలన శిస్తు కట్టడం మానేస్తాడు. పైగా అక్కడి గిరిజన రాజులు ఎవరూ కూడా శిష్టులు కట్టరు. ఈ విషయంలో కోపంగా ఉన్న ప్రతాపరుద్రుడికి పగిడిద్దరాజు మేడరాజుకి ఆశ్రయం ఇవ్వడంతో మరింత విద్వేషం పెరిగిపోతుంది. వెంటనే మేడారంపై దండయాత్ర చేయమని తన మంత్రి యుగంధర్ ని ఆదేశిస్తాడు. దీంతో యుగంధర్ సేనలను తీసుకుని మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారంపై యుద్ధానికి బయలుదేరుతాడు. దీంతో మేడరాజు, పగిద్దరాజు, సమ్మక్క, వారి పిల్లలు సారక్క, నాగులమ్మ, జంపన్న(Sammakka-Sarakka) సంప్రదాయ ఆయుధాలతో కాకతీయులకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని మొదలు పెడతారు. కానీ అత్యధిక సైన్యబలం ఉన్న కాకతీయుల దాడిలో మేడరాజు, పగిడిద్దరాజు మరణిస్తారు. అయినాసరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా సమ్మక్క, సారక్క, జంపన్న వీరోచితంగా పోరాడుతారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన జంపన్న సంపెంగ నదిలో పడి వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఈ వాగులో స్నానం చేస్తే ఎటువంటి రోగాలు దరిచేరవని భక్తులు నమ్ముతారు. అందుకే జాతర సమయంలో ఈ వాగులో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది. ఇక యుద్ధంలో (Sammakka-Sarakka)వీరి ధైర్యసాహసాలకు ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. ఈలోపు కాకతీయ సైనికులు వీరోచితంగా పోరాడుతున్న సమ్మక్క, సారలమ్మల పై వెనుక నుంచి దాడి చేస్తారు. దీంతో సారలక్క అక్కడే యుద్ధభూమిలో మరణిస్తుంది. సమ్మక్క తీవ్రంగా గాయపడి తానూ రెండేళ్లకు ఒకేసారి వస్తానని గిరిజనులకు చెప్పి చిలకలగుట్టవైపుగా వెళ్లి అక్కడ మాయం అయిపోతుంది. ఆ ప్రాంతంలో గిరిజనులకు పసుపు, కుంకుమలు కనిపిస్తాయి. దీంతో సమ్మక్క, సారక్కలను ఇద్దరినీ వానదేవతలుగా పిలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు గిరిజనులు. ఒఒక కుంకుమ భరిణెగా గిరిజనులకు కనిపిస్తుంది. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న ప్రతాప రుద్రుడు సమ్మక్క సారక్కల భక్తుడిగా మారిపోతాడు. గిరిజనులు కట్టాల్సిన శిస్తులను రద్దు చేయడమే కాకుండా.. రెండేళ్లకు ఒకసారి అక్కడ జాతర నిర్వహించడానికి సంకల్పించాడు. ఇదీ సమ్మక్క-సారక్కల చరిత్ర. Also Read: మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!! జాతర ఇలా.. 1946 వరకు చిలకలగుట్ట గిరిజనులు మాత్రమే చిన్న పట్టణంలో ఈ జాతరను జరుపుకునేవారు. 1960 నుండి తెలంగాణ ప్రజలందరూ ఈ జాతరలో పాల్గొనడం ప్రారంభించారు. 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మక్క-సారక్క(Sammakka-Sarakka) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇక అప్పటి నుంచి దీనిని ఒక పెద్ద ఉత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. జాతర నిర్వహించే విధానం ఇలా.. జాతర నాలుగు రోజులు జరుగుతుంది. కానీ, సన్నాహాలు.. పూజలు 10రోజుల ముందుగానే మొదలవుతాయి. సమ్మక్క-సారక్కలకు పది రోజుల ముందుగానే గిరిజన పూజారులు పూజలు నిర్వహిస్తారు. జాతరలో భాగంగా తొలిరోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెవాడకు తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తారు. రెండో రోజు చిలకల గుట్టలో పసుపు, కుంకుమ భరిణ రూపంలో తీసుకొచ్చి గద్దెపై పెడతారు. దేవతామూర్తులను సింహాసనంపై ప్రతిష్ఠించే సమయంలో భక్తుల సందోహం చేసే సందడితో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. ఈ జాతరలో 'శివసత్తు' పూనకాలు అత్యంత ఉత్సాహంగా ఉంటాయి. మూడోరోజు ఇద్దరు అమ్మవార్లను గద్దెలపై కొలుస్తారు. నాల్గవ రోజు మధ్యాహ్నం, ఆవాహన తర్వాత, దేవతలను తిరిగి తమ అసలు స్థానానికి చేరుస్తారు. ఇక ఇక్కడ భక్తులు తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు బెల్లం సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకతలివే.. సమ్మక్క - సారక్క జాతర గిరిజన తెగలలో అతిపెద్ద పండుగ. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కోచే గుర్తింపు పొందింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమ్మక్క-సారక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. విగ్రహాలు లేని చారిత్రక ఉత్సవం శ్రీ సమ్మక్క సారక్క జాతర ఈ పండుగ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సమ్మక్క సారక్కల ఇద్దరి శాపం వల్లే కాకతీయ సామ్రాజ్యం పతనమైందని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాల నుండి కాకుండా తెలంగాణ నలుమూలల నుండి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి తండోపతండాలుగా వస్తారు. Watch this interesting Video: #sammakka-saralamma-jatara #sammakka-saralakka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి