Women in Politics: రాజకీయ రణరంగంలో బీసీ మహిళా యోధులు

New Update
Women in Politics: రాజకీయ రణరంగంలో బీసీ మహిళా యోధులు

BC Women in Telangana Politics: ఇదివరకెన్నడూ లేనంతగా బీసీ రాజకీయ వాదం ప్రస్తుత ఎన్నికలను శాసిస్తోందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏకంగా తెలంగాణలో బీసీ నాయకుడే సీఎం అయితాడని ఒక జాతీయ పార్టీ ప్రకటించే స్థాయికి పోయిందంటే, ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిపోతున్న బీసీ రాజకీయ వాదానికి వెయ్యేనుగుల బలం చేకూరినట్టే. అయితే ఇన్నేళ్ళుగా బహుజనవాద రాజకీయాల గురించి మాట్లాడిన నాయకులు, సంఘాలు తమ వైఖరిని ఇప్పటికింకా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రెండు ప్రధాన జాతీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు పోతుండగా, అసలు మేనిఫెస్టో అవసరమే లేదన్నట్లు కేసీఆర్ మాటల తూటాలు హామీలు అన్నట్లుగా ప్రజా దర్బారులో నిలబడింది ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ. దీనికి కారణం కూడా లేకపోలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోతో పోయిన వీరికి ఆ తర్వాత ఎదురైన చేదు  అనుభవాలు ఆలాంటివి అన్నట్లు. అందుకేనేమో ఎక్కడ ఎలాంటి హామీ ఇవ్వాలన్నా ఆచీతూచీ మరీ మాట్లాడుతున్నారు బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం.

ముగ్గురు బీసీ మహిళా ఉద్దండులు
ఓపెన్ కేటగిరీ సీట్లల్లో బీసీ నాయకులకు అగ్రస్థానం ఇచ్చినట్టే, మహిళలకు సైతం మిగతా పార్టీల కంటే ఎక్కువగా సీట్లు కట్టబెట్టింది బీజేపీ పార్టీ. అందులో బీసీ మహిళలు, యువ మహిళలు ఉండడం, భవిష్యత్తులో మహిళా ప్రాతినిధ్యానికి ఇదొక భరోసా ఇచ్చే ప్రయత్నమని చెప్పాలి. ప్రతిసారీ ఎన్నికల్లో ఎవరో కొందరు మహిళలు పోటీ చేయడం.. గెలిస్తే అసెంబ్లీకి పోవడం, లేకపోతే ఇంటికే అన్నట్లుగా ఆంటీ అంటనట్టుగా నడిచేది మహిళా రాజకీయం. ఇక బీసీ మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే ఉండేది. ఇందుకు భిన్నంగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా రాజకీయ రణరంగంలో ముందుకెళ్తున్నారు బీసీ మహిళా అభ్యర్థులు. అందులో ముఖ్యంగా జగిత్యాల నుండి భోగ శ్రావణి, రామగుండం నుండి  కందుల సంధ్యారాణిలతో పాటు పెద్దపల్లి నుండి దాసరి ఉష.. ముగ్గురూ బీసీ మహిళా ఉద్దండులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో రాజకీయాల్లో తలపండిపోయిన అగ్ర కుల పురుష అభ్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్నారు.
వీరికి తోడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొడిగె శోభ కూడా చొప్పదండి నుండి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటోంది. ఇందులో అందరూ గెలిచినా ఏ ఒక్కరు గెలిచినా కూడా వచ్చే ప్రభుత్వానికి ముచ్చెమటలు పుట్టిస్తారు. వారి హక్కుల కోసం బహుజన రాజకీయం దిశగా వీరి ప్రణాళిక ఉంటుందని అంతర్గత సమావేశాల్లో చెప్తున్న మాటలు. అంటే తెలంగాణలో భవిష్యత్ బహుజన రాజకీయం అంతా ఇలాంటి మహిళా నాయకుల చేతుల్లోనే ఉండబోతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ సారి అసెంబ్లీలో మహిళా ప్రభంజనం ఉండకపోదేమో అనిపిస్తోంది. ఒకవైపు లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొందటం, రాబోయే రోజుల్లో రానున్న నియోజకవర్గాల పునర్విభజన కూడా భవిష్యత్ మహిళా నాయకురాళ్లకు ఒక ఆశా దీపాన్ని చూపిస్తోంది.

ఇక ఇప్పుడున్న మహిళాధిపత్య నియోజకవర్గాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగిత్యాల. ఇక్కడ కాంగ్రెస్ కురువృద్ధుడిగా, అజాత శత్రువుగా పేరొందిన జీవన్ రెడ్డి ఏడోసారి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ప్రస్తుతం  సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, దగ్గరి చుట్టంగా కూడా చిరపరిచుతుడు కావడంతో పాటు, గత కొన్నేళ్లుగా ఆయన ఆస్తి ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు పెరిగిపోవడంతో ఎదురే లేదన్నట్లుగా సాగింది సంజయ్‌ పాలన. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఆయన మీద అసంతృప్తి పెరిగింది. ఆయన ఆగడాలకు అదుపు లేకుండా ఉండడంతో పాటు అసభ్య ప్రవర్తన నచ్చక గతేడాది బీఆర్‌ఎస్‌ నుండి బయకొచ్చిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి అతి చిన్న వయసులోనే అసెంబ్లీ పోరుకు బీజేపీ తరుపున సిద్ధమైంది. ఆమె ప్రచార శైలి, ఆమెకు ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు.. ఒక విద్యాధికురాలిగా, ఒక యువ మహిళగా, ఒక బీసీ వాదిగా ఇద్దరు రాజకీయ ఉద్దండుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. తన గెలుపు ఖాయమంటూ, కల్వకుంట్ల కుటుంబం మీద ఒకపక్క విరుచుకుపడుతూనే, మరోపక్క కాంగ్రెస్ పార్టీని చెండాడుతూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తోంది. ఈమె ఆత్మవిశ్వాసమే ఈమెకు కొండంత బలం. భవిష్యత్తులో రాబోయే మహిళా రాజకీయాల్లో ఆమె కీలకంగా ఉండబోతోందని చెప్పడం కూడా సమంజసమే.

ఇక రెండో నియోజకవర్గం రామగుండం, అక్కడి నుండే కందుల సంధ్యారాణి బీజేపీ తరుపున పోటీ చేస్తోంది. ఎన్నికల ముందు వరకు తానొక సాధారణ కార్పొరేటర్.  సోమారపు సత్యనారాయణ బీజేపీని వీడడంతో ఏర్పడ్డ ఖాళీని పూర్తిచేస్తా, బొగ్గుగనుల సిరిగుండం రామగుండంలో కాషాయ జెండాను ఎగిరేస్తా అంటూ అనూహ్యంగా తెరపైకి వచ్చి, ఒకపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు ముచ్చెటమలు పుట్టిస్తున్న సంధ్యారాణి.. కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ నుండి ప్రధాన పోటీ ఎదుర్కొంటోంది. నామినేషన్ వేసిన రోజునే కర్రసాము చేసి మరీ తానేంటో నిరూపించుకున్న సంధ్యారాణికి తనకున్న మాటకారితనం, నేర్పరితనం, వాగ్ధాటి మరో అసెట్ అనే చెప్పుకోవాలి. స్థానిక యువతతో పాటు మహిళలు, స్థానిక ఆలయ ఫౌండేషన్ ముఖ్యులు ఈమెకు తోడ్పాటుగా ఉంటూ, మా బహుజన వర్గాల ప్రతినిధిగా మా సంధ్యక్కను అసెంబ్లీకి పంపించుకుంటామని ప్రతిన బూని మరీ పని చేస్తున్నారు.

ఇక మరో అగ్ని కణిక పెద్దపల్లి నుండి పోటీ చేస్తున్న దాసరి ఉష. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన ఐఐటీ గ్రాడ్యుయేట్‌. ఎంతో ఉత్తమమైన భవిష్యత్తును సైతం తృణప్రాయంగా వదులుకొని బహుజన రాజకీయాల పేరిట అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి, అతికొద్ది సమయంలోనే రాష్ట్ర బీఎస్పీలో కీలకంగా మారిన ఈ యువకెరటం ప్రస్తుతం పెద్దపల్లి నుండి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది ఈ ఉషాకిరణం. పెద్దపల్లి రాజకీయాల్లో పండిపోయిన దాసరి మనోహర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావులకు చుక్కలు చూపిస్తూ, వాళ్ళతో పోలిస్తే తానేమీ తక్కువ కాదన్నట్లు అందరికంటే ప్రచారంలో ముందంజలో ఉంది. ఇక్కడ పోటీ ద్విముఖమే అంటే మనోహర్ రెడ్డి, ఉషల మధ్యలోనే ఉంటుందన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. కావున ఇంకొంచెం కష్టపడితే ఉష అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చు.

ఆత్మగౌరవాన్ని చాటిచెబుదాం..
విచిత్రమైన పరిస్థితి ఏందంటే జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలతో పాటు, తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ కూడా తమ తమ బీసీ మహిళా అభ్యర్థులను పట్టించుకోకపోవడం భవిష్యత్ తెలంగాణ రాజకీయాలకు చెంపపెట్టు లాంటిది. మహిళల పట్ల, బీసీల పట్ల వారికున్న చిత్తశుద్ధికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఈ పార్టీలు నోరు తెరిస్తే దేశ ప్రజల సంక్షేమం అంతా తామే చేస్తున్నట్లు, బహుజనులకు తమతోనే రాజకీయ బతుకు అన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ, పబ్బం గడుపుకుంటున్నాయి. కానీ చేతల విషయానికి వచ్చేసరికి మొండి చెయ్యి చూపెడుతున్నాయి. అందుకే బహుజన సబ్బండ వర్గాలకు చెందిన మహిళలంతా ఏకతాటిమీదికొచ్చి తమ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకోవాలని బహుజన హక్కుల నాయకులుగా సవినయంగా కోరుతున్నాం.

కాస్తో కూస్తో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన బీజేపీ, బీఎస్పీ పార్టీల అభ్యర్థులను ఒకవైపు గెలిపించుకుంటూనే, మరోవైపు ఇండిపెండెంట్, చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులను సైతం గెలిపించుకొని సగర్వంగా సిద్ధమవ్వాలి. తద్వారా మాత్రమే పురుషాధిపత్య ప్రపంచపు గోడలను ఛేదించగలుగుతుంది మన ఈ మహిళా లోకం. దేశ జనాభాలో సగభాగం ఉండే మహిళలు, చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోవడం అన్నది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద కళంకమే. రాబోతున్న మహిళా రిజర్వేషన్ల బిల్లును సైతం దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవకాశాల దృష్ట్యా తెలంగాణ మహిళా లోకమంతా తామేంటో నిరూపించుకోవాల్సిన, తమ హక్కుల పోరాటంలో ముందుండి నడవాల్సిన సమయమిది. అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు ఓటు హక్కు. తమ అభిమతాన్ని, రాజకీయ ఆకాంక్షలను ప్రపంచానికి తెలిసే విధంగా ఒక హెచ్చరిక పంపేలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

- డాక్టర్ కిరణ్ దాసరి Ph.D.
సోషల్‌ యాక్టివిస్ట్‌, ఇంటలెక్చువల్‌
+91 6301849448

Advertisment
Advertisment
తాజా కథనాలు