Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు సవాల్ విసురుతున్న ఆ ఇద్దరు.. వారి ధైర్యం అదేనా?!

అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఈసారి ఉత్కంఠభరితమైన పోరు సాగనున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. వీరిద్దరూ కేటీఆర్‌ను ఓడించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు సవాల్ విసురుతున్న ఆ ఇద్దరు.. వారి ధైర్యం అదేనా?!

Sircilla Assembly Constituency: చేనేత కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గం సిరిసిల్ల(Sircilla). నాడు ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో భాగమైన సిరిసిల్ల.. నేడు రాజన్న సిరిసిల్ల పేరుతో ప్రత్యేక జిల్లాగా అవతరించింది. చేనేతలు అధికంగా ఉండే సిరిసిల్లను ఒకప్పుడు ఉరిసిల్ల అని పిలిచేవారు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సిరిసిల్లలో పూర్తిగా కాకపోయినా.. ఎంతో కొంత మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత సిరిసిల్ల నియోజకవర్గానికి మూడవ సారి ఎన్నికలు జరుగనున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు కేటీఆర్. ఇప్పుడు ఐదసారి పోటీకి సిద్ధమయ్యారు. 30 నవంబర్ 2023న జరుగనున్న ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి అయిన కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఐదవ సారి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి కొండం కరుణ మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ రెడ్డి బరిలో ఉన్నారు. మరి సిరిసిల్ల నియోజకవర్గం ఎవరి బలం ఎంత.. ఎవరి ప్రొఫైల్ ఏంటో ఓసారి చూద్దాం..

కేటీఆర్..

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రతి ఎన్నికకు తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. తనదైన ప్రత్యేక శైలితో అటు క్లాస్.. ఇటు మాస్ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ నాలుగు పర్యాయాలు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. నాడు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన కేటీఆర్.. 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి ఎన్నికలో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన కేటీఆర్.. ఆ తరువాత నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి ఎన్నికలో తన మెజార్టీని పెంచుకుంటూ గెలుస్తూ వచ్చారు. 2009, 2010(ఉపఎన్నిక), 2014, 2018 వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి 2023 ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగానే కాకుండా.. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలను నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక పథకాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధే ఆయన బలంగా చెప్పుకోవచ్చు. తాను చేసిన పనులే తానను గెలిపిస్తాయని కేటీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

Also Read: వారిని ఖచ్చితంగా జైల్లో వేస్తాం.. ప్రధాని మోదీ సంచలన కామెంట్స్..


కేకే మహేందర్..

విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలంతో ఉద్యమాల్లో పాల్గొన్నారు కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల నియోజకవర్గానికే చెందిన మహేందర్ రెడ్డి.. తొలి నుంచి తెలంగాణ కోసం కొట్లాడారు. ఆ క్రమంలోనే టీఆర్ఎస్‌లో చేరి.. చాలా కాలం కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. కానీ, సిరిసిల్ల సీటు ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశారనే ఆగ్రహంతో పార్టీని వీడారు. సిరిసిల్ల సీటును కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు ఇవ్వడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2009లో స్వల్పంగా 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మహేందర్ రెడ్డి.. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన సిరిసిల్ల నుంచి కేటీఆర్‌పై పోటీ చేస్తూనే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతానని మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాణి రుద్రమ రెడ్డి..

వరంగల్‌లోని నర్సింపేటకు చెందిన రాణి రుద్రమ రెడ్డి.. టీవీ న్యూస్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆమె తెలంగాణ ఉద్యమంలో కీలక పోషించారు. అయితే, విభేదాల కారణంగా.. టీఆర్ఎస్‌కు దూరమయ్యారు. కొంతకాలం తరువాత భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవి రెడ్డి ఇద్దరూ కలిసి యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం స్థానానికి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుంచి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే బీజేపీ అధిష్టానం.. ఆమెను కేటీఆర్‌పై పోటీకి దింపింది. 2023 ఎన్నికల్లో సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు రాణి రుద్రమ దేవి రెడ్డి. ఉద్యమకారిణిగా, టీవీ న్యూస్ ప్రజెంటర్‌గా, బీజేపీ నాయకురాలిగా సుపరిచితమైన రాణి రుద్రమ.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. కేటీఆర్‌ను ఓడించి తీరుతానంటూ సవాళ్లు విసురుతోంది.

Also Read: కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు