Google AI Studio: ఇక యాప్ డెవలపర్లు దుకాణం సర్దుకోవడమే? గూగుల్ AI ఒక్క క్లిక్‌తో యాప్ రెడీ!

గూగుల్ AI స్టూడియోలోని ఉచిత AI టూల్‌తో కేవలం వారం రోజుల్లోనే 2.5 లక్షలకుపైగా ఆండ్రాయిడ్ యాప్‌లు రూపొందించారు. కోడింగ్ తెలియని వారికీ జెమినీ AI సహాయంతో సులభంగా యాప్‌లు తయారు చేసే అవకాశం లభిస్తోంది. త్వరలో నేరుగా ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేసే ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉంది.

New Update
Google AI Studio

Google AI Studio

Google AI Studio: గూగుల్ తీసుకొచ్చిన కొత్త AI టూల్ ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కోడింగ్ తెలియని వారికీ కూడా సులభంగా ఆండ్రాయిడ్ యాప్‌లు తయారు చేసే అవకాశం ఈ టూల్ ద్వారా లభిస్తోంది. గూగుల్ AI స్టూడియోలో అందుబాటులో ఉన్న ఈ ఉచిత AI ఫీచర్ ద్వారా కేవలం ఒక వారంలోనే 2.5 లక్షలకు పైగా ఆండ్రాయిడ్ యాప్‌లు రూపొందాయని గూగుల్ వెల్లడించింది.

ఈ విషయాన్ని గూగుల్‌లో జెమినీ టీమ్‌లో పనిచేస్తున్న లోగన్ కిల్పాట్రిక్ సోషల్ మీడియా వేదిక Xలో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఈ యాప్‌లను తయారు చేసిన వారిలో చాలా మందికి ఇంతకుముందు యాప్ డెవలప్‌మెంట్ అనుభవం కూడా లేదు. కోడింగ్ లేకుండానే ఇప్పుడు ఎవరైనా తమకు కావాల్సిన యాప్‌ను తయారు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

గూగుల్ AI స్టూడియోలో జెమినీ AI సహాయంతో యాప్ తయారీ చాలా సులభంగా మారింది. యూజర్లు తమకు కావాల్సిన యాప్ గురించి సాధారణంగా టైప్ చేస్తే, AI దానికి అవసరమైన కోడ్‌ను సృష్టించి యాప్‌ను తయారు చేస్తోంది. దీంతో విద్యార్థులు, చిన్న వ్యాపారులు, కంటెంట్ క్రియేటర్లు, హాబీగా యాప్‌లు చేయాలనుకునే వారు కూడా సులభంగా ఆండ్రాయిడ్ యాప్‌లు రూపొందించగలుగుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌కు 3 బిలియన్ కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్లు ఉన్నారని గూగుల్ తెలిపింది. అలాంటి భారీ యూజర్ బేస్ కోసం ఇప్పుడు ఎవరైనా యాప్ తయారు చేసే అవకాశం రావడం టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇది అసాధ్యంగా అనిపించేదని లోగన్ అన్నారు.

ఇప్పటికే యాప్ తయారీ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన గూగుల్, త్వరలో యాప్‌లను నేరుగా ప్లే స్టోర్‌లో పెట్టుకునే  అవకాశం కూడా వస్తుందని సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం AI స్టూడియో ద్వారా తయారైన యాప్‌లను ప్లే టెస్ట్ ట్రాక్‌లో విడుదల చేయొచ్చు. భవిష్యత్తులో నేరుగా ప్లే స్టోర్‌కు పంపే ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది.

అయితే ప్లే స్టోర్‌లో యాప్ విడుదల చేయడం అంత సులభం కాదు. డెవలపర్లు ముందుగా ప్లే కన్సోల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అవసరం అవుతుంది. అలాగే యాప్ వివరాలు, స్క్రీన్‌షాట్లు, ఐకాన్, ప్రైవసీ పాలసీ లింక్ వంటి వివరాలు ఇవ్వాలి.

దీనితో పాటు యాప్‌లో ప్రకటనలు ఉన్నాయా, ఏ వయస్సు వారికోసం యాప్ తయారు చేశారా, యూజర్ డేటా ఎలా వాడుతున్నారనే వివరాలు కూడా గూగుల్‌కు సమర్పించాలి. లొకేషన్, కాంటాక్ట్స్, SMS వంటి సెన్సిటివ్ అనుమతులు అడిగే యాప్‌లను గూగుల్ మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుంది.

యాప్‌ను ప్లే స్టోర్‌కు పంపిన తర్వాత గూగుల్ దానిని భద్రత, ప్రైవసీ, పాలసీ పరంగా చెక్ చేస్తుంది. ముఖ్యంగా కొత్త డెవలపర్ల యాప్‌లకు ఆమోదం రావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వారం రోజులకంటే ఎక్కువ సమయం కూడా పడొచ్చు.

AIతో తయారైన యాప్‌ల భవిష్యత్తుపై సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. కొందరు యూజర్లు యాప్ తయారీ సులభమవడం మంచిదే కానీ, ఆ యాప్‌లకు నిజమైన యూజర్లు దొరకడం పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన లోగన్, భవిష్యత్తులో ఆ సమస్యను కూడా పరిష్కరించేందుకు గూగుల్ పనిచేస్తుందని చెప్పారు.

మరికొందరు AIతో తయారైన యాప్‌లు ప్లే స్టోర్ క్వాలిటీని తగ్గించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన లోగన్, ప్లే స్టోర్‌లో నాణ్యత ప్రమాణాలు ఎప్పటికీ కఠినంగానే ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత ఉపయోగం కోసం చాలామంది యాప్‌లు తయారు చేసుకున్నా, ప్లే స్టోర్‌లో పబ్లిష్ అయ్యే యాప్‌లు మాత్రం నాణ్యత పరంగా మంచి స్థాయిలో ఉండాల్సిందే అని చెప్పారు.

ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ టూల్‌ను పరీక్షించే వరకు తనకే ఆండ్రాయిడ్ యాప్ తయారీ అనుభవం లేదని లోగన్ వెల్లడించారు. దీంతో AI టెక్నాలజీ ఎంత వేగంగా సాధారణ ప్రజలకు చేరువవుతోందో స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు