పాదయాత్రలో నారా లోకేశ్‌కు తప్పిన పెద్ద ప్రమాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా మీద పడటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

New Update
పాదయాత్రలో నారా లోకేశ్‌కు తప్పిన పెద్ద ప్రమాదం

ఒక్కసారిగా మీద పడిన జనం.. 

రాష్ట్రవ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా మీద పడటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చేతులు తాకేందుకు కూడా ఎగబడటంతో మూడు సార్లు కిందపడబోయారు. వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయినప్పటికీ ఆయన చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయాలతోనే పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్లారు.

కావాలనే కుట్ర చేస్తున్నారు.. 

లోకేశ్‌ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే పాదయాత్రకు పోలీస్ సిబ్బందిని తగ్గించిందని విమర్శిస్తున్నారు. జనాన్ని అదుపు చేయడంలో ఉన్న పోలీసులు కూడా విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే లోకేశ్ పాదయాత్రకు భద్రత తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కందుకూరు, గుంటూరు తరహా ఘటనలు మరోసారి జరిగేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తోపులాటలో లోకేశ్ కాళ్లు, చేతులకు గాయాలవడం పట్ల ఆందోళన చెందుతున్నారు.

పల్నాడు జిల్లాలోకి ఎంట్రీ.. 

ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఐదు నెలలు పూర్తిచేసుకుంది. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు, మహానాడు, ఇలా ఒకటి రెండు సందర్భాల్లో మినహా పాదయాత్ర సాగుతూనే ఉంది. ఇప్పటివరకు 2,200 కిలోమీటర్ల పైన ఆయన నడిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను పెద్ద ఎత్తున ఎండగడుతున్నారు. నేటి(ఆగస్టు 1) నుంచి పల్నాడు జిల్లాలోకి యువగళం ప్రవేశించనుంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. స్వాగత ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, శ్రీధర్‌‌ తదితరులు  పర్యవేక్షించారు. మరోవైపు జిల్లాలో పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు