ఢిల్లీలో టీ బీజేపీ సందడి: 4 గురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిక తెలంగాణ కాంగ్రెస్ నుంచి నలుగురు ప్రముఖులు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ నేతల సమక్షంలో ఈ చేరికలు సాగాయి. ఇప్పుడు బీజేపీలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది. By Pardha Saradhi 29 Jul 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న టీబీజేపీలో చైతన్యం పెరిగింది. తెలంగాణ బీజేపీలో అసమ్మతికి, అలకలకు చెక్ పెడుతూ, పార్టీ అధిష్టానం నాయకత్వంలో మార్పులు చేర్పులు చేసింది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇప్పటి వరకూ టీబీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవటం ద్వారా నాయకుడిగా సంజయ్ కే కాదు, పార్టీలో ఆయన అభిమానులనూ సంతృప్తి పరిచింది. ఇప్పుడిక ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీసింది. ఇతర పార్టీల్లో నేతలను బీజేపీలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా 4గురు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంది. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నటి జయసుధ కూడా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యిందని చెబుతున్నారు. ఆమె బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకె అరుణ, ఈటల రాజేందర్ లు అధిష్టానం పిలుపుపై ఢిల్లీ వెళ్లారు. దేశరాజధానిలో అగ్రనేతల సమక్షంలో పార్టీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. వారి సేవలు ఉపయోగించుకుంటాం: కిషన్ రెడ్డి కాంగ్రెస్ నేతల చేరికను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతించారు. వారి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇలా సాగాయి. ''రంగారెడ్డి ఎన్ ఎస్ యూ ఐ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి విశేష సేవలు అందించారు. ఆయనకు బిజెపిలోకి స్వాగతం పలుకుతున్నాం. రంగారెడ్డి సేవలను, రాజకీయ అనుభవాన్ని బీజేపీకి ఉపయోగించుకుంటాం. అలాగే అజాత శత్రువుగా ఉన్న రాజేందర్ కి మంచి పేరుంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. తెలంగాణ రాజకీయాల్లో విశేష సేవలు అందించిన బాగారెడ్డి గారి కుమారుడు జైపాల్ రెడ్డి కూడా చేరారు. ఈ కుటుంబం ఇందిరా గాంధీతో ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉంది. వారి చేరిక బీజేపీకి లాభం చేస్తుంది. రంగారెడ్డి తాండూరులో పేరున్న కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరారు" అని ఆయన వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ముక్కోణపు ప్రేమ కథ కాంగ్రెస్, బీఆర్ ఎస్ ఏమైఎం పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని అన్నారు. మోడీ సర్కారు మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఈ మూడు పార్టీలు సంతకాలు చేశాయి. ఇప్పుడు ఈ ముగ్గురూ బీజేపీని విమర్శిస్తున్నాయి. ఇవి ఎన్నికలకి ముందు, లేదా తర్వాత కలిసి పనిచేసి, ప్రయాణం చేసే పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. కేసిఆర్ అవినీతి, అహంకార, కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని అన్నారు. ఏ రోజు కూడా బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు. ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడున్నది డూప్లికేట్ కాంగ్రెస్: రంగారెడ్డి ''ఇప్పటి రాజకీయాల్లో ఆయారాం, గయారాం వంటి నేతల హవా నడుస్తోంది. డబ్బు సంచులతో వచ్చిన వారికే పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయ"ని బీజేపీలో చేరిన రంగారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు. తాను 1978 నుంచి కాంగ్రెస్ లో ఉన్నానని, డీకే అరుణ బీజేపీలో చేరాక.. ఒరిజినల్ కాంగ్రెస్ తమదే అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ డూప్లికేట్ అని విమర్శించారు. ఎన్నో దశాబ్దాలుగా తాము పార్టీలో పనిచేస్తున్నా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమను గుర్తుపట్టలేరని అలాంటి పార్టీలో ఎలా ఉండగలనని వ్యాఖ్యానించారు. ''ఈ మధ్య పార్టీలో ఒక నేత చేరితే స్వాతంత్ర్య సమర యోధుడు చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారు ఆయన కూడా రెండు పార్టీలతో బేరం ఆడి చేరిన నేత" అని విమర్శించారు. సూర్యుడు మరో దిక్కున ఉదయించినా సరే తెలంగాణలో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఒక సామాన్య కార్యకర్త ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధ్యక్షుడు ఇలా ఎంతో కీలక పదవులు పొందగలిగే పరిస్థితి ఒక్క బీజేపీలోనే ఉందని వ్యాఖ్యానించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి