ఢిల్లీ లిక్కర్ స్కాం.. సుప్రీంకోర్టులో కవితకు స్వల్ప ఊరట

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఈడీపై దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవొచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

New Update
ఢిల్లీ లిక్కర్ స్కాం.. సుప్రీంకోర్టులో కవితకు స్వల్ప ఊరట

కవిత పిటిషన్ పరిగణనలోకి..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం స్పష్టంచేసింది. కవిత పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజైన్డర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి కవిత తరఫున వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే.రామచందర్ రావు హాజరయ్యారు. మహిళను విచారణ కోసం ఆఫీస్‌కు పిలవడం చట్టవిరుద్ధమని గతంలో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌లో వేశారు. అయితే ఈ అంశంపై విచారణను వాయిదావేస్తూ వస్తున్న ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణకు స్వీకరించింది.

కవితను పలుమార్లు విచారించిన ఈడీ..

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కవితపై అభియోగాలు రావడంతో ఆమెను సీబీఐ, ఈడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. పాత ఫోన్లతో విచారణకు హాజరైన కవిత ఈడీ అధికారి జోగేంద్రకు లేఖ రాశారు. పాత ఫోన్లను ఈడీకి సమర్పించి తనపై చేసిన ఆరోపణలు అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఈడీ తనపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నా.. గతంలో తాను వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని లేఖలో తెలిపారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కల్గించదా? ప్రశ్నించారు. ఆ సమయంలో మహిళను కార్యాలయానికి పిలిచి విచారించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. విచారణ సమయంలో ఆమెను అరెస్ట్ చేస్తారనే వార్తలు హల్‌చల్ చేశాయి. నిందితులను కవిత కలిశారని.. సమావేశం కూడా అయ్యారని పలు అభియోగాలను దర్యాప్తు సంస్థలు మోపాయి.

లిక్కర్ స్కాం ఎలా బయటపడింది?

ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. మార్చి 2021లో ఈ కమిటీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని.. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.9,500కోట్లు పెరుగుతుందని సిఫార్సు చేసింది. నవంబర్ 2021లో లెఫ్టనెంట్ గవర్నర్ కొత్త పాలసీకి ఓకే చెప్పారు. అయితే నరేష్ కుమార్ కొత్త చీఫ్ సెక్రటరీగా వచ్చిన వెంటనే లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. కొత్త పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేశారని.. రూ.628కోట్ల అవినీతి జరిగిందని ఓ నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ఆధారంగా ఎల్జీ 2022జులైలో సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ ప్రతినిధిగా కీలకంగా వ్యహరించిన అరుణ్ పిళ్లై, మధ్యవర్తి సుకేశ్ చంద్రశేఖరన్ వంటి వారిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా విచారించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు