EVM: ఈవీఎంలపై మళ్లీ మొదలైన రచ్చ.. ఈ సారి శ్యాం పిట్రోడా!

ఈవీఎంలలో లోపాలు సరిచేయకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలుచుకోగలదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా గురువారం వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామన్న బీజేపీ ప్రకటనపై ఆ విధంగా స్పందించారు.

New Update
EVM: ఈవీఎంలపై మళ్లీ మొదలైన రచ్చ.. ఈ సారి శ్యాం పిట్రోడా!

EVM: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఈవీఎంలపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈవీఎంలకు సంబంధించి లోపాలు పరిష్కరించకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలుచుకోగలదని శాం పిట్రోడా గురువారం వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలవబోతున్నట్లు బీజేపీ ధీమా వ్యక్తం చేయడంపై పిట్రోడాను ప్రశ్నించగా, ఆయన పై విధంగా స్పందించారు. ఈవీఎంలలో లోపాలను సరిచేస్తే 400 సీట్ల గెలుపు ప్రకటన నిజం కాకవపోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!

2024 లోక్‌సభ ఎన్నికలు దేశ భవితవ్యాన్ని నిర్ణయించనున్నవి కాబట్టి ఈవీఎంలను తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్న పిట్రోడా కాంగ్రెస్, ఇండియా కూటమి సభ్యులను కోరారు. ఈవీఎంలలో అవకతవకల వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి. లోకూర్ అధ్యక్షతన 'ది సిటిజన్స్ కమిషన్ ఆన్ ఎలక్షన్స్' అనే ఎన్జీవో రూపొందించిన నివేదికను పిట్రోడా ఉదహరించారు. ప్రస్తుత వీవీ ప్యాట్ వ్యవస్థ డిజైన్‌ను మరింత విశ్వసనీయంగా మార్చడం వంటి ప్రధాన సిఫార్సులను ఆ కమిషన్ చేసిందని చెప్పారు.

‘‘ఈ నివేదిక ఆధారంగా విశ్వాస లోపం ఉందని నేను భావిస్తున్నాను. ఎన్నికల సంఘం స్పందించి ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి’’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు. కాగా, ఈవీఎంలపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ తన ఓటమికి కారణాలను అన్వేషించుకోకుండా సాకులు వెతుకుతోందంటూ విమర్శించింది. ‘‘వాళ్లు ఒక రాష్ట్రంలో గెలిచినప్పుడు అక్కడ వేరే ఈవీఎం ఉందా? వాళ్లను చూసి జనాలు కూడా నవ్వుకుంటున్నారు. కంప్యూటర్లు కొన్నామని చెప్పుకునే వారే నేడు టెక్నాలజీని వ్యతిరేకిస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పిట్రోడా వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్ నాయకుల్లో పిట్రోడానే మొదటి వ్యక్తి కాదు.. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 సీట్లు మాత్రమే గెలుపొందగా, బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: పట్టణంలో ఉండి కూడా ప్రభుత్వ పథకాలకు అప్లే చేసుకోవచ్చు..!

నిజానికి, దిగ్విజయ్ సింగ్ చాలా కాలంగా ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈవీఎంలపై నివేదికను ఉటంకిస్తూ దిగ్విజయ్ వీవీప్యాట్ స్లిప్పులను ఓటర్లకు అందజేయాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. తమకు వీవీప్యాట్ స్లిప్పులను విడిగా అందించాలని, వాటిని ప్రత్యేక బ్యాలెట్ బాక్స్‌లో ఉంచుతామని, లెక్కింపునకు ముందు ఏవైనా 10 బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను లెక్కించి కౌంటింగ్ యూనిట్ నుంచి వచ్చిన ఫలితాలతో వాటిని సరిపోల్చాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు. దీంతో ఎన్నికల కమిషన్‌కు ఇబ్బందేమిటని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుప్రీం కోర్టును అభ్యర్థిస్తున్నామంటూ దిగ్విజయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు