Hyderabad Book Fair: హైదరాబాద్‌లో పుస్తకాల పండుగొచ్చింది

హైదరాబాద్‌లో పుస్తకాల పండగ ప్రారంభమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనలో.. తొలిరోజు మధ్యాహ్నం నుంచే పాఠకుల సందడి మొదలైంది. ఈ నెల 19 వరకు ప్రదర్శన కొనసాగనుండగా.. ఈ దఫా మొత్తం 362 స్టాళ్లు ఏర్పాటు చేశారు.

New Update
Hyderabad Book Fair: హైదరాబాద్‌లో పుస్తకాల పండుగొచ్చింది

తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాద్‌లోని గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తుంది హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్‌ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో ఈ పుస్తక ప్రదర్శన జరగనున్నది.

మనకు మనంగా చదువుకుని పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలని, ఎవరికైతే జ్ఞానం అందక అన్నింటిలో వెనుకబడి వున్నారో వాళ్ళకు జ్ఞానాన్ని అందించే పనినే కవులు, రచయితలు, కళాకారులు, సృజనకారులు, సామాజిక కార్యకర్తలు, కలంయోధులు ప్రతి కాలంలో చేస్తూ వస్తున్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి పుస్తకానికుంది. భావితరాల్ని తీర్చిదిద్దే శక్తి తరగతి గదికి ఉంది, మకిలపట్టిన సమాజం బూజు దులిపే పనిముట్లుగా పుస్తకాలు ఉపయోగపడతాయన్న అచంచల విశ్వాసంతో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ 3 దశాబ్ధాల కాలంగా ముందుకు సాగుతుంది.

చినిగిన చొక్కనైనా తోడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు గురజాడ. ఆ మాటను నిజం చేస్తూ ఈ నెల 9 నుంచి పుస్తకాల పండుగ ప్రారంభం కానుంది. పుస్తకం మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. నూతన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పుస్తకమే పునాది. హక్కుల కోసం ఉద్యమించేలా పురిగొల్పేది పుస్తకమే. ప్రపంచ స్థితిని, గతిని మార్చింది అక్షరమే. అన్యాయాలు, అణిచివేతలు, దోపిడీ పీడనలు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేది పుస్తకమే.

సాహితీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాల పండుగ రానే వచ్చింది. మనలోని కారుచీకట్లను తొలిగించి జ్ఞాన వెలుతురును ప్రసరింపజేసేందుకు నగర లోగిళ్లలో సందడి చేస్తున్నది. ఆత్మీయంగా పలకరించి హస్తభూషణంగా మారుతున్నది. దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుగాంచిన హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటున్నది. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఈ నెల 19 వరకు పుస్తక ప్రియులను అలరించనున్నది ఈసారి బుక్‌ ఎగ్జిబిషన్‌లో మొత్తం 360 స్టాళ్లు ఉండనున్నాయి. 10లక్షల పుస్తకాలు.. ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ సాహిత్య వేడుకను హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బుక్‌ ఫెయిర్‌ సొసైటీకి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది.

భారతీయ భాషల సాహిత్య వేదిక హైదరాబాద్‌..

దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుగాంచిన హెచ్‌బీఎఫ్‌.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూతో పాటు ఇతర భారతీయ భాషల సాహిత్యం లభిస్తుంది. దీంతో పాటుగా బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కథల పుస్తకాలు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్‌ వివిధ పబ్లికేషన్స్‌ వారి మెటీరియల్స్‌ కూడా ఈ పుస్తక ప్రదర్శనలో లభించనున్నాయి.

గ్రామీణ గ్రంథాలయాల కోసం పుస్తక వితరణ..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ గ్రంథాలయాల కోసం హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలను వితరణ చేయడం ప్రత్యేకత. బుక్‌ ఎగ్జిబిషన్‌ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8.30వరకు కొనసాగనుంది. శని, ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రారంభమై రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది.

-మధుకర్ వైద్యుల

ఙ్ఞాన తెలంగాణ నిర్మాణమే లక్షం

జ్ఞానతెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలు ఒకమెట్టుగా ఉపయోగపడాలన్న ధ్యేయంతో ముందుకు సాగటం వల్ల రాష్ట్ర అవతరణ తర్వాత పుస్తక ప్రదర్శనలు భారీగా విజయవంతం అవుతూ వస్తున్నాయి. గత పదేళ్ళుగా హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన టీమ్‌ వర్కుగా ముందుకు సాగటం వల్ల ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా రూపుదాల్చింది. మా టీమ్‌కు గత రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకరిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ పుస్తక ప్రదర్శనలకు ప్రభుత్వం దగ్గర్నుంచి అన్ని పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు అన్ని వర్గాల ప్రజలు అండదండగా నిలిచారు. అందుకే హైదరాబాద్‌ పుస్తకాల పండగ వినాయక చవితి ఉత్సవంలాగా, రంజాన్‌ పండుగలాగా, క్రిస్టమస్‌ ఫెస్టివల్‌ లాగా పదిలక్షలమంది పుస్తకప్రియులు పాల్గొనే పుస్తక మహోత్సవంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పుస్తక ప్రదర్శనలకు అండదండగా నిలిచి ఎన్టీఆర్‌ స్టేడియం`తెలంగాణ కళాభారతి స్థలాన్ని 20 రోజులు ఉచితంగా ఇవ్వటం పెద్ద ప్రోత్సాహంగా మారింది.

- జులురు గౌరీశంకర్. అధ్యక్షులు హైదరాబాద్ బుక్ ఫెయిర్

పదిరోజుల పండుగ...

పది రోజులపాటు జరిగే 36వ జాతీయ పుస్తక జాతరలో 365 స్టాళ్లు ఉంటాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించి 184, ఆంగ్ల సాహిత్యానికి 144, పిల్లల పుస్తకాల కోసం 18, ప్రభుత్వం సమాచారంపై 7, మీడియా రంగం పుస్తకాల కోసం 15 స్టాళ్ల చొప్పున ఉంటాయి. ఈసారి బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్‌, వేదికకు ప్రముఖ కవి రవ్వా శ్రీహరి పేరిట నామకరణం చేశాము.

- కోయ చంద్రమోహన్. కార్యదర్శి. హైదరాబాద్ బుక్ ఫెయిర్

DO WATCH:

#rtv-exclusive #hyderabad-book-fair #hyderabad-book-exhibition
Advertisment
Advertisment
తాజా కథనాలు